Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రేడ్ యూనియన్లతో కలిసి పరిశ్రమల్లో పర్యటనకు సిద్ధమా?
- సీఐటీయూ పని తగ్గలేదు.. పెరిగింది
- పరిశ్రమల్లో శ్రమకు గౌరవం లేదు
- రేపు రాష్ట్రవ్యాప్త సమ్మె : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు, ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర మంత్రి కేటీఆర్ వస్తే కార్మికుల దుర్భర బతుకులను కండ్లకు కట్టినట్టు చూపెడతామని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు, ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య అన్నారు. తమతోగానీ, ట్రేడ్ యూనియన్లతో గాని కలిసి పరిశ్రమల్లో పర్యటించేందుకు మంత్రి సిద్ధమేనా? అని సవాల్ విసిరారు. రాష్ట్రంలో డిగ్నిటీ ఆఫ్ లేబర్‌ను కాపాడుతున్నామనీ, కార్మికులకు సమస్యలు లేవంటూ అసెంబ్లీ సాక్షిగా మంత్రి కేటీఆర్ అబద్ధాలు చెప్పటం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ఇకముందు సీఐటీయూకు పనుండదని వ్యాఖ్యానించడాన్ని ఖండించారు. పారిశ్రామిక వాడల్లో చేపట్టిన పాదయాత్ర ద్వారా తమ దృష్టికి అనేక సమస్యలు వచ్చాయన్నారు. రాష్ట్రంలో సీఐటీయూ పని తగ్గదలేదనీ, వాటి పరిష్కారం కోసం ముందుండి కొట్లాడే బాధ్యత మరింత పెరిగిందని నొక్కిచెప్పారు. రానున్న కాలంలో పోరాటాలను తీవ్రం చేస్తామనీ, ఐక్యపోరాటాలతో ముందుకెళ్తామని ప్రకటించారు. బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మంత్రి కేటీఆర్ చెబుతున్నదానికి భిన్నంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులున్నాయనీ, వాస్తవాలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తే బాగుటుందని సూచించారు. రాష్ట్రంలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఎక్కడా లేదనే విషయాన్ని తమతో వస్తే కేటీఆర్‌కు చూపిస్తామన్నారు. ఆ తర్వాత వారం, 15 రోజుల నిర్ధిష్ట గడువు పెట్టుకుని కార్మికుల సమస్యలను పరిష్కరిస్తే చాలని కోరారు. రాష్ట్రంలో 8 గంటల పనివిధానం స్థానంలో 12 గంటలు అమలవుతున్నదనీ, పర్మినెంట్ స్థానంలో కాంట్రాక్టు పద్ధతిలో కార్మికులతో పనిచేయిస్తున్న విషయం తమ పాదయాత్ర దృష్టికి వచ్చిందని వివరించారు. ఎక్కడా ఉద్యోగ భద్రతలేదన్నారు. 2, 3వేల మంది కార్మికులున్నచోట కూడా కనీసవేతనాలుగానీ, సమానపనికి సమానవేతనాలు గాని అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు అతి తక్కువ వేతనాలు కట్టిస్తున్నారని వాపోయారు. రాష్ట్రంలోని పరిశ్రమల్లో 70 శాతం ఉత్తరాదికి చెందిన వలసకార్మికులే కనిపించారన్నారు. ఒక్కో రూమ్‌లో ఏడెనిమిది మందిని కుక్కుతున్నారనీ, ఆ రేకుల షెడ్డుకూ మూడు వేల రూపాయల అద్దెను యాజమాన్యాలు వసూలు చేస్తున్నాయని పలు ఉదహరణలతో చెప్పారు. పందికొక్కులు తొవ్విన, పందులు తిరిగే అపరిశుభ్ర ప్రదేశాల్లో వలసకార్మికుల జీవితాలు దుర్భరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 1948 కనీస వేతనాల చట్టం ఎక్కడా అమలు కావడం లేదన్నారు. రాష్ట్రంలో ఏడేండ్ల కాలంలో కనీసవేతనాల జీవోలు విడుదల కాని విషయాన్ని గుర్తుచేశారు. కొన్ని పరిశ్రమల్లోనైతే 15 ఏండ్ల నుంచి వేతన సవరణ జరగలేదని వివరించారు. కనీసవేతనాల సలహామండలి, తెలంగాణ కార్మిక సంక్షేమ బోర్డు సూచనలను రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతున్నదని విమర్శించారు. ఎంప్లాయి ఫ్రెండ్లీ ప్రభుత్వం ఇలా చేస్తుందా? శ్రమకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించారు. కార్మిక చట్టాలున్నప్పుడే పరిస్థితి ఇలా ఉంటే..కార్మిక కోడ్ల తర్వాత ఎలా ఉంటుందోనని ఆందోళన వెలిబుచ్చారు. కార్మిక హక్కులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
రేపు రాష్ట్రవ్యాప్తంగా సమ్మె
రాష్ట్రంలోని 73 షెడ్యూల్డ్ పరిశ్రమల్లో కనీస వేతనాల జీవోలు విడుదల చేయాలనీ, కార్మిక కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు పిలుపునిస్తున్నట్టు సాయిబాబు, ఎస్.వీరయ్య ప్రకటించారు. ఈ సమ్మెకు అన్ని కార్మిక, ప్రజా సంఘాలు మద్దతు తెలపాలని కోరారు. సమ్మెను జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ కోశాధికారి వంగూరు రాములు, తదితరులు పాల్గొన్నారు.