Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రైసు మిల్లుల్లో ఉన్న ధాన్యం నాణ్యత దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల సంస్థ చైర్మెన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి రైసు మిల్లర్లను, జిల్లా అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని పౌరసరఫరాల భవన్లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత ఆహార సంస్థ (ఎఫ్ సీఐ) నుంచి ఎదురవుతున్న ప్రతిబంధకాల వల్ల బియ్యాన్ని అప్పగించడంలో జాప్యం జరుగుతుందని తెలిపారు. దీంతో మిల్లుల్లోనే 70 శాతం ధాన్యం నిల్వలు ఉండిపోయాయని చెప్పారు. డిమాండ్ మేరకు ఎఫ్సీఐ గిడ్డంగుల్లో చోటును కల్పించడం లేదని 32 జిల్లాల నుంచి సమావేశంలో పాల్గొన్న రైసు మిల్లర్లు ఈ సందర్భంగా ఫిర్యాదు చేశారు. గోదాములను లీజుకు తీసుకునే విషయంలో కూడా ఈ ఏడాది కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలతో సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. మారెడ్డి సమాధానమిస్తూ, యాసంగికి సంబంధించి అదనంగా 20 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైసును తీసుకోవడానికి ఎఫ్ సీఐ అంగీకరించిందని చెప్పారు. సమస్యలను అధిగమించే ప్రయత్నం చేస్తున్నామనీ, ఈ నేపథ్యంలో మిల్లర్లు కూడా ప్రభుత్వానికి సహకరించాలని మిల్లర్లుకు విజ్ఞప్తి చేశారు.
సీఎంకు కృతజ్ఞతలు : మిలర్లు
సీఎం కేసీఆర్ కృషి వల్లే అదనంగా 20లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తీసుకోవడానికి ఎఫ్సిఐ అంగీకరించిందని, సీఎం కేసీఆర్ చొరవ వల్లే ఇది సాధ్యమైందని, ఈ సందర్భంగా సీఎం కేసీర్ గారికి రైసు మిల్లర్లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, డిప్యూటీ కమిషనర్ రుక్మిణి, జనరల్ మేనేజర్ రాజిరెడ్డి, కన్సల్టెంట్ ఆశోక్ కుమార్ తో పాటు రైసు మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.