Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వచ్ఛత వైపు గ్రామాల అడుగులు
- గవర్నర్ తమిళిసై నల్లగొండలో పర్యటన
నవతెలంగాణ - నల్లగొండ
జాతిపిత మహాత్మాగాంధీ ఆదర్శాలు, ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ఆయన కలలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ అన్నారు. గవర్నర్ గురువారం నల్లగొండ పట్టణంలో పర్యటించారు. ఉదయం 10:45 గంటలకు హైదరాబాద్ నుంచి ఆమె రోడ్డు మార్గం ద్వారా నల్లగొండలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌజ్‌కు చేరుకున్నారు. అదనపు కలెక్టర్లు రాహుల్‌శర్మ, చంద్రశేఖర్ స్వాగతం పలికారు. పట్టణంలో ఏర్పాటు చేసిన ఓ ప్రయివేటు ఆస్పత్రిని గవర్నర్ ప్రారంభించారు. అనంతరం ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెమినార్ హాల్‌ను, అంబులెన్స్‌ను ప్రారంభించారు. అక్కడే ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. పానగల్‌లోని ఛాయ సోమేశ్వరాలయాన్ని గవర్నర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాముఖ్యత గురించి ప్రముఖ చరిత్ర పరిశోధకులు సూర్య కుమార్, ఆలయ చైర్మెన్ గంట్ల ఆనంతరెడ్డి ఆమెకు వివరించారు. ఆలయం వద్ద గవర్నర్ మొక్కలు నాటారు. అనంతరం మహాత్మాగాంధీ యూనివర్శిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. అక్కడే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. పలువురు మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.
అనంతరం నిర్వహించిన సభలో గవర్నర్ మాట్లాడుతూ.. సత్యాగ్రహమే ఆయుధంగా శాంతి, అహింస మార్గాల్లో దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి గాంధీజీ అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ అయన అడుగుజాడల్లో నడవాలన్నారు. నేడు గ్రామాలు స్వచ్ఛత వైపు అడుగులు వేస్తున్నాయని, ప్రతి గ్రామాన్నీ స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దాలని కోరారు. 1958లో నల్లగొండలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఏర్పాటైందన్నారు. దక్షిణ భారతదేశంలో ఇది చాలా పాతదన్నారు. తన సేవల ద్వారా ఎంతోమందికి ప్రాణదానం చేసిందన్నారు. కోవిడ్, తూపాన్ సమయాల్లో పెద్దఎత్తున సహాయ చర్యలు చేపట్టినట్టు తెలిపారు. కోవిడ్ సమయంలో మాస్కులు, పండ్లు, బలవర్థకమైన ఆహారం పంపిణీ చేసినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో డీఐజీ ఏవీ రంగనాథ్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, రాహుల్ శర్మ, ఎంజీ యూనివర్శిటీ వైస్ ఛాన్స్లర్ గోపాల్‌రెడ్డి, రిజిస్ట్రార్ విష్ణుదేశ్, నల్లగొండ ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు దుబ్బాక నర్సింహారెడ్డి, జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, తహసీల్దార్ నాగార్జున్‌రెడ్డి, రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మెన్ గోలి అమరేందర్‌రెడ్డి, వైస్ చైర్మెన్ డాక్టర్ పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.