Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
- ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
రాష్ట్రంలో చిన్నారులు, వృద్ధులు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు ప్రభుత్వాలే కారణమని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. పట్టపగలే రాష్ట్రాల్లో మహిళల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని ఆందోళన వెలిబుచ్చారు ఐద్వా రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె హాజరై మాట్లాడుతూ.. మద్యాన్ని నియంత్రించి, బెల్టు షాపులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దిశ, ఆరేండ్ల చిన్నారి, మొదలుకుని 58 ఏండ్ల మహిళపై లైంగికదాడులు చేసి అత్యంత కిరాతకంగా హత్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో హత్యలు, లైంగిక వేధింపులు, కేసుల నిష్పత్తి పరిశీలిస్తే ఆందోళనకర పరిస్థితులు కనిపిస్తున్నాయని వాపోయారు. ఇంకా అనేక ఘటనలు పోలీస్స్టేషన్ మెట్ల వరకు కూడా రావడం లేదని ఆందోళన వెలిబుచ్చారు. నిపుణుల నివేదిక ప్రకారం.. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు కారణం మద్యమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా మాత్రమే చూస్తూ.. మద్యం, బెల్టు షాపులు విచ్చలవిడిగా పెంచుతుందని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్ షాపులు బార్లను తలపిస్తున్నాయన్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు అరికట్టేందుకు పటిష్ట నిఘా వ్యవస్థలు ఏర్పాటు చేయాలని కోరారు. స్త్రీలపైన జరిగిన నేరాలపై తక్షణమే శిక్షించుటకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలపై లైంగికదాడులు జరిగిన ఘటనలపై బాధితులకు రూ. 20 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేలా చట్టం చేసి అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జయమ్మ, సుమలత, జిల్లా ఉపాధ్యక్షురాలు మస్కు అరుణ, నాయకులు స్వప్న, బాలమణి, తదితరులు పాల్గొన్నారు.