Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైల్ నిలయం వద్ద సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ధర్నా
- పోలీసుల అత్యుత్సాహంతో రసాభాస
- బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలింపు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఎంఎంటీఎస్ ఫేజ్-2లో పనులు పూర్తయిన రూట్లలో వెంటనే రైళ్లను ప్రారంభించాలని సీపీఐ(ఎం) సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా మంగళవారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం వద్ద సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ప్రజా రవాణాను పెంపొందించేందుకు ఎంఎంటీఎస్ ఫేజ్-2లో భాగంగా చేపట్టిన పనుల్లో సికింద్రాబాద్-ఘట్కేసర్, సికింద్రాబాద్- మేడ్చల్, ఫలక్‌నుమా-ఉందానగర్, రామచంద్రాపురం-తెల్లాపూర్ రూట్లలో పనులన్నీ పూర్తయ్యాయని, ఈ రూట్లలో రైళ్లను ప్రారంభించాలని కోరారు. సెప్టెంబర్ 2014లో ప్రారంభించిన ఫేజ్-2 పనులు 2017 డిసెంబర్ నాటికి పూర్తి కావాల్సి ఉండగా నాలుగు రూట్లలో 60కిలోమీటర్లు మాత్రమే పూర్తయిందని చెప్పారు. సనత్‌నగర్-మౌలాలీ రూట్లో పాక్షికంగా పనులు జరిగాయన్నారు. ఎంఎంటీఎస్ ఫేజ్-2 అంచనా వ్యయం రూ.816 కోట్లు కాగా, ఇప్పటికే రూ.808కోట్లు ఖర్చు చేశారన్నారు. ట్రాక్‌లు వేయకుండా రైల్వే బస్టాండ్లు, భవనాలు కడుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు ఇవ్వకపోవడంతో పనులు పూర్తిచేయలేక పోయామని రైల్వే శాఖ చెబుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. పూర్తయిన రూట్లలో సైతం రైళ్లను నడపకుండా ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారన్నారు. రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సమన్వయ లోపం కారణంగా ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురవుతోందన్నారు. పూర్తయిన రూట్లలో వెంటనే రైళ్లను ప్రారంభించాలన్నారు.
అనంతరం కార్యవర్గ సభ్యులు ఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రైల్వే రంగాన్ని ప్రయివేటీకరణ చేయడం ఆపాలని డిమాండ్ చేశారు. పనులు పూర్తయిన చోట ఎంఎంటీఎస్ రైళ్లను ప్రారంభించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) సికింద్రాబాద్ జోన్ కన్వీనర్ ఎం.అజరుబాబు, నగర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.దశరత్, నాయకులు ఆర్.వెంకటేష్, ఆర్.అశోక్, అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.
నినాదాలతో దద్దరిల్లిన రైల్ నిలయం
కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా రైల్‌నిలయం వద్ద ఉదయం 11:30కు చేపట్టిన ధర్నా రసాభాసగా మారింది. రైల్ నిలయం వద్ద తూకారంగేట్ సీఐ అత్యుత్సాహం ప్రదర్శించారు. శాంతియుతంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నాయకులను అడ్డుకొని ఈడ్చుకెళ్లి పోలీస్ వాహనాల్లోకి ఎక్కించారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ పెద్దఎత్తున నినాదాలు చేయడంతో ఆ ప్రాంతమంతా దద్దరిలింది.