Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సంక్షేమ సంఘం సమావేశంలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీసీ జనగణన కోసం కేంద్రంలోని బీజేపీ సర్కార్ మెడలు వంచుతామని పలువురు వక్తలు హెచ్చరించారు. ఆ సంఘం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు దాసు సురేష్ అధ్యక్షతన హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్ లో బుధవారం బీసీ ఉద్యోగులు, మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కష్ణయ్య, మాజీ ఎంపీలు అజీజ్ పాషా, వి.హనుమంత రావు, ఎల్ రమణ, ప్రొఫెసర్లు గాలి వినోద్ కుమార్, పీ.ఎల్ విశ్వేశ్వరరావు, దళిత నాయకులు జేబీ రాజు, బీసీ నాయకులు గుజ్జ కృష్ణ, నీలం వెంకటేష్, రామకృష్ణయ్య తదితరులు హాజరై ప్రసంగించారు. కార్పొరేట్లకు లబ్ది చేకూర్చే కుట్రలో భాగంగానే బీజేపీ కులగణనను పక్కన పెడుతున్నదని వారు విమర్శించారు. కేవలం రిజర్వేషన్లను అమలు చేయాల్సి వస్తుందనే కారణంతోనే ప్రభుత్వ రంగ సంస్థలను తమకు అనుకూలమైన వ్యాపారస్తులకు అమ్మి వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కులగణన చేపడితే విద్యావంతులు, ఉద్యోగులు, రాజకీయ నాయకుల లెక్కలు బహిర్గతమై దేశ రాజకీయ ముఖచిత్రమే మారిపోతుందని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. పార్టీలకతీతంగా బీసీ రాజకీయ నాయకులు కలిసి రావాలని పిలుపునిచ్చారు.