Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడేండ్లలో 14,897 కోట్లు ఖర్చుపెట్టాం
- అభివృద్ధిలో ఎక్కడా వ్యత్యాసం, వివక్ష చూపట్లేదు : మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే పాతబస్తీ అభివృద్ధిలో వేగం పుంజుకున్నదనీ, ఏడేండ్ల కాలంలో తమ సర్కారు అక్కడ ఖర్చుపెట్టిన రూ.14,897 కోట్లే దానికి నిదర్శనమని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చెప్పారు. 'రాష్ట్రంలో అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం, హైదరాబాద్ పాతనగరంలో అభివృద్ధి కార్యకలాపాలు' అనే అంశంపై సోమవారం అసెంబ్లీలో లఘు చర్చ జరిగింది. ఈ చర్చను ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ ప్రారంభించగా.. సీఎల్పీ నేత మల్లుభట్టివిక్కమార్క బీజేపీ ఎల్పీ నేత రాజాసింగ్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడారు. సభ్యులు లేవనెత్తిన పలు అంశాలకు మంత్రులు కేటీఆర్, వెనుబడిన తరగతుల, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, హోంమంత్రి మహమూద్ అలీ వివరణలు ఇచ్చారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..అభివృద్ధి విషయంలో బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని ఎక్కడా చూడట్లేదనీ, పొరపాటున కూడా తమ ప్రభుత్వం వివక్ష చూపట్లేదని స్పష్టం చేశారు. పనుల ఆవశ్యకతను బట్టి ముందుకెళ్తున్నామన్నారు. తెలంగాణలో మార్పు తేవాలనుకుంటున్నామనీ, ఎవ్వరూ లేకుండా చూడాలనుకోవట్లేదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో 95 శాతం దాకా నీటి సమస్య తీరిపోయిందనీ, పాతబస్తీలో నీటిసరఫరా కోసం రూ.1082 కోట్లు ఖర్చుచేశామని వివరించారు. పాతబస్తీ పరిధిలోని నియోజకవర్గాల్లో 15, 897 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తున్నామనీ, ఇప్పటికే లబ్దిదారులకు వెయ్యి ఇండ్లను అందజేశామని తెలిపారు. రామప్ప మాదిరిగానే సెవెన్ టూంబ్స్, గోల్కొండకు ప్రపంచ వారసత్వ సంపద హోదా దక్కేలా కృషి చేస్తామని హామీనిచ్చారు. స్వచ్ఛ ఆటోలు పాతబస్తీ పరిధిలో 716 ఉన్నాయనీ, త్వరలో మరో 500 ఇస్తామని ప్రకటించారు. పాత నగరంలోని పర్యాటక ప్రాంతాల్లో 24 గంటలూ నిరంతరాయంగా పారిశుధ్య పనుల ప్రక్రియ కొనసాగుతున్నదని తెలిపారు. అక్కడ బస్తీదవాఖానాలు 84 ఉన్నాయనీ, త్వరలో మరో 25 ప్రారంభిస్తామని ప్రకటించారు. అక్కడ మెట్రో లైన్ విస్తరణ పనుల్లో ఆలస్యం జరిగింది వాస్తవమేననీ, వీలైనంత త్వరలో పాతబస్తీ ప్రజలకు మెట్రోరైలును అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. మీర్ అలం చెరువును అభివృద్ధి కోసం 40 కోట్ల రూపాయలు ప్రతిపాదించామన్నారు. పాతబస్తీలో ప్లైఓవర్ల నిర్మాణం వేగంగా జరుగుతున్నదనీ, ఇప్పటికే కొన్ని ప్రారంభించామని చెప్పారు. రోడ్ల విస్తరణ కోసం ప్రత్యేకంగా రూ.400 కోట్లు కేటాయించామన్నారు. ఎమ్ఎమ్టీఎస్ రెండోలైన్ విస్తరణకు నిధుల విడుదలపై సీఎం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. శివాజీనగర్‌లోని దేవాలయంలో కళ్యాణమండపం, మహంకాళి ఆలయం విస్తరణ పనులకు నిధులు విడుదల చేస్తామని హామీనిచ్చారు.
అందరికీ సమన్యాయం : మంత్రి కొప్పుల ఈశ్వర్
తమ ప్రభుత్వం అందరికీ సమన్యాయం చేస్తున్నదనీ, కరీంనగర్ మేయర్‌గా రవీందర్‌సింగ్‌ను సీఎం కేసీఆర్ నియమించారని మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. ఉర్దూను రాష్ట్ర ద్వితీయ భాషగా గుర్తించామన్నారు. మైనార్టీ విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఎంతో ఖర్చుపెడుతున్నామని చెప్పారు. ముస్లిం మహిళలకు 10వేల కుట్టుమిషన్లు ఇచ్చామన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కింద ప్రోత్సాహకాలు అందజేస్తున్నామని చెప్పారు. స్థల వివాదం విషయంలో కోర్టులో కేసు ఉండటం వల్ల క్రిస్టియన్ భవన్ నిర్మాణం ఆలస్యమవుతున్నదన్నారు. స్కాలర్షిప్పులు, ఉన్నత చదువుల కోసం రుణసహాయం దరఖాస్తులను తీసుకుంటామని హామీనిచ్చారు.
మైనార్టీ బంధు ఇవ్వాలి : భట్టి
దళిత బంధు మాదిరిగానే మైనార్టీ బంధు ఇవ్వాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్లు ఇవ్వకపోవడం వల్ల 100కిపైగా కళాశాలలు మూతపడ్డాయన్నారు. వక్ఫ్‌బోర్డు భూములను పరిరక్షించడంలో రాష్ట్ర సర్కారు వైఫల్యం చెందిందని విమర్శించారు. దీనిపై హౌస్‌కమిటీ వేయాలన్నారు. వీధివ్యాపారులు ఎక్కువగా మైనార్టీలేననీ, వారిని ఆదుకోవాలని కోరారు. ఉస్మానియా ఆస్పత్రి ఖాళీ స్థలంలో నూతన భవనాన్ని కట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎల్పీ నేత రాజాసింగ్ మాట్లాడుతూ..పాతబస్తీలో చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వారు కరోనా వల్ల తీవ్రంగా నష్టపోయారనీ, వారిని ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.