Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రశ్నోత్తరాల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు తగిన నిధులు ఇస్తున్నామనీ, వాటి పరిశుభ్రత బాధ్యత ఆయా గ్రామాల సర్పంచులదేనని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి పునరుద్ఘాటించారు. పాఠశాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ 48 కోట్లు విడుదల చేసిందని పేర్కొన్నారు. మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ సభ్యులు రఘునందన్‌రావు అడిగిన ప్రశ్నకు మంత్రి పైవిధంగా స్పందించారు. పాఠశాలతోపాటు ప్రైమరీ హెల్త్ సెంటర్ల బాధ్యత కూడా సర్పంచులే తీసుకోవాలనీ, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీల పాలక మండళ్లు తీసుకోవాలని కోరారు. గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో పరిశుభ్రత బాధ్యతను విస్మరిస్తే హెడ్మాస్టరు పై అధికారులకు ఫిర్యాదు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో స్థలం ఎక్కువగా ఉంటే పల్లె ప్రగతి వనాలు ఏర్పాటు చేయాలని ఆదేశించామన్నారు. స్థలం తక్కువగా ఉన్నచోట వనాలు చేయటం సరైందికాదని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల రేషనలైజేషన్ తర్వాతనే విద్యావాలంటీర్ల నియామకం గురించి ఆలోచిస్తామని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు.
నూటికి నూరు శాతం కరెంటిచ్చాం ప్రశ్నోత్తరాల్లో మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడి
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలను నూటికి నూరు శాతం విద్యుద్దీకరణ చేశామని ఆ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి వెల్లడించారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితోనే ఇది సాధ్యమైందని చెప్పారు. మంగళవారం శాసనసభలో సభ్యులు మర్రి జనార్థన్‌రెడ్డి, చంటి క్రాంతి కిరణ్, కోరుగంటి చందర్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యుత్ సమస్య చాలా తీవ్రంగా ఉండేదని గుర్తు చేశారు. ఆసమస్య ఇంత తొందరగా ఎలా పరిష్కారమైందంటూ చాలా మంది అడగేవారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి విద్యుత్ విషయంలో తీవ్రమైన అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని గ్రామాల్లో విద్యుదీకరణ, రైతులకు 9 గంటల నుంచి 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చే స్థాయికి తెలంగాణ చేరుకుందని తెలిపారు. విద్యుత్ తలసరి వినియోగంలో తెలంగాణ మూడో స్థానంలో ఉందనీ, వద్ధిరేటులో మాత్రం ప్రథమ స్థానంలోఉందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం డిస్కాంల ద్వారా 990 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలో కోటి అరవై ఐదు లక్షల కనెక్షన్లు ఉంటే, రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 54 లక్షల అదనపు కనెక్షన్లను ఇచ్చామని చెప్పారు. ప్రస్తుతం 19 లక్షల మంది రైతులకు విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయనీ, అందులో లక్ష దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ విద్యుత్తు కోసం తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
గ్రామాభివృద్ధి కోసం నరేగా నిధులు : మంత్రి ఎర్రబెల్లి
జాతీయ ఉపాధి హామీ చట్టం నిధులను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం వల్లే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు చెప్పారు. మంగళవారం శాసనసభలో పట్నం నరేందర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందించారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివద్ధి మన రాష్ట్రంలోని గ్రామాల్లో జరుగుతున్నదని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలల్లో పర్యటించాకే ఈ అభిప్రాయానికొచ్చామని వివరించారు. నరేగ నిధులతో వైకుంఠ దామాలు, పల్లె ప్రగతివనాలు, డంపింగ్‌యార్డులు ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. జగిత్యాల, సిద్దిపేట, సత్తుపల్లి నియోజకవర్గాల్లో వాటిని బాగా చేశారని చెప్పారు. వైకుంఠ ధామాలకు రోడ్ల సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పల్లె ప్రగతి వనాలు, నర్సరీలు ఏర్పాటు చేశామని పునరుద్ఘాటించారు. వంద జనాభా గల గ్రామాలకు ట్రాక్టర్లు ఇచ్చామని తెలిపారు..
అంగన్వాడీ కేంద్రాలను తిరిగి ప్రారంభించాం : మంత్రి సత్యవతి రాథోడ్
కరోనా సమయంలో సేవలు అందించిన అంగన్వాడీ కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించిందని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. కోవిడ్ వల్ల మూతపడిన అంగన్వాడీ కేంద్రాలను తిరిగి ప్రారంభించామనీ, గర్భిణీలు, పిల్లలు కేంద్రాలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పిల్లలకు కిట్లు కూడా ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్లుగా పేరున్న వారికి అంగన్వాడీ టీచర్లుగా గుర్తింపునిచ్చామని తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న బాలామృత పథకం దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిందన్నారు. గర్భిణీలు, పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్న అంగన్వాడీలు, ఆయా నియామకం కోసం నోటిఫికేషన్లు జారీచేస్తామని తెలిపారు. ఆయా కేంద్రాలకు ప్రతి నెల 1 నుంచి 10వ తేదీలోపు రేషన్‌బియ్యం సరఫరా చేయాలని ఆదేశించారు. మొదటివారంలోనే వేతాలను చెల్లించేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
బహుజన పుజారులకు గౌరవవేతనం ఇవ్వాలి : సీతక్క
ప్రకృతి దేవతలుగా కొనియాడబడుతున్న దేవుడమ్మ, శివసత్తులకు రాష్ట్ర ప్రభుత్వం గౌరవవేతనం ఇవ్వాలని కాంగ్రెస్ సభ్యురాలు సీతక్క కోరారు. ప్రకృతి ప్రేమికులు ఈ గుడుల్లో పూజలు చేస్తారనీ,వాటిల్లోని పూజారులు పరిస్థితి కడుదయనీయంగా ఉందన్నారు. మంగళవారం శాసనసభ జీరో అవర్లోఆమె ఈ అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది బహుజనపూజారులు పేదరికంలో మగ్గుతున్నారని చెప్పారు. అలాంటి వారిని ఆదుకోవాలని కోరారు. అందరూ భక్తులు రాముని గుడికో, శివుని గుడికో, సాయిబాబా గుడికో పోరనీ, కొంత మంది ప్రకృతి దేవతలను ఆరాధిస్తారని పేర్కొన్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.