Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామీణ ప్రాంతాల్లోనే 89శాతం సింగిల్ టీచర్ పాఠశాలలు
- దేశవ్యాప్తంగా 11.16 లక్షల మంది టీచర్లు అవసరం : యునెస్కో తాజా నివేదిక
- తెలంగాణ గ్రామీణంలో 72 శాతం ఖాళీలు
తెలంగాణలో 42,355 పాఠశాలలు ఉండగా, 73 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయని నివేదిక పేర్కొంది. మొత్తం 2,57,367 మంది టీచర్లు ఉన్నారనీ, అందులో 62 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారని తెలిపింది. తెలంగాణలో 56 శాతం మహిళా ఉపాధ్యాయులున్నారనీ, 16 శాతం స్కూల్స్‌లో ఖాళీలున్నాయని పేర్కొంది. రాష్ట్రంలో 6,678 పాఠశాలలు సింగిల్ టీచర్ ఉన్న పాఠశాలలని తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో 72 శాతం ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు ఉన్నాయనీ, 16 శాతం స్కూల్స్ ఖాళీలున్నాయని తెలిపింది. ఇంకా 37,204 టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉన్నదనీ, అందులో గ్రామీణ ప్రాంతాల్లో 25 శాతమని నివేదిక పేర్కొంది. దేశంలో 15,51,000 పాఠశాలలు ఉండగా, అందులో 1,10,971 (7 శాతం) సింగిల్ టీచరున్న పాఠశాలు ఉన్నాయని నివేదిక స్పష్టం చేసింది. అందులో 89 శాతం గ్రామీణ ప్రాంతాల్లో కాగా, 19 శాతం పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. ఇంకా 11,16,846 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉన్నదనీ, అందులో 69 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే అని నివేదిక పేర్కొంది.
కరోనా దెబ్బకు ప్రయివేటు టీచర్లు విలవిల
న్యూఢిల్లీ: మనదేశంలో దాదాపు 1.2 లక్షల సింగిల్ టీచర్ పాఠశాలలున్నాయని, ఇందులో 89శాతం పాఠశాలలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయని తాజా అధ్యయనం ఒకటి పేర్కొన్నది. ప్రస్తుతం ఇండియాలో టీచర్ల కొరతను తీర్చాలంటే అదనంగా 11.16లక్షల మంది ఉపాధ్యాయులు అవసరమని యునెస్కో తాజా నివేదిక తెలిపింది. పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్), యునిఫైడ్ డిస్ట్రిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యు కేషన్ (యూడిఐఎస్ఈ) డాటా ఆధారంగా యునెస్కో ఈ నివేది కను రూపొందించింది. 'స్టేట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఫర్ ఇండియా-2021' అనే పేరుతో నివేదికను విడుదల చేసింది. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(ముంబయి)కు చెందిన ప్రొఫెసర్ పద్మా ఎం.సారంగపాని నేతృత్వంలోని బృందం, యునె స్కో బృందం సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించారు.
ఈ నివేదిక ప్రకారం, మనదేశంలో దాదాపు 1,10,971 (పీఎల్ఎప్ఎస్ 2018-19 డాటా) సింగిల్ టీచర్ పాఠశాలలు ఉన్నాయి. దేశంలోని మొత్తం 11.51లక్షల స్కూళ్లలో దాదాపు 95లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. ఇందులో 7.15శాతం మంది సింగిల్ టీచర్‌గా ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్నారు. వీరు పనిచేస్తున్న స్కూళ్లలో 89శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. అత్యధికంగా అరుణాచల్ ప్రదేశ్‌లో 18.22శాతం, గోవాలో 16.08శాతం, తెలంగాణలో 15.71శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 14.4శాతం, జార్ఖాండ్‌లో 13.81శాతం, ఉత్తరాఖండ్‌లో 13.64శాతం, మధ్యప్రదేశ్‌లో 13.08శాతం, రాజస్థాన్‌లో 10.8శాతం సింగిల్ టీచర్ స్కూల్స్ ఉన్నాయి.
విద్యతోనే మిగతావన్నీ..
ఐక్యరాజ్యసమితి నిర్ణయించిన '17 స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల్లో' ఒకటి విద్య. అత్యంత ముఖ్యమైన గోల్ ఇది. ఎందుకంటే మిగతా అభివృద్ధి లక్ష్యాల్ని చేరుకునేందుకు మార్గం వేసేది విద్యేనని ఇండియాలో ఐరాస రెసిడెంట్ కోఆర్డినేటర్ డైడ్రే బోడ్ అన్నారు. కేరళలో అత్యధికంగా 78శాతం మహిళా టీచర్లున్నారని ప్రొఫెసర్ పద్మా సారంగపాని చెప్పారు. ''గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళా టీచర్ల సంఖ్య తక్కువగా ఉందని నివేదిక తెలిపింది. గ్రామీణ ప్రాంతాల ప్రైమరీ స్కూళ్లలో మహిళా టీచర్లు 28శాతముంటే, పట్టణ ప్రాంతాల్లో 63శాతమున్నారు. సెకండరీ స్కూల్ స్థాయిలో గ్రామాల్లో మహిళా టీచర్లు 24శాతం ఉన్నారని, పట్టణాల్లో 53శాతమున్నారని నివేదిక పేర్కొంది.
భారీగా పడిపోయిన నియామకాలు
ప్రయివేటు పాఠశాలల్లో కొత్త టీచర్ల నియామకం 10శాతం పడిపోయింది. అలాగే ప్రభుత్వ పాఠశాల్లో 6శాతం పడిపోయింది. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలి. సెకండరీ స్కూల్స్‌లో ప్రతి 35మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలి. దీనిని పీటీఆర్గా పేర్కొంటారు. దీని ప్రకారం ఇప్పుడు మనదేశంలో అదనంగా 11,16,846 మంది టీచర్లు కావాలి. ఇందులో 69శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లోనే అవసరమవుతారు. భారీ సంఖ్య లో టీచర్ల కొరత ఉన్న రాష్ట్రాలు..యూపీలో 3,20,000, బీహార్‌లో 2,20,000, జార్ఖాండ్, కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌లలో 80,000.
జీతాల సంగతి
పీఎల్ఎఫ్ఎస్ డాటా ప్రకారం, మనదేశంలో సగటు ప్రయివేటు టీచర్ నెల వేతనం రూ.13,564. ఇక గ్రామీణ ప్రాంతాల్లో రూ.11,584కన్నా తక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రయివేటు మహిళా టీచర్లకు నెలకు అందుతున్న సగటు వేతనం రూ.8212గా ఉంది. కరోనా సంక్షోభం ప్రయివేటు టీచర్ల జీవితాల్ని తీవ్రంగా ప్రభావితం చేసిందని నివేదిక తెలిపింది. ప్రయివేటు రంగంలో అతి తక్కువ వేతనాలు అమలుజేస్తున్నారు. ఒక మహిళా ప్రయివేటు టీచర్ నెల వేతనం, ఆ కుటుంబానికి ఎంతో కీలకం. కాబట్టి ఈ రంగంలో సరైన వేతనాలు అమలయ్యేట్టు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.