Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ ఎం.ఎస్.ప్రభాకర్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు మూతపడే స్థితికి వచ్చిన విజయా పాలడైరీతో తెలంగాణలో శ్వేత విప్లవం వచ్చిందని టీఆర్ఎస్ సభ్యులు ఎం.ఎస్.ప్రభాకర్ రావు తెలిపారు. పాల సేకరణ ఇప్పుడు బాగా పెరిగిందనీ, దానికి తగినట్టు మార్కెట్ ఏర్పాట్లు చేయాలని కోరారు. అదే సమయంలో ప్రయివేటు డైరీల్లో పాలలో కల్తీ జరగకుండా నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించాలని కోరారు.
విజయాను చంపే ప్రయత్నం చేశారు...
ఉమ్మడి రాష్ట్ర పాలకులు విజయా డైరీని తమ స్వార్థ్యంతో చంపేందుకు ప్రయత్నం చేశారని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. టీఆర్ఎస్ పాలనలో పాలసేకరణ రోజుకు ఒక లక్ష నుంచి 4.5 లక్షల లీటర్లకు పెరిగిందనీ, దీంతో అందుకు సరిపడా స్థలం కోసం కోరగా, సీఎం రంగారెడ్డి జిల్లా రావిరాలలో 40 ఎకరాలను కేటాయిం చారని తెలిపారు. ప్రస్తుతం పాల ఉత్పత్తిదారులకు ఆదాయం పెరగడమే కాకుండా నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభించిందన్నారు.
శివారు ప్రాంతాల్లోనూ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రూ.3,700 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ శాసనమండలిలో ఒక ప్రశ్నకు సమధానంగా చెప్పారు. ఇప్పటికే శివారు ప్రాంతాల్లో రూ.2,100 కోట్లతో తాగునీటి వసతిని కల్పించామని తెలిపారు.
వెంకన్న వర్సెస్ మల్లేశం
కళాకారులకు పింఛను చెల్లింపుపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అడిగిన ప్రశ్నపై చర్చ అధికార పార్టీ సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలను బహిర్గతం చేసింది. ఆ ప్రశ్నకు రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ సమాధానం చెప్పిన తర్వాత అధికార పార్టీ సభ్యులు యెగ్గె మల్లేశం మాట్లాడుతూ, తెలంగాణ వచ్చాక 550 మంది కళాకారులకు ఉద్యోగులుగా అవకాశాలిచ్చారనీ, అయితే అందులో గొల్ల కురుమలు లేరని తెలిపారు. దీనిపై గోరటి వెంకన్న మాట్లాడుతూ వారున్నారని కామెంట్ చేశారు. దీనిపై మల్లేశం మాట్లాడుతూ, తనకు తెలుసంటూ, గొల్లకురుమలు లేరని రెండో సారి స్పష్టం చేశారు. తమ వాళ్లకు ఎవరికి పెన్షన్ రావటంలేదని తెలిపారు. ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు మాట్లాడుతూ ఎస్సీల్లో శుభ, అశుభ కార్యాలకు డప్పులు వాయించే కళాకారులకు పెన్షన్ ఇవ్వాలని కోరారు. గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ, గౌడశెట్టి కళాకారులను ఆదుకోవాలని కోరారు.
కులాలు చూడలేదు....
ఎప్పుడు లేని విధంగా తెలంగాణ వచ్చాక కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలిచ్చామనీ, అందులో తాము కులాలు చూడలేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. అయితే నియామక సమయంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ను పాటించామని చెప్పారు.
ధరణితో మా బంధువులకు ఇబ్బందులు...అధికార పార్టీ ఎమ్మెల్సీ
భూసమస్యలను పరిష్కారించేందుకు తీసుకొచ్చిన ధరణి ఒక గొప్ప కార్య క్రమమని అధికార పార్టీ ఎమ్మెల్సీ ఎం.ఎస్.ప్రభాకర్ రావు కొనియాడారు. అయితే సాఫ్ట్వేర్ లోపాల కారణంగా ఇబ్బందులు తప్పటం లేదని, ఆ లోటు పాట్లను సవరించాలని కోరారు. మెదక్ జిల్లాకు చెందిన తన బంధువులు ఇబ్బందులు ఎదుర్కొంటూ కలెక్టర్ వరకు వెళ్లినా పరిష్కారం కాలేదన్నారు.