Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ వెబినార్లో వక్తలు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ప్రజారవాణాను ప్రయివేటీకరించడం తగదని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ అఖిల భారత అధ్యక్షులు బికాస్ రంజన్ భట్టాచార్య అన్నారు. ఈ రంగాన్ని ప్రయివేటీకరిస్తే సామాజిక, ఆర్థిక సమన్యాయం దెబ్బతింటుందని చెప్పారు. ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్) ఆధ్వర్యంలో గురవారం వెబినార్ జరిగింది. ఫెడరేషన్ ఉప ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మయ్య స్వాగతోపన్యాసం చేయగా, విశ్లేషకులు కొండూరి వీరయ్య సమన్వయకర్తగా వ్యవహరించారు. ప్రజారవాణాను లాభాల దృష్టితో చూడరాదన్నారు. భారతీయ రైల్వే జాతీయీకరణ జరిగాక చౌకైన ప్రజారవాణా అందుబాటులోకి వచ్చిందని వివరించారు. ప్రయివేటు సంస్థలు లాభాలను చూస్తాయే తప్ప, ప్రజావసరాలను పరిగణనలోకి తీసుకోవని తెలిపారు. ప్రస్తుతం రాజ్యాంగ, రాజకీయ విధాన నిర్ణయాలు ప్రమాదంలో ఉన్నాయనీ, వాటిని పరిరక్షించుకునే బృహత్తర బాధ్యత కార్మికవర్గంపై ఉన్నదని చెప్పారు. ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్ గీతం తివారి మాట్లాడుతూ ప్రజారవాణా అత్యంత ప్రధానమైందనీ, దాన్ని ఆర్థికకోణంలో కాకుండా, ప్రజాసంక్షేమం దృష్టితో చూడాలని చెప్పారు. ప్రజారవాణాపై ఐఐటీ బెంగలూరు నిపుణుల కమిటీ అనేక అంశాలపై స్పష్టత ఇచ్చిందనీ, ప్రజారవాణా అవసరాలను ప్రభుత్వాలు బాధ్యతగా స్వీకరించాలని ప్రతిపాదించిందని వివరించారు. 2018-19లో టీఎస్ఆర్టీసీపై నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులను ఆమె పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఇంధన ఖర్చు పెరిగిందనీ, అదే సందర్భంలో సంస్థపై పన్నుల భారం కూడా పెరిగిందన్నారు. ప్రజారవాణా అనేది అతిపెద్ద ఉద్యోగ, ఉపాధి కల్పనా సంస్థ అనీ దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ మాట్లాడుతూ విలాసవంతమైన వాహనాలపై పన్నులు విధించి, దానిని ఆర్టీసీకి ఇవ్వాలని శాసనమండలిలో ప్రతిపాదిస్తే, అధికార, ప్రతిపక్షాలు అంగీకరించలేదని గుర్తుచేశారు. సంపన్నులు కార్లు కొంటున్నారే తప్ప రోడ్లను కొనట్లేదనీ, ప్రజారవాణాపై ప్రభుత్వానికి సరైన దృక్పధం లేదని విమర్శించారు. ప్రయివేటురంగంలోని ఎల్ అండ్ టీ మెట్రోరైల్కు నష్టాలు వస్తే, ఆదుకొనేందుకు ముందుకు వచ్చిన ప్రభుత్వం, ఆర్టీసీ విషయంలో ఎందుకు రాదని ప్రశ్నించారు. టిక్కెట్ చార్జీలు పెంచినప్పుడల్లా ఆక్యుపెన్సీ రేషియో తగ్గుతున్న విషయాన్ని గమనించాలని చెప్పారు. కార్యక్రమంలో ఐఐఎమ్ బెంగుళూరు మాజీ ప్రొఫెసర్ టీవీ రమణయ్య, టీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఈడీ పీ కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.