Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దళితబంధు పథకాన్ని ప్రకటించిన దళిత బాంధవుడు సీఎం కేసీఆర్‌కు తెలంగాణ దళితజాతి పక్షాన హదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తుంగతుర్తి టీఆర్ఎస్ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ తెలిపారు. శాసనసభలో దళిత బంధు పథకంపై స్వల్పకాలిక చర్చను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దళిత బంధును ఒక పథకంగా చూడొద్దు. ఇది ఒక విప్లవం. ఇది ఒక దళిత జనోద్ధారణ ఉద్యమం. దళితుల కోసం 70 సంవత్సరాల్లో గొప్ప గొప్ప నినాదాలు తీసుకున్నారే తప్ప. అమలు కాలేదు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ఇతర రాష్ట్రాలను ఆలోచనల్లోకి నెట్టేస్తున్నాయి. దళిత బంధు పథకం దేశానికే దిక్సూచిగా మారబోతున్నదన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది. తెలంగాణ ప్రాంతంతో అంబేద్కర్‌కు అవినాభావ సంబంధం ఉంది. ఆర్టికల్ 3ను ఉపయోగించుకుని తెలంగాణను సాధించుకున్నాం. అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా 125 గురుకుల పాఠశాలలను నెలకొల్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1600 గురుకులాలు ఉన్నాయన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారని తెలిపారు. దళితబంధు హుజురాబాద్ ఎన్నికల కోసం తెచ్చింది కాదన్నారు.
రాష్ట్రమంతా అమలుచేయాలి : భట్టి విక్రమార్క
దళితబంధు పథకాన్ని రాష్ట్రమంతా అమలుచేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్వల్పకాలిక చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ దళిత బంధుపై అనేక అనుమానాలున్నాయని అన్నారు. తన నియోజకవర్గంలోని చింతకాని మండలంలో పర్యటన సందర్శంగా దళితులు అనేక సందేహాలు వ్యక్తం చేశారని గుర్తు చేశారు. 17 లక్షల కుటుంబాలకు 1.70 లక్షల కోట్లు ఖర్చవుతాయని చెప్పారు. గతంలో దళితుల అభివృద్ధి కోసం రూ.1000 కోట్ల కేటాయించారనీ, అమలుకాలేదన్నారు. దేశంలో దళితులే అత్యంత అణగారిన వర్గాలుగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో భూమి ప్రధాన సమస్యగా ఉందని వివరించారు. ఏడేండ్లుగా నియోజకవర్గాల్లో అసైన్మెంట్ కమిటీలు పనిచేయడం లేదనీ, భూముల కేటాయింపులు జరగడం లేదని చెప్పారు. రెవెన్యూ రికార్డుల ఆధునీకరణ సందర్భంగా మిగులు భూముల వివరాలు అందుబాటులోకి వచ్చి ఉంటాయని గుర్తు చేశారు. దళితులతో ఎలాంటి వ్యాపారాలు చేయిస్తారు ? ఒకటి కంటే ఎక్కువ చేసుకోవచ్చా ?సర్కారు ఏమైనా సలహాలు,సూచనలతో నడిపిస్తుందా అని ప్రశ్నించారు. ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా మాట్లాడుతూ దేశంలో దళితులు, మైనార్టీలపై దాడులు, దౌర్జన్యాలు జరుగుతుంటే, రాష్ట్రలో దళితబంధు తీసుకురావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ మాట్లాడుతూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దళతులు వివక్షకు, అన్యాయానికి గురవుతున్నారని చెప్పారు. ఆర్థిక, అసమానాలతోపాటు సామాజిక సమస్యలను పరిష్కరించాలని సూచించారు. చేపలు తినడం కాదు, కేసీఆర్ చేపలు పట్టడాన్ని నేర్పుతున్నారని గుర్తు చేశారు. దళితబంధు వెనుక కఠోరశ్రమ ఉందన్నారు. దేశంలోనే ఇది అతిపెద్ద నగదు బదిలి అన్నారు. దళితబంధుపై చర్చ ప్రారంభమైన నేపథ్యంలో మధ్యామ్నాం 12:45 నిమిషాలకు సీఎం కేసీఆర్ సభలోకి అడుగుపెట్టారు. మళ్లీ ఒంటిగంటా 45 నిమిషాలకు వెళ్లిపోయారు. అనంతరం వచ్చాక దళితబంధుపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు.