Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్‌లో పాతబస్తీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రోరైల్ విస్తరణ పనులు కొంత ఆలస్య మయ్యే అవకాశముందన్నారు. అక్కడ మతపరమైన నిర్మాణాలు 93ఉన్నాయని వివరించారు. వాటి పను లు జరిగితే మతచిచ్చు పెట్టి లబ్దిపొందాలనుకునే వారి ఆటలు సాగనివ్వబోమని చెప్పారు. కొందరు నాయకులు భాగ్యలక్ష్మి దేవాలయానికి తరచుగా వచ్చి పోతున్నారని గుర్తు చేశారు. స్వర్ణమందిరం, చాందినీ చౌక్ తరహాలో చార్మినార్‌ను ఆధునీకరిస్తామనీ, దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తామని వివరించారు. మంగళవారం శాసనమండలిలో మైనార్టీ సంక్షేమం పై స్వల్పకాలిక చర్చ జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి జీవన్‌రెడ్డి మాట్లాడుతూ ఏటా రూ.10 వేల కోట్లతో మైనార్టీ సబ్‌ప్లాన్‌ను ప్రారంభించాలని కోరారు. 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సూచించారు. సుధీర్‌కమిటీ సిఫారసులను అమలు చేయాలన్నారు. వక్ఫ్ ఆస్తులను పరిరక్షించాలనీ, ఉర్దూ ఉపాధ్యాయ పోస్టులను డీరిజర్వ్ చేసి ఓపెన్ కేటగిరీలో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఎంఐఎం సభ్యులు సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ, మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఇఫెండి, టీఆర్ఎస్ సభ్యులు డి రాజేశ్వర్ రావు, ఎంఎస్ ప్రభాకర్‌రావు, సురభి వాణీదేవి మాట్లాడారు.