Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆలస్యంగా వెలుగులోకి..
- మెదక్ జిల్లాలో గర్భం దాల్చిన బాలిక..
- నిజామాబాద్ జిల్లాలో చాక్లెట్లు ఆశచూపి..
- గోప్యంగా ఉంచిన పోలీసులు
నవతెలంగాణ-నిజాంపేట/కంఠేశ్వర్/ మునుగోడు
రాష్ట్రంలో ఒక్క రోజే నలుగురు బాలికలపై లైంగికదాడి జరిగిన ఘటనలు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో 65 ఏండ్ల ఓ ప్రభుద్దుడు ఓ మైనర్‌పై లైంగికదాడికి పాల్పడగా.. బాలిక గర్భం దాల్చడంతో విషయం బయటపడింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చాక్లెట్లు ఆశచూపి ఓ వ్యక్తి ఇద్దరు మైనర్ల పై లైంగికదాడికి పాల్పడగా.. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారనే విమర్శలు వినిపిస్తు న్నాయి. నల్లగొండ జిల్లా మునుగోడులో బాలికపై లైంగికదాడి జరిగింది. ఈ ఘటనలు గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. కుటుంబ సభ్యులు, గామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..
మెదక్ జిల్లా రామాయంపేట మండలం దొంగల ధర్మారం గ్రామానికి చెందిన నర్సింగరావు, బాల్‌లక్ష్మి బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వెళ్లగా.. తమ 17 ఏండ్ల కూతురుని నిజాంపేట మండలంలోని నార్లపూర్‌లో ఉన్న ఆమె అమ్మమ్మ దగ్గర ఉంచారు. అయితే వారి ఇంటి పక్కనుండే మన్నె నర్సింలు (65) పిల్లలతో బాలికకి స్నేహం ఏర్పడింది. టీవీ చూడటానికి తరచూ నర్సింలు ఇంటికి వెళ్లేది. ఈ క్రమంలో ఆమెపౖౖె నర్సింలు లైంగికదాడికి పాల్పడ్డాడు. కాగా, 15 రోజుల కిందట నుంచి ఆమెకు అనారోగ్యంగా ఉంటుండటంతో ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. బాలిక గర్భం దాల్చినట్టు వైద్యులు నిర్ధారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా.. నిందితున్ని పట్టుకొని కేసు చేసి రిమాండ్‌కు తరలించారు. బాలికపై లైంగికదాడి చేసిన నిందితున్ని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు మూడెకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నిజామాబాద్ నగరంలోని ఆరో పోలీస్ స్టేషన్ పరిధిలో గల పెయింటర్స్ కాలనీ వెంగల్రావు నగర్‌కు చెందిన వాసీం అనే వ్యక్తి మేస్త్రీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఐదు రోజుల కిందట అతని ఇంటికి సమీపంలో నివాసముంటున్న ఇద్దరు మైనర్ (8,11) బాలికలకు చాక్లెట్లు ఇస్తానని ఇంటికి తీసుకెళ్లాడు. ఇంట్లో అసభ్యకరంగా ప్రవర్తించి, వారిపై పలుమార్లు లైంగికదాడి చేశాడు. విషయం తెలుసుకున్న బాలికల తల్లిదండ్రులు ఆరో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. లైంగికదాడి చేసిన వ్యక్తిపై ఫొక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కేసు వివరాలను బహిర్గతం చేయకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. లైంగికదాడికి గురైన ఇద్దరు బాలికలను వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కచలాపురం గ్రామానికి చెందిన రజనీకాంత్ జులాయిగా తిరుగుతూ ఉంటాడు. అదే గ్రామానికి చెందిన బాలికపై కన్నేసిన రజనీకాంత్ ఈ నెల 3న లైంగికదాడి చేశాడు. ఈ క్రమంలో కడుపునొప్పితో బాధ పడుతున్న బాలిక తల్లికి విషయం చెప్పింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం. ఈ సంఘటనపై ఎస్ఐ రజినీకర్రెడ్డిని వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదని తెలిపారు.