Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు, మూడు నెలల్లో ప్రక్రియ ప్రారంభం
- వచ్చే బడ్జెట్లో దళితబంధుకు రూ. 20 వేల కోట్లు
- రాష్ట్రమంతా అమలుకు రూ.లక్షా 80వేల కోట్లు.. అవసరమైతే ప్రభుత్వ భూములు అమ్ముతాం
- ఎస్సీ రిజర్వేషన్లు పెంచాలి
- బీసీ కులగణన చేయాల్సిందే : దళితబంధు పథకంపై చర్చలో సీఎం కేసీఆర్
- మూడోవారంలో పోడు సాగుదారుల నుంచి దరఖాస్తులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వచ్చే రెండు, మూడు నెలల్లో ఉద్యోగాల నియామక ప్రక్రియ మొదలవుతుందనీ, 70 వేల నుంచి 80 వేల పోస్టులను భర్తీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అసెంబ్లీలో ప్రకటించారు. కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన ఉంటుందని వెల్లడించారు. దీనిపై దసరా తర్వాత ఉద్యోగులతో చర్చలు జరుపుతామని తెలిపారు. కొత్త జిల్లాలు, మండలాలు వచ్చాయనీ, ఆయా ప్రాంతాల్లో ఉద్యోగాలను భర్తీచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. కొత్తజోనల్ విధానంలో 95 శాతం స్థానికులకే ఉద్యోగాలిస్తామని నొక్కిచెప్పారు. మారుమూల జిల్లాలకు, ప్రాంతాలకు ఉద్యోగులు పోవడానికి ఇష్టపడట్లేదనీ, ఈ నేపథ్యంలో స్థానికులకు అవకాశం కల్పిస్తే పాలన మరింత సులువు అవుతుందని తెలిపారు. వైద్యశాఖలో కీలక స్థానాల్లో ఎస్సీలకు అన్యాయం జరుగుతుందన్న విషయం తన దృష్టికి వచ్చిందనీ, కచ్చితంగా వారికి న్యాయం చేస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీనిచ్చారు. దళితుల బంధు పథకం కోసం వచ్చే బడ్జెట్లో రూ.20 వేల కోట్లు కేటాయిస్తామనీ, ప్రతి నియోజకవర్గానికి 2 వేల మంది లబ్దిదారులను ఎంపికచేస్తామని వెల్లడించారు. మంగళవారం అసెంబ్లీలో దళితబంధు పథకంపై జరిగిన లఘు చర్చలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మార్చినాటికి ప్రతి నియోజకవర్గంలోనూ వంద మంది దళితులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తామనీ, లబ్దిదారులను ఎంపిచేసే బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేలకే అప్పగిస్తామని ప్రకటించారు. ఫైలట్ ప్రాజెక్టు కింద హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తం అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తామని ప్రకటించారు. చింతకాని(మధిర), నిజాంసాగర్(జుక్కల్), తిరుమలగిరి(తుంగతుర్తి), చారగొండ(అచ్చంపేట) మండలాల్లో వంద మంది చొప్పున లబ్దిదారులను ఎంపికచేసి మార్చినాటికి అక్కడి దళిత కుటుంబాలకు తలా పది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఎలా వాడుకోవాలన్నది లబ్దిదారుల ఇష్టమనీ, నిబంధనలు లేవని నొక్కిచెప్పారు. ఆ డబ్బులతో వ్యాపారాలు చేసుకోవచ్చుననీ, నలుగురైదుగురు కలిసి పరిశ్రమలు కూడా పెట్టుకోవచ్చునని సూచించారు. వంద శాతం సబ్సిడీతో ఇస్తున్నామనీ, వాటిని సర్కారుకి తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే, వాటిపై పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. తరతరాలుగా కొనసాగుతున్న సామాజిక వివక్ష వల్లే దళితులు వెనుకబాటుకు గురయ్యారన్నారు. అణచివేయబడ్డ వారికి సాధికారత రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల కోసం అంబేద్కర్ చేయాల్సిందంతా చేశారనీ, అంబేద్కర్ ఆలోచన సరళి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు వస్తున్నదని చెప్పారు. దళితుల గురించి కాంగ్రెస్ ఏం చేయలేదని అనలేమనీ, అయితే, తెచ్చిన పథకాలు, చేసిన కార్యక్రమాలు వారి అభివృద్ధికి ఎంతమేరకు దోహదపడ్డాయనేది కొలమానమని వ్యాఖ్యానించారు. ఆ తప్పును సరిదిద్ది దళితుల ఎదుగుదలకు కృషిచేయాల్సిన అవసరం ఉందనీ, అందులో భాగంగానే దళితబంధు తీసుకొచ్చామని వివరించారు. ఇలాంటి పథకం ప్రపంచంలోగానీ, దేశంలోగానీ ఎక్కడా లేదన్నారు. 2003లోనే మల్లేపల్లి లక్ష్మయ్యతో పాటు ఐఏఎస్ అధికారులతో విస్తృతంగా చర్చించి దళితపాలసీ రూపొందించామన్నారు. 1985లో తాను తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడే సిద్దిపేటలో దళిత చైతన్య జ్యోతి కార్యక్రమం చేశామని వివరించారు. నాలుగు గ్రామాల్లో దళిత మహిళలతో సంఘాలు ఏర్పాటు చేయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఏడాది కిందటే ప్రారంభం కావాల్సిన దళితబంధు పథకం కరోనాతో అలస్యమైందని చెప్పారు. దళితబంధుపై అఖిలపక్షం సమావేశం పెట్టి చర్చించామన్నారు. ఆచరణలో వచ్చే ఇబ్బందులను అధిగమిస్తామనీ, మరింత పకడ్బందీగా అమలు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రైతు బంధుకు 15 వేల కోట్లు ఖర్చుపెడుతుంటే అందులో దళితులకు దక్కుతున్నది రూ.1, 400 కోట్లేనన్నారు. గిరిజనుల కంటే దళితులకే తక్కువ భూములున్నాయని వివరించారు. 30 పట్టణాల్లో హాస్టళ్లతో కూడిన డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయడం ద్వారా 20 వేల మంది దళిత విద్యార్థునులు ఈ రోజు చదువుకోగలుగుతున్నారని చెప్పారు. దళితవాడల్లో మౌలిక సౌకర్యాల కల్పన కోసం మూడు నాలుగు వేల కోట్లయినా ఖర్చుపెడ్తామని చెప్పారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళితులకు పెద్దగా ఒరిగిందేమీ లేదని తెలిపారు. రాష్ట్రంలో మిషన్‌కాకతీయతో చెరువుల పునరుద్ధరణ పనులు, ప్రాజెక్టులతో భూగర్భజలాలు పెరిగాయనీ, దీంతో సాగువిస్తీర్ణం ఎక్కువైందనీ, వ్యవసాయ స్థిరీకరణ జరిగిందనీ, దీంతో తెలంగాణ దేశంలోనే నెంబర్‌వన్‌గా ఉందని చెప్పారు. తెలంగాణలో భూముల ధరలు పెరిగిపోయాయన్నారు. ఎకరం భూమి రూ.20 లక్షలకు తక్కువ ఎక్కడ దొరకడం లేదన్నారు. కొందరు ఇక్కడ ఎకరం భూమి అమ్మి ఏపీలోని పలు జిల్లాల్లో ఐదారెకరాలు కొంటున్నారని వివరించారు. రాష్ట్ర వృద్ధిరేటు 11.5 శాతంతో దేశంలోనే నెంబర్‌వన్‌గా ఉందనీ, తాను గొప్పలు చెప్పట్లేదు..ఆర్బీఐ, కాగ్ చెప్పాయని వివరించారు.
దళితుల రక్షణ కోసం నిధి
రాష్ట్రంలో నాలుగు వేల కోట్ల రూపాయలతో దళితుల రక్షణ నిధి ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. ఆ డబ్బులు బ్యాంకులో నిల్వ ఉంటాయనీ, దళితులను ఆదుకోవడానికి వాటిని వాడుతామని చెప్పారు. దీనికోసం కమిటీ వేస్తామని వెల్లడించారు. అందులో ఎలాంటి ఫైరవీలుండవనీ, ఎవరికీ పెత్తనం ఉండదని స్పష్టం చేశారు. దీని నిర్వహణ కలెక్టర్ల పరిధిలో ఉంచుతామని చెప్పారు. ప్రమాదాల్లో, ఇతర కారణాల వల్ల కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయిన దళిత కుటుంబాలను ఆదుకుని భరోసానిస్తామన్నారు. ప్రభుత్వ లైసెన్స్డ్ వ్యాపారాల్లో ఎస్సీలకు రిజర్వేషన్లు వర్తింపజేస్తామని ప్రకటించారు.
దళితుల శాతం పెరిగింది... వర్గీకరణ చేస్తే ఎదురేగి స్వాగతిస్తాం..
రాష్ట్రంలో దళితుల శాతం పెరిగిందని సీఎం కేసీఆర్ చెప్పారు. మంచిర్యాల జిల్లాలో అత్యధికంగా 25.64 శాతం, హైదరాబాద్‌లో అత్యల్పంగా 11.71 శాతం దళితులున్నారన్నారు. జనగామ, జయశంకర్భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, తదితర జిల్లాల్లో 20 శాతానికిపైగా ఉన్నారని తెలిపారు. మొత్తంగా రాష్ట్రంలో దళితుల శాతం 17.53 శాతానికి పెరిగిందన్నారు. రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 18,22, 291 దళిత కుటుంబాలున్నాయనీ, ఇప్పుడు వివాహాలై కొత్తగా మరో 50 వేల దాకా పెరిగి ఉండొచ్చని చెప్పారు. దళితులకు రిజర్వేషన్లు పెంచే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకుంటే వెంటనే అమలు చేయాలన్నారు. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి పంపినా..ప్రధానమంత్రికి 25 లెటర్లు ఇచ్చినా కేంద్రం పట్టించుకోవట్లేన్నారు. బీజేపీ నేతలు ఎస్సీ వర్గీకరణను చేయిస్తే బేగంపేట విమానాశ్రయానికి ఎదురేగి స్వాగతం పలుకుతామనీ, పెద్దపెద్ద పూలదండలు వేస్తామని చెప్పారు. బీసీ జనగణన చేయాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా వస్తున్నా కేంద్రం ఎందుకు నిరాకరిస్తున్నదని ప్రశ్నించారు. బీసీ జనగణన చేయలేమని అఫిడవిట్ దాఖలు చేయడం దారుణమన్నారు. బీసీ గణన జరగాల్సిందేనన్నారు. దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని స్పష్టం చేశారు. 33 జిల్లాలకూ నవోదయ పాఠశాలలు కేటాయించాలని అసెంబ్లీ వేదికగా కేంద్రాన్ని కోరారు. అందుకు కేంద్రంపై బీజేపీ నేతలు ఒత్తిడి తేవాలన్నారు.
మాదే అధికారం...
రాష్ట్రంలో మునుమ్ముందు కూడా తామే అధికారంలోకి వస్తామని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చేది లేదు.. సచ్చేది లేదు అన్నారు. ఎన్నికలు వస్తే తమకు అంచనాలు ఉండవా?.. తమది రాజకీయ పార్టీ కాదా? అని ప్రశ్నించారు. హుజూరాబాద్‌లో ఎన్నికలు అయిపోగా నే దళిత బంధు డబ్బులు వాపస్ పోతాయని ప్రచారం చేయడం దుర్మార్గమనీ, పచ్చిఅబద్దమని కొట్టిపాడేశారు. ఇలాంటి పద్ధతి ఎక్కడైనా ఉంటదా? 22వేల దళిత కుటుంబాలుంటే 17,18 వేల మందికి డబ్బులేశాం..వేసిన డబ్బులు వెనక్కి తీసుకుంటారా? ఏ ప్రభుత్వమైనా అలా చేస్తుందా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష సభ్యులు, బీజేపీ నేతలు విచిత్ర వాదనలు, అసత్యప్రచారాలను మానుకోవాలని హితవుపలికారు. ఎమ్మెల్యే రఘునందన్‌రావు యువకుడని, మంచి భవిష్యత్ ఉందనీ, ఆయన మరింత ఎత్తు ఎదగాలని ఆకాంక్షించారు. ఇంత పెద్ద స్కీమ్‌పై మాట్లాడే ముందు ఆలోంచి మాట్లాడాలనీ, ఏదో ఒకటి విమర్శ చేయాలనే మాటలను ఇకనైనా మానుకోవాలని సూచించారు.
మూడో వారం నుంచి దరఖాస్తుల స్వీకరణ
పోడు సాగుదారుల నుంచి ఈ నెల మూడో వారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని సీఎం సభలో ప్రకటించారు. ఈ ప్రక్రియను చూసుకునే బాధ్యత ఎమ్మెల్యేలదేనన్నారు. 5 లక్షల ఎకరాలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించి అర్హత ఉన్నవారికి ఇచ్చేస్తామన్నారు. వివాదాస్పదమైన భూముల విషయంపై కేంద్రానికి వినతి ఇస్తామనీ, దాని తర్వాత పరిష్కారిస్తామని చెప్పారు. అడవుల రక్షణ కోసం అక్కడి గిరిజనులతోనే కమిటీలు వేస్తామన్నారు. పోడుసాగుదారులను అడ్డం పెట్టుకుని వందలెకరాల అడవులను విధ్వంసం చేస్తున్నవారిని విడ్చిపెట్టబోమని స్పష్టంచేశారు.