Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసెంబ్లీలో సర్కారు తీరు
- కేంద్రంపై సీఎం పూలబాణాలు
- మండలిలో మంత్రి హరీశ్‌రావు నిష్ఠూరాలు
- 'చలో అసెంబ్లీ' ముట్టడులు
- మోహరించిన పోలీసులు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
''కొట్టినట్టు చేస్తా... ఏడ్చినట్టు చెరు'' అన్నట్టే ఉంది టీఆర్ఎస్, బీజేపీ పరిస్థితి. ఢిల్లీ వెళ్లి ప్రధాని సహా కేంద్రమంత్రులందరికీ వంగివంగి దండాలు పెట్టి, ఏకాంత చర్చలు జరిపివచ్చే సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మాత్రం కేంద్రంపై సుతిమెత్తగా దుమ్మెత్తి పోస్తున్నారు. అభివృద్ధికి సహకరించట్లేదం టున్నారు. కేంద్రమంత్రులూ అంతే. రాష్ట్రపర్యటనకు వచ్చి సీఎం కేసీఆర్‌తో కలిసి భోజనం చేసివెళ్తూ, మీ పాలన భేష్ అంటూ కితాబులిచ్చిపోతారు. కానీ రాష్ట్ర బీజేపీ నాయకత్వం మాత్రం కేసీఆర్‌పై గంగవెర్రులెత్తుతూ, లేస్తే మనుషులం కాదంటూ ఘీంకరిస్తూ ఉంటుంది. సోమవారం శాసనసభలో సీఎం కేసీఆర్, శాసనమండలిలో ఆర్థికమంత్రి టీ హరీశ్‌రావు కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడాక, అదే అంశంపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. కేంద్రం అన్యాయం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి తన ఇంటికి వస్తే భోజనం పెట్టిమరీ 'సహకరించండి' అని కోరితే పట్టించుకోలేదంటూ విమర్శలూ చేశారు. 'మంచిగ సెప్తే కేంద్రానికి సమజైతలేదు' అంటూ హెచ్చరికలూ చేశారు. రాజకీయంగా బీజేపీని ఎంతవరకు విమర్శించాలో అంతవరకే సీఎం కేసీఆర్ పరిమితమవడం చూస్తుంటే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయచట్టాలపై మొదట విమర్శించి, ఆ తర్వాత యూ టర్న్ తీసుకున్నారు. విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నామని అసెంబ్లీలో చెప్పి, పార్లమెంటులో మౌనం దాల్చారు. మోటారు వాహన సవరణ చట్టానికి 'సై' చెప్పారు. కేంద్రం ప్రకటించిన నోట్లరద్దు సహా అనేక నిర్ణయాలను 'శెభాష్' అని మెచ్చుకొని, సందర్భం వచ్చినప్పుడు 'నల్లధనం' ఎక్కడంటూ మంత్రులతో వెక్కిరింత మాటలూ మాట్లాడిస్తున్నారు.
మొన్నటికి మొన్న అసెంబ్లీలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాక, అవే అంశాలపై సీఎం జోక్యం చేసుకొని సుదీర్ఘోపన్యాసం ఇచ్చారు. ఇప్పుడు పర్యాటకంపై చర్చ సందర్భంగానూ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడాక, అదే అంశంపై మరోసారి చర్చను నడిపించారు. ఇది ఆయా శాఖల మంత్రుల పనితీరును ఆక్షేపించేలా ఉన్నదనే చర్చ ప్రజల్లో నడుస్తున్నది. మరోవైపు విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈ ఆర్సీ)కి ఇవ్వాల్సిన లెక్కల్ని శాసనమండలిలో ప్రస్తావించారు. మూడేండ్లుగా ఈఆర్సీకి వార్షిక ఆదాయ అవసరాల ప్రతిపాదనలు (ఏఆర్ఆర్) ఎందుకివ్వలేదనే అంశాల జోలికి వెళ్లకుండా ప్రసంగాన్ని కొనసాగించారు. ఆర్థికమంత్రి హరీశ్‌రావు కూడా కేంద్ర ప్రభుత్వం అభివృద్ధికి సహకరించట్లేదంటూ విమర్శలు చేశారు. సకాలంలో నిధులివ్వట్లేదన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మధ్యాహ్న భోజన పధకం ధరల గురించి ప్రస్తావించారు. పౌష్టికాహార లోపాన్ని ఎత్తిచూపారు. ఇక కార్మిక సంఘం సీఐటీయూకి పని లేకుండా చేశామంటూ శాసనమండలిలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అవి తప్పుడు మాటలని నిరూపిస్తూ వందలాదిమంది భవన నిర్మాణ రంగ కార్మికులు, పంచాయతీ, మున్సిపల్ కార్మికులు 'చలో అసెంబ్లీ' నిర్వహించారు. తమ సమస్యల్ని ఎందుకు పరిష్కరించట్లేదంటూ నినదించారు. పోలీసులను పరుగులు పెట్టించారు. అసెంబ్లీ చుట్టుపక్కల వందల సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించి పహారా కాసారు. ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి ఆందోళనకారులు అసెంబ్లీ వైపు రాకుండా కట్టడిచేస్తూ, అరెస్టులు కొనసాగించారు. అదేంటి...మంత్రి సీఐటీయూ కి పనిలేకుండా చేశామని చెప్తే...వీళ్లంతా ఎక్కడి నుంచి వచ్చారు అంటూ పోలీసులతో పాటు సామాన్య ప్రజలు కూడా చర్చించుకోవడం కనిపించింది.