Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోడు భూముల సమస్య పట్టని ప్రభుత్వం
- కాంగ్రెస్ ఎమ్మెల్యేల విమర్శ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పోడు భూముల సమస్యను పరిష్కరించాలన్న సోయి, చిత్తశుద్ధి కేసీఆర్ ప్రభుత్వానికి లేదని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్కతో పాటు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డి.శ్రీధర్‌బాబు, సీతక్క, పోడెం వీరయ్య విమర్శించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్(గన్‌పార్కు) వారు మాట్లాడుతూ అడవుల్లో ఉన్నవారు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో యూపీఏ ప్రభుత్వం అటవీ హక్కుల చట్టాన్ని తెచ్చిందని గుర్తుచేశారు. ఆ చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదని, పైగా వారి నుంచి భూములు లాక్కుంటున్నారని విమర్శించారు.
ఆ సమస్యను పరిష్కరిస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు పట్టించుకోవడం లేదన్నారు. హక్కులు అడిగితే కొట్టడం, అరెస్ట్ చేయడం ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందని విమర్శించారు. అడవి బిడ్డలపై అకత్యాలు పెరిగాయన్నారు. అటవీ హక్కుల చట్టంపై చర్చించాలంటూ తామిచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడం అన్యాయమన్నారు. పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపడం రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉన్నా సీఎం కేసీఆర్ తన బాధ్యతను కేంద్రంపై నెట్టేస్తున్నారని చెప్పారు. కుర్చీ వేసుకుని కూర్చుని పోడు భూముల సమస్య పరిష్కరిస్తానన్న ఆయన ఇప్పుడు చేతులెత్తాశారని విమర్శించారు.