Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల జీతాల కోసం రూ.58.23 కోట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు ఇంటర్ విద్యా కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ గురువారం ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలోని ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మూడు నెలల వేతనాలను విడుదల చేశామని తెలిపారు. జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారులు (డీఐఈవో) జీతాలను డ్రా చేసుకుని కాంట్రాక్టు అధ్యాపకులకు చెల్లించాలని ఆదేశించారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలోని జూన్, జులై వేతనాలను ఇప్పటికే విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 405 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 3,600 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు. అయితే ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తారనే పేరుతో వారికి ఇప్పటి వరకు జీతాలు చెల్లించకపోవడం గమనార్హం.
జీసీసీఎల్‌ఏ హర్షం
మూడు నెలల జీతాలను విడుదల చేయడం పట్ల ప్రభుత్వ కాలేజీల కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం (జీసీసీఎల్‌ఏ-475) అధ్యక్షులు జి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్, అధికార ప్రతినిధి సయ్యద్ జబీ హర్షం ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు టి హరీశ్‌రావు, పి సబితా ఇంద్రారెడ్డి, ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ జలీల్‌కు గురువారం ఒక ప్రకటనలో వారు ధన్యవాదాలు తెలిపారు. కాంట్రాక్టు అధ్యాపకులకు ప్రతినెలా జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. టీడీఎస్ పది శాతం కోతలేకుండా వెంటనే జీతాలు వచ్చేలా చూడాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. దసరా పండుగకు ముందే జీతాలు విడుదల చేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రులకు, విద్యాశాఖ అధికారులకు ఆర్జేడీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం అధ్యక్షులు గాదె వెంకన్న, ప్రధాన కార్యదర్శి కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.