Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మల్టీపర్సప్ విధానం రద్దుకు డిమాండ్
- విలేకరుల సమావేశంలో పాలడుగు భాస్కర్, చాగంటి వెంకట్
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్రంలోని మున్సిపల్ కార్మికులు, గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు పెంచాలని, పర్మినెంట్ చేయాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలనే డిమాండ్లతో ఈనెల 8న సమ్మె చేస్తున్నట్టు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, గ్రామపంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య వెల్లడించారు. హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞానం కేంద్రం షోయబ్హాల్లో మంగళవారం తెలంగాణ మున్సిపల్ వర్కర్స్- ఎంప్లాయిస్, గ్రామపంచాయతీ ఎంప్లాయీస్-వర్కర్స్ యూనియన్ల రాష్ట్ర అధ్యక్షులు ఖమర్అలీ, గణపతిరెడ్డితో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గ్రామపంచాయతీ కార్మికులకు రూ.19వేలు, మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులకు వేతనాలను కేటగిరీల వారీగా రూ.19వేలు, రూ.22,900, రూ.31,040 పెంచాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ కార్మికులను ప్రత్యేక కేటగిరీగా గుర్తించి నెలకు రూ.24వేల వేతనం ఇవ్వాలన్నారు. జీహెచ్ఎంసీ కార్మికులతో సమానంగా ఇతర మున్సిపాల్టీల్లోనూ పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. కారోబార్, బిల్కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలని, మల్టీపర్పస్ పని విధానాన్ని రద్దు చేయాలని కోరారు. గ్రామపంచాయతీ, మున్సిపల్ సిబ్బందినందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న జీవోలను సవరించాలని, 5 రంగాల జీఓలకు గెజిట్ విడుదల చేయాలని, నాలుగు లేబర్కోడ్లను రద్దు చేయాలని అన్నారు. ఏడేండ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కారం చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఈనెల 8న నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.