Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని విద్యావాలంటీర్లు, పార్ట్ టైం టీచర్లకు వివిధ పరిశ్రమల ద్వారా ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు పారిశ్రామిక రంగంపై కరోనా మహమ్మారి ప్రభావం గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చిన అనంతరం నర్సిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యావాలంటీర్లు, పార్ట్ టైం టీచర్లు దాదాపు 20 వేల మంది ఉన్నారని తెలిపారు. ప్రతి ఏటా వారు రెన్యూవల్ కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలల్లో రెండు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామన్న మంత్రి ప్రకటనపై అభినందనలు తెలిపారు. అయితే రెన్యూవల్ సమస్యను ఎదుర్కొంటున్న వారికి పరిశ్రమల్లో ఉపాధి కల్పించాలని సూచించారు.
ప్రశ్నలు వేసే అవకాశమివ్వాలి....
ప్రశ్నోత్తరాల సమయంలో పూర్తిగా అధికార పార్టీ సభ్యుల ప్రశ్నలకే అవకాశం ఇస్తున్నారని నర్సిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. గత సెషన్లో కూడా తనకు ఒక్క ప్రశ్న వేసే అవకాశం కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నలను ఎంపిక చేసే విధానాన్ని సమీక్షించాలని కోరారు. ఇలా ప్రతిసారి తనకు ప్రశ్నలు అడిగేందుకు అవకాశం రాకపోతే రాసి రాసి ఇక తమకు అవకాశం రాదేమోనని రాయటం మానేసే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తనకు ఉత్సాహం నీరుగారుతున్నదనీ, సభ్యుల సంఖ్యను బట్టి కాకుండా ప్రశ్నలను బట్టి అవకాశం ఇవ్వాలని సూచించారు. లేదంటే ముందు తనకు ఒక ప్రశ్న అడగడానికి అవకాశమిచ్చి మిగిలినవన్ని అధికార సభ్యులకు ఇచ్చుకోవాలన్నారు. ఆసమయంలో 'నర్సన్న ఎప్పుడు నవ్వతూనే ఉంటాడని' అధికార పార్టీ సభ్యుల నుంచి కామెంట్ వినిపించ టంతో, తనకు కోరికలేమి లేవనీ, అందుకే నవ్వూతూనే ఉంటానని తిరిగి కామెంట్ చేశారు.
విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తా : కేటీఆర్
విద్యావాలంటీర్లు, పార్ట్ టైం టీచర్ల సమస్యను విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని కేటీఆర్ సమాధానమిచ్చారు. గత రెండేండ్ల నుంచి విద్యావ్యవస్థ సరిగా నడవడం లేదన్నారు. ప్రత్యామ్నాయం వైపు వచ్చేందుకు వారికి స్కిల్, రీ-స్కిల్, అప్-స్కిల్ అవసరమని అభిప్రాయపడ్డారు. విద్యా వాలంటీర్లను టాస్క్‌లో చేర్చేందుకు నర్సిరెడ్డి చొరవ తీసుకోవాలని కోరారు. వారికి ప్రయివేటు పరిశ్రమల్లో ఉపాధి కల్పించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. శాసనసభతో పోలిస్తే మండలిలో మాట్లాడేందుకు సభ్యులకు ఎక్కువ అవకాశం వస్తుందనీ, గతంలో శాసనసభకు ప్రాతినిథ్యం వహించిన కాంగ్రెస్ సభ్యులు జీవన్‌రెడ్డికి ఈ విషయం తెలుసని అన్నారు.