Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సడక్ బంద్ విజయవంతం
- వనపర్తి నుంచి మఠంపల్లి వరకు (కృష్ణానది పరీవాహక ప్రాంతం)..
- అశ్వారావుపేట నుంచి ఆదిలాబాద్ వరకు (గోదావరి పరీవాహక ప్రాంతం)..
- కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలు సహా
- మొత్తం 75 కేంద్రాల్లో 500 కిలోమీటర్లు..
- గిరిపుత్రుల బతుకు పోరు
- దున్నే వాడిదే భూమి
- చట్టం ప్రకారం తక్షణం పట్టాలు ఇవ్వాల్సిందే
- కోతుల కోసం అడవి బిడ్డలను జైల్లో పెడతారా?: అఖిలపక్షం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు
- రాస్తారోకోలు.. రోడ్ల దిగ్బంధనం..
- శాంతియుత నిరసనకు పోలీసుల అడ్డగింపు..
- ముఖ్యనేతల హౌస్ అరెస్టు.. నిర్బంధాలు..ముందస్తు అరెస్టులు
- భద్రాచలంలో తోపులాటలో సొమ్మసిల్లి పడిపోయిన సీపీఐ(ఎం) నేత
- మిర్యాలగూడలో జూలకంటి రంగారెడ్డి దీక్ష : కేసీఆర్ మాయమాటలు ఆపండి
- పట్టాలివ్వకుంటే టీఆర్ఎస్ కార్యకర్తలను నిలువరిస్తాం : తమ్మినేని
నవతెలంగాణ- మొఫసిల్ యంత్రాంగం
పోడు కోసం పోరు రగిలింది.. అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006లో పేర్కొన్నట్టు 2005 డిసెంబర్ 13 కంటే ముందు పోడుభూములను సాగు చేస్తున్న సాగుదారులం దరికీ హక్కు పత్రాలు ఇవ్వడం కోసం తక్షణం కార్యాచరణతో కూడిన షెడ్యూల్ ప్రకటించాలని కోరుతూ గిరిపుత్రులు కదం తొక్కారు. చట్టం ప్రకారం వెంటనే పట్టాలు ఇవాలని డిమాండ్ చేశారు. వనపర్తి నుంచి మఠంపల్లి వరకు (కృష్ణా నది పరీ వాహక ప్రాంతం).. అశ్వారావుపేట నుంచి ఆదిలాబాద్ వరకు (గోదావరి పరీవాహక ప్రాంతం).. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలు సహా మొత్తం 75 కేంద్రాల్లో 500 కిలోమీటర్లు మంగళవారం అఖిలపక్షం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పోడు రైతులు సడక్‌బంద్ చేపట్టారు. పోడు సాగు భూములకు హక్కుల కల్పనతో పాటు, సాగుదారులకు మద్దతు నిలిచిన వామపక్షాలు, ప్రజాసంఘాల నాయకులపై బనాయించిన కేసులు ఎత్తేయాలనే, అటవీ శాఖ అధికారుల దాడులు ఆపాలని ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు చేపట్టారు. ఎక్కడికక్కడ జాతీయరహదారులను దిగ్బంధించారు. పోడు సాగుదారుల శాంతియుత సడక్‌బంద్‌ను అడ్డుకునేందుకు పోలీసులు అనేక ప్రయత్నాలు చేసినా, వాటిని అధిగమించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
భద్రాద్రి జిల్లాలో.. తమ్మినేని, చాడ, రంగారావు, నర్సింహులు, మిడియం హాజరు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల పరిధిలోని ఆంధ్రా-తెలంగాణ సరిహద్దులో రాస్తారోకో చేశారు. ముందుగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం), సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్‌రెడ్డి, సీపీఐ ఎంఎల్ ఎన్.డి రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నర్సింహులు మాట్లాడారు. కోతి చేష్టలు, మాయమాటలు కట్టిపెట్టి.. అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడుసాగులో ఉన్న ప్రతి గిరిజనుడికీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గిరిజనులు పోరు చేసేది పోడు కోసమేనని.. వారికిది బతుకు పోరు అని చెప్పారు. కోతుల రక్షణ పేరుతో హరితహారం చేపట్టి సాగులో ఉండి జీవనం సాగిస్తున్న అమాయక గిరిజనులను జైల్లో పెడతారా అని ప్రశ్నించారు. అటవీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించిన కేసీఆర్, అధికారులపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులతో పాటు సాగులో ఉన్న ప్రతి పేదా హక్కుదారుడేనని తెలిపారు. రిజర్వ్ ఫారెస్ట్-రెవెన్యూ భూములు ఏవో తేల్చుగకోవాల్సింది ఆ ఇరు శాఖల అధికారులే కానీ గిరిజనులు కాదని చెప్పారు. రేపటి నుండే పట్టాలు ఇవ్వాలని, లేకపోతే గ్రామాల్లోకి వచ్చే టీఆర్ఎస్ కార్యకర్తలను నిలువరిస్తామని హెచ్చరించారు. ''కంపా'' నిధులను టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు కాజేసారని విమర్శించారు.
గోదావరి బ్రిడ్జిపై తోపులాట.. సొమ్మసిల్లిన కార్యకర్తలు
భద్రాచలం గోదావరి బ్రిడ్జిపై ఆందోళన చేయడంతో పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో తీవ్ర తోపులాట జరగడంతో సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, మహిళా కార్యకర్త సొమ్మసిల్లి పడిపోయారు. వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిని సీపీఐ(ఎం), సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకటరెడ్డి పరామర్శించారు. కొత్తగూడెం ఇల్లందు క్రాస్ రోడ్డు వద్ద రాస్తాకోరో చేసిన ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్ సడక్‌బంద్‌లో పాల్గొనడానికి వస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ములకలపల్లి మండల కేంద్రంలో సడక్ బంద్‌కు ట్రాక్టర్లో తరలివస్తుండగా పోడు రైతు లింగయ్య(50) ప్రమాదవశాత్తు కింద పడి మృతిచెందారు. ఆ రైతు కుటుంబానికి ప్రభుత్వం రూ.10లక్షల పరిహారం ఇవ్వాలని తమ్మినేని, చాడ డిమాండ్ చేశారు. దుమ్ముగూడెంలో మాజీ ఎంపీ మిడియం బాబురావు ఆధ్వర్యంలో రెండు గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు.
జూలకంటి దీక్ష.. పెద్దవూరలో డీజీ, శ్రీరాంనాయక్ అరెస్టు
సూర్యాపేట జిల్లాలోని పాల కవీడు, చింతల పాలెం, మఠంపల్లి, నల్లగొండ జిల్లా లోని పెద్దవూర, దేవరకొండ ప్రాం తాల్లో అఖిల పక్షం ఆధ్వర్యంలో సడక్‌బంద్ నిర్వహించారు. మిర్యాలగూడలో సడక్‌బంద్‌కు వెళ్లకుండా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ జూలకంటి ఇంటి వద్దే దీక్ష చేపట్టారు. పెద్దవూర అఖిలపక్షం, గిరిజన సంఘం ఆధ్వర్యంలో పెద్దఎత్తున రాస్తారోకో చేశారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి.నర్సింహారావు, గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీరాంనాయక్తో పాటు సీపీఐ(ఎం), సీపీఐ కార్యదర్శులు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులను పోలీసులు అరెస్టు చేశారు. దామరచర్లలో జరిగిన రాస్తారోకోలో చెరకు సుధాకర్ పాల్గొన్నారు.
ఉట్నూరులో కోదండరామ్..
- మహబూబాబాద్‌లో నాగయ్య
పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోడ్లను దిగ్బంధించారు. ఉట్నూర్ ఎక్స్‌రోడ్డు దిగ్బంధనంలో తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరామ్‌తో పాటు అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు. జన్నారంలో తీసిన ర్యాలీలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు పాల్గొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జాతీయ రహదారులపై రాస్తారోకో చేశారు. మహబూబాబాద్‌లో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య, ఏటూరునాగారంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు సూడి కృష్ణారెడ్డి, గోవిందరావుపేటలో పోడు పోరాట కమిటీ రాష్ట్ర నాయకుడు బండారు రవికుమార్ పాల్గొన్నారు. భూపాలపల్లి జిల్లాలో అన్నిచోట్ల సడక్‌బంద్ జరిగింది.
పంచభూతాలను అమ్మేందుకు ప్రధాని కుట్ర : నారాయణ, జాన్‌వెస్లీ
దేశంలోని పంచభూతాలను అమ్మేందుకు ప్రధాని కుట్ర చేస్తున్నారని, నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి కేసీఆర్ మిలాకత్ అయ్యారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం శ్రీశైలం రహదారి దిగ్బంధనంలో వారు మాట్లాడారు. వందల సంవత్సరాల నుంచి నల్లమల ప్రాంతంలో సాగు చేసుకుంటున్న పోడు భూముల జోలికి వస్తే ఖబర్దార్ అని ఫారెస్ట్ అధికారులను హెచ్చరించారు. డీసీసీ అధ్యక్షులు వంశీకృష్ణ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో 12 మండలాలు.. 38 గ్రామాల పరిధిలో పోడు భూములు ఉన్నాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ మాజీ ఎంపీలు మధుయాష్కీ, మల్లురవి, మాజీ మంత్రి చిన్నారెడ్డి పాల్గొన్నారు.
పట్టాలివ్వకుంటే గద్దె దిగాలి : నంద్యాల నర్సింహారెడ్డి
ఏండ్ల తరబడి సాగుచేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వని ప్రభుత్వం గద్దె దిగాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నంద్యాల నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. నల్లమల సడక్ బందులో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం హాజీపూర్‌లో ఆయన మాట్లాడారు.
వెంటనే హక్కు పత్రాలు ఇవ్వాలి : సాగర్
వనపర్తి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ దగ్గర రాస్తారోకో చేశారు. పోలీసులు అడ్డుకొని నాయకులను అరెస్టులు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ మాట్లాడుతూ వెంటనే హక్కు పత్రాలివ్వాలన్నారు.
రోడ్డుపైనే గిరిజనుల భోజనం
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచే గిరిజనులు, ప్రజాసంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నేతలు ఎక్కడికక్కడ రోడ్లను దిగ్భందం చేశారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి టోల్‌ప్లాజా, కామారెడ్డిలోని టేక్రియాల్ చౌరస్తా వద్ద జాతీయ రహదారి-44ని దిగ్బంధం చేశారు.
సడకబంద్ జరిగిన ప్రాంతాలు
కొత్తగూడెం జిల్లా : చర్ల, దుమ్ముగూడెం- లక్ష్మీ నగర్, భద్రాచలం- బ్రిడ్జి, బూర్గంపాడు- మొరంపల్లి, అశ్వరావుపేట. మణుగూరు- బండారు గూడెం, పినపాక /కరకగూడెం- బయ్యారం క్రాస్ రోడ్డు, ఆళ్ల పల్లి, గుండాల, ఇల్లందు, టేకులపల్లి, అశ్వరావుపేట/దమ్మపేట, ములకలపల్లి, చండ్రుగొండ, జూలూరుపాడు, కొత్తగూడెం -ఇల్లందు క్రాస్.
ఖమ్మం జిల్లా : కారేపల్లి క్రాస్ రోడ్, కొణిజర్ల, ఏన్కూర్ , పెనుబల్లి, సత్తుపల్లి.
మహబూబాబాద్ జిల్లా : కంబాలపల్లి, కేసముద్రం, గార్ల , బయ్యారం.
వరంగల్ రూరల్ జిల్లా : ఇటి కాయల పల్లి.- (నర్సంపేట)
ములుగు జిల్లా : ఏటూరునాగారం, తాడువాయి, వెంకటాపూర్, మంగపేట, రాజుపేట, పస్రా , ములుగు, చిన్నబోయినపల్లి.
భూపాలపల్లి జిల్లా : రేగొండ, గాంధీనగర్ భూపాలపల్లి, కాటారం, మహాదేవపూర్, సిరొంచ హైవే. కొయ్యూరు, ఏమనపల్లి (మహాముత్తారం)
మంచిర్యాల జిల్లా : చెన్నూరు, బెల్లంపల్లి , జన్నారం.
నిర్మల్ జిల్లా : సత్తెనపల్లి, కడెం, దస్తూరాబాద్, పెంబి, ఇందన్ పల్లి.
ఆదిలాబాద్ జిల్లా : ఉట్నూర్- ఆసిఫాబాద్ క్రాస్ రోడ్.
ఆసిఫాబాద్ జిల్లా : వాంకిడి, దహెగాం, ఆసిఫాబాద్.
నాగర్ కర్నూల్ జిల్లా : హాజీపూర్ క్రాస్ రోడ్.
నల్లగొండ జిల్లా : దేవరకొండ, పెద్దవూర, దామరచర్ల.
సూర్యాపేట జిల్లా : మఠంపల్లి, పాలకీడు, మేళ్లచెరువు, చింతలపాలెం (మల్లారెడ్డి గూడెం)
వనపర్తి జిల్లా : వనపర్తి.
నిజామాబాద్ జిల్లా : ఇందల్వాయి.
కామారెడ్డి జిల్లా : గాంధారి, మాచారెడ్డి.