Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ ప్రధానిగా ఉంటే దేశానికే ప్రమాదం
- సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గతంలో ఫ్యాక్టనిస్టులు శత్రువులను లారీలతో తొక్కించి చంపేవారనీ, ప్రస్తుతం కేంద్ర మంత్రులు, బీజేపీ గూండాలు అదే తరహాలో కారుతో తొక్కించి రైతులు, నిరసనకారులను చంపేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ విమర్శించారు. సంపాదన కోసం సముద్ర మార్గంగా డ్రగ్స్ సరఫరా చేసే అదానీకి లక్షల కోట్ల రూపాయలు ఇస్తామంటే ఈ దేశానికి ఆయన ఉగ్రవాదులను సరఫరా చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కేంద్రం, ఏపీ ప్రభుత్వ సహకారంతోనే అదానీ ఆయన ఓడరేవుల ద్వారా డ్రగ్స్ సరఫరా చేశారనీ, ఆయనను ఎందుకు పట్టుకోవడం లేదని ప్రశ్నించారు. ఇక ఒక్క క్షణం మోడీ ప్రధానిగా ఉన్నా దేశానికే ప్రమాదం అని అన్నారు. హైదరాబాద్‌లో మఖ్దూంభవన్‌లో బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక వైపు ఆందోళన చేస్తున్న వారిని కారుతో గుద్ది చంపిన వారు రాజభోగాలు అనుభవిస్తుంటే, మరోవైపు బాధితులను జైళ్లలో పెట్టారనీ, వారిని పరామర్శించేందుకు వెళ్తున్న ప్రతిపక్ష నేతలను గృహనిర్భందం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీని ఎందుకు అరెస్ట్ చేశారనీ, ఆమె ఏమైనా రౌడీనా అని ప్రశ్నించారు. దేశ సంపదను, పన్నులను ఎగవేసి లక్షల కోట్లను విదేశాల్లో దాచిపెట్టుకున్నట్టు విషయం పాండోరా పత్రాల ద్వారా వెల్లడైందన్నారు. దేశం తీవ్రమైన ఆర్థిక నేరస్థుల వ్యవస్థగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది అక్టోబర్ 14 నుంచి 18 వరకు విజయవాడలో సీపీఐ జాతీయ మహాసభలను నిర్వహించనున్నుట్టు ప్రకటించారు.
'పోడు'పై అసెంబ్లీ తీర్మానం చేయాలి : చాడ
పోడుభూముల విషయంలో 2014, జూన్ 2 వరకు సాగుదారులకు హక్కు పత్రాలు ఇవ్వాలనే నెపంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కాలయాపన చేయొద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి కోరారు. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆలస్యమైతే పోడుసాగుదారులు చూస్తూ ఉరుకునే పరిస్థితుల్లో లేరనీ, తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. పోడు రైతు రాస్తారోకో విజయవంతమైందని చెప్పారు.