Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వంగూరు
బైక్ అదుపు తప్పి కేఎల్ఐ కాల్వలో పడటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండల కేంద్రంలో బుధవారం వెలుగులోకొచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకార..మండలంలోని రంగాపూర్ గ్రామానికి చెందిన అల్లె నాగరాజు(25), నరేష్ (23) మండల కేంద్రంలో పనులు ముగించుకుని మంగళవారం సాయంత్రం స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. మండల కేంద్రం శివారులో మలుపు వద్ద బైక్ అదుపు తప్పి కేఎల్ఐ కాల్వలో పడిపోయింది. దాంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. బుధవారం తెల్లవారుజామున అటు వైపు వెళ్లిన రైతులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఉల్లంపల్లి గ్రామస్తుల సాయంతో మృతదేహాలను కాల్వలో నుంచి బయటకు తీయించి కుటుంబీకులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న జెడ్పీటీసీ కెవిఎన్ రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు పండిత్రావు కేఎల్ఐ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందన్నారు. ఏండ్లు గడిచినా కాల్వ నిర్మాణ పనులు పూర్తి చేయకపోవడం, కల్వర్టు నిర్మాణం లోతుగా ఉండటం, అక్కడక్కడా గుంతలు ఉండటంతోనే బైక్ అందులో పడిందని చెప్పారు. అందువల్ల కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని, మృతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు సీఐ రామకృష్ణ తెలిపారు.