Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పండుగ వేళ ప్రత్యేక బృందాల ఏర్పాటు
- తొలిరోజు 11 బస్సులపై కేసులు నమోదు
- 2 బస్సులు సీజ్..14వేల జరిమాన
- ఈ నెల 20వరకు తనిఖీలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రయివేటు ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝలిపించారు. బుధవారం గ్రేటర్ హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ జె.పాండురంగ నాయక్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్, మలక్‌పేట్, తిరుమలగిరి, టౌలిచౌకి, బండ్లగూడ ఆర్టీవో అధికారులు ఈ ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించారు. నిబంధనలను ఉల్లంఘించి తిరుగుతున్న 11 సీసీ (కాంట్రాక్ట్ క్యారేజీ) బస్సులపై కేసులు నమోదు చేశారు. దసరా పండుగ నేపథ్యంలో మరో 15రోజులపాటు ఈ తనిఖీలను కొనసాగించనున్నారు. ఇందుకోసం రవాణా శాఖ అధికారులు పలు బృందాలుగా ఏర్పడి ఈనెల 20వరకు నగరంలోని విజయవాడ, ముంబయి, బెంగళూరు, గుజరాత్, నాగ్‌పూర్ జాతీయ రహదారులపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా పర్మిట్ ఉల్లంఘనలు, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, వాహన సామర్థ్యం పరీక్షలుఫ్రిట్నెస్), ఫస్ట్‌ఎయిడ్ బాక్స్, అగ్నిమాపక యంత్రాల్లేని బస్సులు, కమర్షియల్ గూడ్స్ మోసుకెళ్లే బస్సులను గుర్తించి కేసులు నమోదు చేయనున్నారు.హైదరాబాద్ నగరం నుంచి ప్రతిరోజూ తెలంగాణలోని జిల్లాలతో పాటు ఏపీకి సుమారు 800 ప్రయివేటు బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇందులో చాలా బస్సులు కాంట్రాక్ట్ క్యారియర్ కింద నమోదు చేసుకుని స్టేజీ క్యారియర్ల కింద తిప్పుతున్నాయి. అగ్నిమాపక యంత్రాలు లేకుండా వందల కి.మీ. మేర బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. పండుగ వేళ ప్రయాణికుల రద్దీని ఆసరగా చేసుకుని ఎడాపెడా చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఈ క్రమంలో దసరా పండుగ నేపథ్యంలో రవాణాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. నగరంలోని ప్రధాన రహదారులపై బుధవారం నుంచి ఈ నెల 20 వరకు ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని నిర్ణయించారు.