Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎల్ఐసీ మాదిరిగా జీఐసీ ఉద్యోగులకూ ఇవ్వాలి
- కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి
- సాధారణ బీమా కంపెనీల ప్రయివేటీకరణను ఆపాలి
- జిబ్నా అమెండ్మెంట్ యాక్ట్ వెనక్కి తీసుకోవాలని వక్తల డిమాండ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
నాలుగు ప్రభుత్వ రంగ సాధారణ (నేషనల్, న్యూఇండియా, ఓరియంటల్, యూనిటైడ్ ఇండియా) బీమా కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతన సవరణను వెంటనే చేపట్టాలని ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీల జాయింట్ ఫోరం డిమాండ్ చేసింది. మంగళవారం ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీల జాయింట్ ఫోరం కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ హబ్సిగూడలోని న్యూ ఇండియా అశ్యురెన్స్ కంపెనీ లిమిటెడ్ రీజినల్ ఆఫీస్ ఎదుట ధర్నా చేపట్టారు. పెద్దఎత్తున ఉద్యోగులు పాల్గొని బీమా కంపెనీ ఉద్యోగల ఐక్యత వర్ధిల్లాలి.. జాయింట్ ఫోరం జిందాబాద్, వర్కింగ్ క్లాస్ ఐక్యత జిందాబాద్.. వెంటనే వేతన సవరణ చేపట్టాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఏఐఐఈఏ ఉపాధ్యక్షులు కేవీవీఎస్‌ఎన్ రాజు, ఎన్‌ఎఫ్‌జీఐఈ ప్రధాన కార్యదర్శి పీఎస్ బాజ్పాల్, హైదరాబాద్ జీఎస్ టి. గోపాల కృష్ణ, ఓఐసీవోఏ ప్రధాన కార్యదర్శి వై. సుధాకర్ రావు, ఎన్ఐఏవోఏ హైదరాబాద్ అధ్యక్ష, కార్యదర్శులు బి. విజయ కుమార్, యూ.అనంత కృష్ణ, ఎన్ఐసీవోఏ అధ్యక్ష, కార్యదర్శులు టి. రవీందర్, నితిన్, బీవీకేఎస్ అధ్యక్ష, కార్యదర్శులు ఏవీ సోమయాజులు, ఎంవీవీఎస్‌ఎన్ మూర్తి, జీఐఈఏఐఏ హైదరాబాద్ శాఖ ప్రధాన కార్యదర్శి ఎం.శివ శంకర్, హెచ్ఆర్జీఐఈఏ అధ్యక్ష, కార్యదర్శులు కామ్రేడ్ ఏ.నారాయణ రావు, వై.సుబ్బారావు, వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్. కాంతారావు, రిజినల్ సెక్రటరీ బి.అరుణ్ కుమార్ ఈ ధర్నాను ఉద్దేశించి మాట్లాడారు. ఐదేండ్లకోసారి వేతన సవరణ చేయాల్సి ఉండగా.. 50 నెలలు గడుస్తున్నా ఇంతవరకు కనీసం చర్చలకు పిలవడం లేదన్నారు. ఎల్ఐసీ లాగే జీఐసీ ఉద్యోగులకూ తక్షణమే వేతన సవరణ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ఆఫీసులను తగ్గించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. న్యూ పెన్షన్ సిస్టమ్‌ను రద్దు చేసి.. 1995 పెన్షన్ పాలసీని ఉద్యోగులందరికీ వర్తింపజేయాలని తెలిపారు. కాలానుగుణంగా పెన్షన్ పెంపు చేయాలనీ, ఫ్యామిలీ పెన్షన్ 30శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సాధారణ బీమా కంపెనీలను ప్రయివేటుపరం చేయడాన్ని, పెట్టుబడుల ఉపసంహరణను వ్యతిరేకిస్తున్నామనీ, వాటిని కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అవసరమైతే పోరాటాలకు ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని వారు పిలుపునిచ్చారు. ఈ ధర్నాకు సీఐటీయూ మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు కోమటి రవి సంఘీభావం తెలిపి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల పట్ల చిన్నచూపు చూస్తున్నాయన్నారు. కేంద్రంలోని మోడీ సర్కారు ఈ దేశంలో సంపదను పెట్టుబడిదారులే సృష్టిస్తున్నారనే భ్రమలో ఉందనీ, అసలు సంపద సృష్టికర్తలు ఉద్యోగులు, కార్మికులు, కర్షకులేనన్నారు. వెంటనే వేతన సవరణ చేపట్టకపోతే ఈ ప్రభుత్వానికి ఉద్యోగులు తగిన బుద్ధి చెబుతారన్నారు.