Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాయిలాల అడ్డుకట్టకు ఐదెంచల వ్యవస్థ
- కలెక్టర్, సీపీ సహా ముగ్గురు ఎన్నికల పరిశీలకుల పర్యవేక్షణ
- ఒక్క కొవిడ్ నిబంధన ఉల్లంఘించినా నామినేషన్ల తిరస్కరణ
- నియోజకవర్గ సరిహద్దుల్లో పోలీసుల పహారా
- ఏ చిన్న అనుమానం వచ్చినా క్షేత్రస్థాయిలో తనిఖీ
- మంత్రుల వాహనాలూ పరిశీలన
- రూ.15లక్షలు స్వాధీనం
- మద్యం అక్రమ రవాణాపై 18కేసులు
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉప ఎన్నిక దృష్ట్యా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టర్ ఆర్వీకర్ణన్, పోలీసు కమిషనర్ సత్యనారాయణ సహా ముగ్గురు ఎన్నికల పరిశీలకుల బృందం పర్యవేక్షిస్తోంది. సోమవారం హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే సరిహద్దు దారుల్లో పోలీసు పహారాను ఏర్పాటు చేసింది. నియోజకవర్గంలోకి వచ్చే ప్రతివాహనాన్నీ క్షణ్ణంగా పరిశీలిస్తున్న పోలీసులు మంగళవారం రూ.15లక్షల వరకు పట్టుకున్నారు. ఏ చిన్న అనుమానం వచ్చినా తనిఖీ చేపడుతున్న అధికారులు మంత్రుల వాహనాలనూ వదలట్లేదు. మద్యం అక్రమ రవాణాపై ఇప్పటికే 18 కేసులు నమోదు చేశారు. అయినప్పటికీ ఏదో ఒక దారిలో రూ.లక్షల్లో నగదు, వేలల్లో మద్యం బాటిళ్లు చేరాల్సిన చోటుకు చేరుతున్నాయన్న వార్తలూ వినిపిస్తున్నాయి.
హుజూరాబాద్ ఉప పోరుపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టిసారించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వేలైన్ టీం, వీడియో సర్వేలైన్ టీం, వీడియో వీవింగ్ టీంలు క్షేత్రస్థాయిలో కీలక పాత్ర పోషిస్తుండగా.. కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సత్యనారాయణ సహా కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా నియమించిన పరిశీలకులు హుజూరాబాద్‌లో ఏం జరుగుతుందనే సమాచారం విషయమై ఎప్పటికప్పుడూ ఆరా తీస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు చేరుకున్న సాధారణ ఎన్నికల పరిశీలకులు డాక్టర్ ఓం ప్రకాశ్, ఎన్నికల ప్రత్యేక పరిశీలకులు ఐఏఎస్ అనుపమ్ అగర్వాల్, వ్యయ పరిశీలకులుగా జి.ఎలమురుగు నిత్యం సమీక్షల్ని నిర్వహిస్తున్నారు.
సరిహద్దుల్లో పోలీసు నజర్
ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలైన రెండ్రోజుల తరువాత పోలీసులు నియోజకవర్గ సరిహద్దుల్లో తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. వరంగల్, కరీంనగర్ ఇరువైపులా ప్రయాణిస్తున్న వాహనాలను సోదాలు చేస్తున్నారు. హన్మకొండ నుంచి కరీంనగర్ వైపు వచ్చే వారిని, కరీంనగర్ నుంచి హుజూరాబాద్ వైపు వచ్చే వారిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ తనిఖీల్లో ఒక్కరోజునే పోలీసులు రూ.15లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో కరీంనగర్ జిల్లా నుంచి వచ్చే మార్గంలో అల్గునూర్ వద్ద రూ.4.5లక్షలు, జమ్మికుంట పట్టణంలోని గాంధీచౌక్ వద్ద రూ.5లక్షలు, ఫ్లయిఓవర్ బ్రిడ్డిపై రూ.1.4లక్షలు, ఇదే మండలంలోని మోత్కులగూడెం వద్ద రూ.4లక్షలు గుర్తించారు. రెండు మూడు రోజుల్లోనే మద్యం అక్రమ రవాణాపై 18 కేసులు నమోదు చేశారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో జమ్మికుంట పట్టణ సీఐ రాంచందర్‌రావు, టాస్క్ఫోర్సు ఇన్స్పెక్టర్లు బి.మల్లయ్య, సృజన్‌రెడ్డి, అల్గునూర్‌లో మానకొండూర్ ఇన్స్పెక్టర్ కృష్ణారెడ్డి, ఎల్ఎమ్డి ఎస్ఐ ప్రమోద్ రెడ్డి తమ సిబ్బంది పాల్గొంటున్నారు. మంగళవారం బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కాన్వారుని, ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు వాహన శ్రేణినిని కూడా పరిశీలించారు.