Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నూతన విద్యుత్ చట్టాల తొలి ఎఫెక్ట్
- విద్యుత్ ప్రీపెయిడ్ తప్పనిసరి
- ఇప్పటికే కేంద్రం గెజిట్ విడుదల
- ఖమ్మం జిల్లాలో 5.60 లక్షల సర్వీసులు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
నూతన విద్యుత్ చట్టాల్లో భాగంగా విద్యుత్ ప్రయివేటీకరణ ప్రక్రియ వేగవంతం అవుతోంది. కేంద్రం ఇప్పటికే ప్రీపెయిడ్ మీటర్లు అమర్చేందుకు గెజిట్ విడుదల చేసింది. ఇది పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే డీటీహెచ్, మొబైల్ నెట్‌వర్క్‌లకు ఎలాగైతే రీచార్జి చేస్తామో.. పవర్ సఫ్లరు కోసమూ అలాగే రీచార్జి చేయాల్సి ఉంటుంది. రీచార్జి ఆలస్యమైతే బ్యాలెన్స్ అయిపోయిన వెంటనే కరెంట్ సరఫరా నిలిచిపోతుంది. విద్యుత్ పంపిణీ నష్టాలు, బకాయిల నివారణ తదితర కారణాలతో ప్రీపెయిడ్ చెల్లింపు విధానాన్ని కేంద్రం ప్రతిపాదించింది. ఈ విధానం పూర్తిస్థాయిలో అమలైతే జిల్లాలోని 5.60 లక్షల విద్యుత్ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు బిగిస్తారు.
ప్రభుత్వ సంస్థల్లో అమలు...
నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్పీడీసీఎల్) పరిధిలో ఇప్పటికే ఈ విధానాన్ని ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాల్లో అమలు చేస్తున్నారు. అన్ని కేటగిరీల కనెక్షన్లు, ఫీడర్లు, విద్యుత్ నియంత్రణ పరికరాలకు వీటిని ఏర్పాటు చేస్తారు. త్వరలోనే జిల్లాలో దశలవారీగా దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రారంభిస్తారు. 2017 నుంచే ఖమ్మం జిల్లాలో ప్రీపెయిడ్ మీటర్ల ఏర్పాటు చేస్తున్నారు. అర్హులను గుర్తించిన ప్రభుత్వం ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను తొలుత బిగించింది. ఇప్పటి వరకు జిల్లా కేంద్రంలోని 1,665 ప్రభుత్వ కార్యాలయాలకు వీటిని బిగించారు. వీటిలో 115 మీటర్లకు మాత్రమే ముందస్తు చెల్లింపుల విధానాన్ని అమలు చేస్తు న్నారు. కేంద్రం నిర్ణయంతో మిగిలిన వాటిని కూడా వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు ప్రారంభిం చారు. 2023 ఏడాదంతానికి వ్యవసాయం మినహా జిల్లాలోని అన్ని కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగిం చాల్సిందిగా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ ప్రక్రియ వేగవంతం అయ్యేది.. కానీ స్మార్ట్ మీటర్ల ధరలు ఒక్కో మీటర్ రూ.10వేలకు పైగా పలుకుతుండటంతో కొంత స్తబ్ధుగా సాగుతోంది.
ప్రీపెయిడ్ మీటర్లతో
వినియోగదారులకు కష్టాలు
ప్రీపెయిడ్ మీటర్లు అందుబాటులోకి వస్తే విద్యుత్ వినియోగదారులకు కష్టాలు మొదలైనట్టే. కానీ విద్యుత్ పంపిణీ సంస్థలకు బకాయిల భారం తగ్గుతుంది. ప్రస్తుతం వినియోగదారులు వాడుకున్న విద్యుత్‌కు అనుగుణంగా బిల్లు చేసిన తర్వాత 15 నుంచి 20 రోజులకు బిల్లు కడుతున్నారు. ఒక్కోసారి ఆ నెల బిల్లు చెల్లించకపోయినా తదుపరి మాసంలో నామమాత్రపు పెనాల్టీతో చెల్లిస్తున్నారు. కానీ ప్రీపె యిడ్ స్మార్ట్ మీటర్లు బిగించాక ఇటువంటి వెసులు బాటు ఏదీ ఉండదు. నూతన విధానంలో బిల్లు చెల్లిం చిన తర్వాతే విద్యుత్ వినియోగించాల్సి ఉంటుంది. రీచార్జి చేసుకున్న మొత్తం పూర్తయితే సరఫరా దానంతటదే నిలిచిపోతుంది. ఈ విధానం అమలైతే వినియోగదారులు విద్యుత్‌ను ఎంతో పొదుపుగా వాడాల్సి ఉంటుంది. తొలుత సబ్స్టేషన్లలోని ఫీడర్, ట్రాన్స్ఫార్మర్ లెవల్లో మీటర్లు బిగించి, తద్వారా ఆ ప్రాంతంలో వసూలయ్యే రెవెన్యూతో వీటిని పోల్చి చూస్తారు. ఏ ప్రాంతంలో ఎక్కువ విద్యుత్ వినియోగం జరుగుతుందో గుర్తిస్తారు.
ఖమ్మం జిల్లాలో కేటగిరీల వారీగా
సర్వీసుల వివరాలు
గృహ వినియోగం: 4,07,255
వాణిజ్య వినియోగం: 40,091
పరిశ్రమలు : 2,303
కుటీర పరిశ్రమలు : 412
వ్యవసాయ కనెక్షన్లు : 1,00,593
వీధి దీపాలు : 5,185
పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు : 2,327
ఇతర కనెక్షన్లు : 189
బకాయిల భారం తగ్గుతుంది: కె.రమేష్, ఎస్ఈ
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇప్పటికే ప్రీపెయిడ్ మీటర్లు బిగించాం. గెజిట్ అమల్లోకి రావడానికి మరికొంత సమయం పడుతుంది. జిల్లా వ్యాప్తంగా ప్రీపెయిడ్ మీటర్లు బిగిస్తే విద్యుత్ పంపిణీలో నష్టాలతో పాటు సంస్థపై బకాయిల భారం తగ్గుతుంది. వినియోగదారుల్లో విద్యుత్ పొదుపు చేసే లక్షణాలు అలవడుతాయి. ఏ ప్రాంతంలో అధిక విద్యుత్ వినియోగం ఉందో కూడా తెలుస్తుంది.
విద్యుత్ ప్రయివేటీకరణతో వినియోగదారులపై భారం : మందపాటి సత్యనారాయణరెడ్డి, టీఎస్‌ఈఈయూ 327 జిల్లా అధ్యక్షులు
విద్యుత్ ప్రయివేటీకరణతో సంస్థలోని ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుంది. వినియోగదారులపైనా భారం పడుతుంది. కరెంట్ అధికంగా వినియోగిస్తున్న చోట చార్జీలు కూడా అదనంగా పడే అవకాశమూ లేకపోలేదు. మన ట్రాన్స్ఫార్మర్ పరిధిలో ఎవరో దుబారా చేస్తే దాని ప్రభావం ఆ ప్రాంతం వారందరిపై పడుతుంది. ఏ రకంగా చూసిన ప్రీపెయిడ్ మీటర్లు సంస్థకు లాభాలందించినా వినియోగదారులపై మాత్రం భారం తప్పదు.
ప్రీపెయిడ్ మీటర్లతో సంస్థలో పనిచేసే బిల్ కలెక్టర్లకు ఉద్యోగ భద్రత లేదు.. : ప్రసాద్, ఎన్పీడీసీఎల్ కార్యదర్శి, యూనైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (1827)
విద్యుత్ ప్రీపెయిడ్ మీటర్లు ప్రతిపాదన.. సామాన్య ప్రజల కు భారంగా మారుతుంది. ప్రీపెయిడ్ వల్ల వినియోగ దారులు ముందుగా చెల్లించ వలసివస్తుంది. గతంలో పది హేను రోజుల సమయం ఉం డేది. ఇప్పుడు ఆ సమయం లేకుండా పోయే ప్రమా దం ఉంది. అంతేకాదు, సంస్థలో పనిచేసే మీటర్ రీడర్లు, ప్రయివేటు విద్యుత్ బిల్ కలెక్టర్లు ఉపాధి కోల్పోతారు. ఎలాంటి ఉద్యోగ భద్రత లేకపోవడంతో వారి కుటుంబాలు వీధినపడతాయి.