Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేరాన్ని అంగీకరించిన గుత్తికోయలు
- ఆయుధాలు స్వాధీనం..
నవతెలంగాణ-తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో సంచలనం సృష్టించిన పులి మృతి కేసులో ఐదుగురు గుత్తికోయలను అరెస్టు చేశారు. ఈ ఘటన వివరాలను లింగాల ఫారెస్ట్ రెంజ్ బీట్ అటవీ శాఖ అధికారులు బుధవారం వెల్లడించారు. ఉచ్చులో చిక్కుకుని మృతిచెందిన పులి కేసులో మంగళవారం రాత్రి లింగాల ఫారెస్ట్ రేంజర్ సతీశ్‌కు విశ్వసనీయ సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమై ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ శివ్ అశిష్ సింహా, మేడారం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గౌతమ్ రెడ్డి, పస్రా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శిరీషలు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అటవీ శాఖ సిబ్బంది గుత్తికోయలు దాక్కొని ఉన్న ఆవాసాలను ముట్టడించి మడకం రాము, ముచ్చకి అంధ, మడకం సతీశ్, కోవసి ఇడుమ, ముచ్చకి రాజ్‌కుమార్‌లను పట్టుకున్నారు. నిందితులను ప్రశ్నించగా వారు నేరాన్ని అంగీకరించారు. కాగా, వీరంతా మండలంలోని చింతల కటాపూర్ గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. పులి అవయవాలు, పులి కొవ్వు నుంచి తీసిన నూనె, ఉచ్చులు మాయం చేసినట్టుగా వారు అంగీకరించారు. ఫారెస్టు అధికారులు నిందితుల నుంచి ఘటనకు వినియోగించిన కత్తులు, గొడ్డలిని, జంతువు అవయవాలను స్వాధీనం చేసుకున్నారు.