Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 300కోట్ల వరకు మనీలాండరింగ్ జరిగినట్టు అనుమానాలు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
నగరంలో ప్రముఖ బంగారు, ఆభరణాల వ్యాపారం చేసే శ్రీకృష్ణ జ్యువెల్లర్స్ దుకాణాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) అధికారులు గురువారం దాడులు జరిపారు. ఈ దాడులలో శ్రీకృష్ణ జ్యువెల్లర్స్ యాజమాన్యం కోట్లాది రూపాయల్లో మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఈడీ అధికారులు అనుమానిస్తున్నట్టు తెలిసింది. 2019లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు శ్రీకృష్ణ జ్యువెల్లర్స్‌పై భారీ ఎత్తున మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు కేసులు నమోదు చేయగా, ఆ కేసుల ఆధారంగానే ఈడీ అధికారులు తదుపరి దర్యాప్తును కొనసాగిస్తున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగానే నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న శ్రీకృష్ణ జ్యువెల్లర్స్ దుకాణాలపై ఈడీ అధికారులు సోదాలు జరిపి పలు రికార్డులను, కంప్యూటర్ హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. దాదాపు 1100 కిలో గ్రాముల బంగారానికి సంబంధించి రూ. 300 కోట్ల మేరకు శ్రీకృష్ణ జ్యువెల్లర్స్ యాజమాన్యం మనీలాండరింగ్‌కు పాల్పడ్డట్టు ఈడీ అధికారులు గుర్తించినట్టు తెలిసింది. కాగా, ఈ నేపథ్యంలోనే గతంలో శ్రీకృష్ణ జ్యువెల్లర్స్ ఎండీ ప్రదీప్‌కుమార్‌ను అధికారులు గతంలో అరెస్టు చేశారు. తాజా దర్యాప్తులో మరెన్ని కోట్ల రూపాయల మేరకు శ్రీకృష్ణ జ్యువెల్లర్స్ మనీలాండరింగ్‌కు పాల్పడిందో అన్న కోణంలో ఈడీ దర్యాప్తు కొనసాగుతున్నట్టు తెలిసింది.