Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ధర్నాలో సీఐటియూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు
నవతెలంగాణ-సిటీబ్యూరో
పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను బీజేపీ ప్రభుత్వం కాలరాస్తూ, కార్మికుల వెల్ఫేర్బోర్డులను నిర్వీర్యం చేస్తోందని సీఐటీయూ రాష్ట్రప్రధాన కార్యదర్శి సాయిబాబు అన్నారు. కార్మికుల కష్టార్జిత డబ్బులు ఎక్కడి వెళ్లాయని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని లేబర్ కమిషనర్ కార్యాలయం(అంజయ్య భవన్) ఎదుట తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ నేతృత్వంలో ధర్నాను నిర్వహించారు. 'చలో హైదరాబాద్' ధర్నాకు రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడారు. తెలంగాణలో ఉద్యమాలపై నిర్బంధాలు కొనసాగుతున్నాయన్నారు. రాష్ట్రంలో కార్మిక శాఖ మంత్రి కార్మికులకు చేసిందేమీ లేదన్నారు. కార్మిక శాఖమంత్రికి తన ఇంజినీరింగ్ కాలేజీలను చూసుకోవడానికే సమయం సరిపోవడం లేదని, ఇక కార్మికుల సమస్యలను ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు. నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దుచేసి, పాత 29చట్టాలను యదాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల ప్రమాద మరణానికి రూ.10లక్షలు, సహజ మరణానికి రూ.5లక్షలివ్వాలన్నారు. భవన నిర్మాణ కార్మికులవి గొంతెమ్మకోర్కెలు కావన్నారు. తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్.కోటంరాజు మాట్లాడుతూ కేసీఆర్‌కు ఎన్నికలపైవున్న సోయి కార్మికుల సమస్యలపై లేదన్నారు. రాష్ట్రంలోని 20లక్షల మంది భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులుంటే 12 ఏండ్లుగా 12.5లక్షల పేర్లనే బోర్డులో నమోదు చేశారన్నారు. వాటిలో 10.70లక్షల మందిని మాత్రమే రెన్యువల్ చేశారన్నారు. ప్రమాద మరణానికి రూ.10లక్షలు, సహజ మరణానికి రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. కార్మికుల పిల్లల పెండ్లిండ్లకు, ప్రసూతి కానుక రూ.లక్షకు పెంచాలన్నారు. 60సంవత్సరాలు నిండిన కార్మికులకు పెన్షన్, పిల్లలకు స్కాలర్ షిప్లివ్వాలన్నారు. తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని, కార్మిక సంక్షేమ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వంగూరు రాములు డిమాండ్ చేశారు. మోడీ, కేసీఆర్ కేటుగాళ్లేనని అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు చేసిందేమీ లేదన్నారు. సివిల్ సప్లరు శాఖకు అక్రమంగా తరలించిన రూ.1005కోట్ల నిధులను బోర్డులో జమ చేయాలన్నారు. వెల్ఫేర్ బోర్డులో పేర్ల నమోదు చేసుకునేందుకు రేషన్ కార్డులుండాలనే నిబంధన పెట్టారని, దీనివల్ల అర్హత ఉన్నా అనేక మంది భవన నిర్మాణ కార్మికులు కార్డులు పొందలేకపోతున్నారన్నారు. కార్మిక శాఖలో ఖాళీగావున్న ఏఎల్ఓ, ఏసీఎల్, డీసీఎల్ తదితర ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలన్నారు. వెల్ఫేర్ బోర్డులో వున్న 36వేల పెండింగ్ క్లైమ్స్‌ను పరిష్కరించి తక్షణమే నిధులు విడుదల చేయాలన్నారు. కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబాబు మాట్లాడుతూ అనేక పోరాటాలతో చట్టాలు సాధించుకుంటే మోడీ ప్రభుత్వం కాలరాస్తూ కార్పొరేట్ శక్తులు, ప్రయివేట్ యాజమాన్యాలకు లాభసాటిగా చేస్తున్నారన్నారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో వసూలు కాని సెస్సు బకాయిలను వెంటనే వసూలు చేయాలన్నారు. ధర్నా అనంతరం వినతి పత్రాన్ని లేబర్ జాయింట్ కమిషనర్ డాక్టర్ గంగాధర్‌కు సమర్పించారు. కార్మికుల సమస్యలు తన దృష్టికి వచ్చాయని, తన పరిధిలోని కార్మిక సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో కోశాధికారి ఎస్.రాంమోహన్, ఉపాధ్యక్షులు జి.కురుమయ్య, డి.లక్ష్మయ్య, బి.శ్రీనివాసులు, వి.గాలయ్య, కె.చంద్రారెడ్డి, కార్యదర్శిలు ముదాం శ్రీనివాస్, అనంతగిరి రవి, సీహెచ్ లక్ష్మినారాయణ, టి.ఉప్పలయ్య, యల్క సోమయ్య, కె.జంగయ్య, శ్రీశైలం, రాష్ట్ర నాయకులు గోనే రాములు, పిల్లి పుల్లారావు, సీఐటీయూ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీవన్కుమార్తోపాటు కార్మికులు పెద్దఎత్తున పాల్గొన్నారు.