Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖరీఫ్‌లో ఉమ్మడి మెదక్ జిల్లాలో 7.50లక్షల ఎకరాల్లో సాగు
- గతేడాదితో పోలిస్తే 30 శాతం అధికం
- ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీనవేషాలు
నవతెలంగాణ - మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
వడ్లు కొనడం సాధ్యం కాదు... వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయండి అంటూ వానాకాలం(ఖరీఫ్) పంటలు వేసే ముందు రైతులకు సూచనలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. ఫలితంగా గతేడాది ఖరీఫ్ కంటే పెద్ద మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో వరి సాగైంది. మరో రెండు నెలల్లో పంటకు కోతకు వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంట కొనుగోలుపై మీనమేషాలు లెక్కిస్తున్నాయి. ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో అధిక దిగుబడులతో సంతోషించాలో.. కొనేందుకు ప్రభుత్వాలు సిద్ధంగా లేకపోవడంతో బాధపడాలో తెలియక రైతులు తలలుపట్టుకుంటున్నారు.
వానాకాలం వరిసాగు ఉమ్మడి మెదక్ జిల్లాలో విస్తారంగా సాగైంది. అధికవర్షాలు, నీటి వనరులు పెరగడం, ఉచిత విద్యుత్ పంపిణీతో సిద్ధిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో గత వానాకాలంతో పోలిస్తే ఈ సారి సాగు అధికంగా ఉంది.. సకాలంలో వర్షాలు కరియడంతో దిగుబడి కూడా ఎక్కువగానే వచ్చే అవకాశాలున్నాయి. గతేడాది ఖరీఫ్ సీజన్ లో వరి విస్తీర్ణం ఉమ్మడి మెదక్ జిల్లాలో 5,75,000 లుగా ఉండగా.. ఈ ఏడాది 7,50,000లకు పెరిగింది. రబీ సీజన్లో సిద్ధిపేట జిల్లాలో 2,83,285 ఎకరాల్లో వరి సాగు చేయగా.. మెదక్ జిల్లాలో 2,78,256 ఎకరాల్లో, సంగారెడ్డి జిల్లాలో 81,526 ఎకరాల్లో వరి సాగైంది.
ఈ ఏడాది వానాకాలం పంటలు వేసేందుకు ముందు వరి సాగును తగ్గించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఇందుకోసం క్షేత్రస్థాయిలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై విస్కృత అవగాహన కల్పించాలని భావించింది. ఇందుకనుగుణంగానే గ్రామాల వారీగా ఏ ఏ పంటలు సాగు చేస్తున్నారు.. ఏ ఏ పంటల సాగుకు భూములు అనుకూలంగా ఉన్నాయి.. పంటల మార్పిడికి అవకాశం ఉంటుందా.. పండించే పంట దిగుబడులకు మార్కెటింగ్ సౌకర్యం ఎలా ఉంది.. ఎక్కడెక్కడ దిగుబడులు అమ్ముకుంటున్నారు .. మద్దతు ధర లభిస్తుందా.. లేదా .. దళారుల బెడద పరిస్థితేంటి.. ప్రస్తుత వానాకాలంలో ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు చేసుకునే అవకాశం ఉంది అనే అంశాలపై క్షేత్రస్థాయిలో విస్తతంగా అవగాహన సదస్సులు నిర్వహించాలని జిల్లా, మండల స్థాయి వ్యవసాయ అధికారులకు సూచించింది. అయితే వారు సకాలంలో సరైన అవగాహన కల్పించడంలో విఫలమవడంతో చేతులు కాలాక..ఆకులు పట్టుకున్న చందంగా వ్యవహరిస్తున్నారు. ముందే చెప్పాం కదా వరి వేయొద్దని.. మేం చెప్పినా వినకుండా మీ ఇష్టానికి వరిని పెద్దమొత్తంలో సాగుచేస్తే ఎలా అని అన్నదాతలను బెదిరిస్తున్నట్టు తెలిసింది. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం వరి ధాన్యం కొనుగోలు సిద్ధంగా లేదని చెబుతుంటే.. రాష్ట్ర బీజేపీ నాయకులు మాత్రం కేంద్రం ఎప్పుడూ ఆ మాట అనలేదని బుకాయిస్తున్నారు. వీరిద్దరిలో ఎవరి మాటలు నమ్మాలో తెలియక రైతులు అయోమయస్థితిలో పడ్డారు.
ఇతర పంటలతో ఇబ్బందులు
మా భూములు వరిపంటకే అనుకూలంగా ఉంటాయి. మంజీరా నది ప్రవహిస్తుండడంతో పుష్కలంగా నీటి వసతి ఉన్నది. వరిపంట కాకుండా ఇతర పంటలు వేస్తే కోతులు, అడవి పందుల్లాంటి అనేక సమస్యలు ఎదురవుతాయి. వేస్తే వరిపంట లేదంటే.. బీడు భూములుగా వదిలివేయడమే దిక్కు.
- దుద్యాల రమేష్
4 ఎకరాల్లో వరి సాగు
చెరువులు పూర్తిగా నిండి ఉన్నాయి. చెరువు కట్ట కింద ఉన్న రైతులు వరి పంట తప్ప ఇతర పంటలు సాగు చేయరాదు. మా భూములను వరి సాగు చేయాలా? బీడుగా ఉంచుకోవాలా?. చెరువు కట్ట కింద ఉన్న భూముల్లో ఆరుతడి పంటలు ఎలా వేస్తాం. ప్రభుత్వం వరి పంట సాగు చేయొద్దు అంటుంది. మాలాంటి రైతుల పరిస్థితి ప్రభుత్వం ఆలోచించాలి. వందలాది ఎకరాల్లో ఉన్న చెరువు కట్ట కింద సాగు భూముల పరిస్థితి ఏంటి. రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం సాగు చేయొద్దు అనడం సరికాదు.
- కుక్కల ఎల్లయ్య, చౌటపల్లి రైతు
జిల్లాల వారీగా వరిసాగు
(ఖరీఫ్, విస్తీర్ణం, ఎకరాల్లో)
జిల్లా 2021 2020
మెదక్ 3,20,520 2,70,246
సిద్ధిపేట 3,15,391 2,29,626
సంగారెడ్డి 1,20,385 75,356