Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్షిణమధ్య రైల్వే జీఎంతో ఎంపీల భేటీ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని పార్లమెంటు సభ్యులు కోరారు. మంగళవారంనాడిక్కడి రైల్‌నిలయంలో ఆ సంస్థ జనరల్ మేనేజర్ గజానన్మాల్యాతో కాంగ్రెస్ ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్, టీఆర్ఎస్ ఎంపీలు రంజిత్‌రెడ్డి, మాలోత్ కవిత, వెంకటేశ్ నేత, మన్నె శ్రీనివాస్‌రెడ్డి తదితరులు బేటీ అయ్యారు. వీరితో పాటు కర్ణాటక ఎంపీలు కూడా ఆయనతో సమావేశమయ్యారు. దక్షిణ మధ్య రైల్వేపరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను వారికి వివరించారు. పెండింగ్ ప్రాజెక్టులు, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులు, స్టాపేజీలు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, చర్లపల్లి టర్నినల్ పనులు, వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనలపై ఈ సందర్భంగా చర్చలు జరిపారు. రోడ్ అండర్ బ్రిడ్జీలు, రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, సుందరీకరణ తదితర పనులపై ఎంపీలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారివారి నియోజకవర్గాల్లో చేపట్టిన రైల్వే లైన్ల పనుల వివరాలను ప్రస్తావించారు.
ఆగిపో యిన రైళ్లను మళ్లీ పునరుద్ధరించాలనీ, కొత్త లైన్లు ప్రకటించాలని కోరారు. మహబూ బ్‌నగర్ పరిధిలో మన్నెకొండ కురుమూర్తి జాతరకు పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారనీ, ఆ పరిసరప్రాంతాల్లోని స్టేషన్లలో రైళ్లను ఆపాలని కోరారు. అలాగే రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంచాలని కోరారు. ఎంఎంటీఎస్‌కు నిధుల లేమిని ప్రస్తావించారు. నిజామాబాద్ నుంచి ఢిల్లీ, ముంబయికి కనెక్టివిటీ చేయాలని కోరారు. అలాగే కరీంనగర్-తిరుపతి రైలును నిజామాబాద్ వరకు, రాయలసీమ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను బోధన్ వరకు పొడిగించాలని చెప్పారు. హైదరాబాద్-విజయవాడకు బుల్లెట్ రైలు మంజూరు చేయాలనీ, ఆర్థికంగా ఈ మార్గం అనుకూలమైనది సూచించారు. ఈ రైలు అందుబాటులోకి వస్తే గంటన్నరలో ప్రయణం పూర్తవుతుందని చెప్పారు.