Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్కో దానిలో 58 బాక్స్ వ్యాగన్లు గల మూడు గూడ్స్ రైళ్ల జత
- 176 వ్యాగన్లతో పొడవాటి గూడ్స్ రైలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
దక్షిణ మధ్య రైల్వే మొదటిసారిగా 'త్రిశూల్' రైళ్లను ప్రారంభించింది. 58 బాక్స్ వ్యాగన్లు ఉన్న మూడు రైళ్లను కలిసి 176 వ్యాగన్లతో ఒకే రైలుగా నడిపిస్తున్నందుకు దీనికి 'త్రిశూల్' అని పేరు పెట్టారు. విజయవాడ నుంచి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో చివరి స్టేషన్ అయిన దువ్వాడ వరకు నడిపించారు. గూడ్స్ రైళ్ల నిర్వహణలో వేగం పెరగడంతో ఖాళీ వ్యాగన్లు లోడిరగ్ పాయింట్‌కు తక్కువ సమయంలో చేరుతాయి. వ్యాగన్ ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. మూడు రైళ్లను జతచేసి ఒక రైలుగా చేయడంతో సిబ్బంది సంఖ్య కూడా తగ్గుతుంది, దీంతో వారిని రైళ్ల రద్దీ మార్గాల్లో, ఇతర రైళ్ల నిర్వహణలో వినియోగించుకొనే వెసులుబాటు కలుగుతుంది. మూడు రైళ్లు ఒకే రైలుగా నడపడంతో సెక్షన్లో ఇతర రైళ్ల నిర్వహణకు మార్గం సులభమవుతుంది. నిరంతరం గూడ్స్ విజయవాడ-విశాఖపట్నం వంటి కీలక సెక్షన్లలో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. రైల్వే అధికారులను, సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య ప్రత్యేకంగా అభినందించారు. భారీ పొడువాటి రైళ్లు సరుకు రవాణాలో అత్యుత్తమంగా తోడ్పడుతాయని, అంతేకాకుండా తక్కువ సమయంలో పెద్దఎత్తున సరుకులను రవాణా చేయడంలో అవి ప్రయోజనకరంగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.