Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చట్టసభల్లో విభజన చర్చ
- దళితబంధుపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ వివరణ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
'దళితబంధు' అసెంబ్లీలో ఇదే అంశంపై మంగళవారం సుదీర్ఘ చర్చ జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ స్కీం అమలును సభలో కండ్లకు కట్టారు. దళితులైతే చాలు...ఎవరికైనా ఇచ్చేస్తామన్నారు. ఎట్లా అమలు చేస్తారనే ప్రతిపక్షాల ప్రశ్నలకు 'మనసుంటే మార్గముంటుంది' తరహాలో సీఎం సమాధానాలు చెప్పారు. అంతిమంగా దళితబంధును రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని అధికార, ప్రతిపక్ష సభ్యులందరూ ముక్తకంఠంతో చెప్పారు. దానికి సభానాయకుడు కేసీఆర్ సరే అన్నారు. ఎంఐఎం శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ దళితబంధును మైనార్టీలకూ వర్తింపచేయాలని కోరారు. ఇక శాసనమండలిలో చర్చ పక్కతోవ పట్టినట్టే కనిపించింది. అధికారపార్టీ సభ్యులే కులాలవారీగా విడిపోయి, మావోళ్లకు అవకాశం ఇవ్వలేదంటే...మావోళ్లకు ఇవ్వలేదంటూ కళాకారుల ఉద్యోగాల విషయంపై పరస్పరం విమర్శలు చేసుకున్నారు. మరో సభ్యుడైతే ధరణి వల్ల తమ బంధువులు ఇబ్బందులు పడుతున్నారంటూ సొంత వ్యవహారాలను ఉటంకిస్తూ మండలి చైర్మెన్‌కు ఏకరువు పెట్టారు. శాసనసభ జీరో అవర్‌లో అధికారపార్టీ సభ్యుల వినతుల వెల్లువ కొనసాగింది. దళితబంధుపై చర్చ సందర్భంగానే సీఎం కేసీఆర్ ఉద్యోగ నియామక ప్రక్రియను ప్రస్తావించారు. రెండు, మూడు నెలల్లో దాదాపు 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. కొత్త జోనల్ విధానం ప్రకారం రాష్ట్రంలో ఉద్యోగుల విభజన ఉంటుందనీ, దసరా తర్వాత వారితో చర్చలు జరుపుతామన్నారు. దళితబంధు అమలుకు దాదాపు రూ.1లక్షా 80వేల కోట్లు అవసరమవుతాయనీ, వచ్చే ఏడాది బడ్జెట్లో రూ.20వేల కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. ప్రశ్నోత్తరాల సమయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు గ్రాంట్ రూపంలో కేటాయించిన నిధుల వివరాలు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సంలో రూ.80 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. ఇక మరో మంత్రి కె తారకరామారావు శాసనమండలిలో మరోసారి కేంద్రప్రభుత్వంపై మండిపడ్డారు. నిధులు ఇవ్వట్లేదని ఆక్షేపించారు.