Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయంలో సేంద్రీయసాగును ప్రోత్సహిస్తున్నాం మండలిలో మంత్రి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలోని రైతాంగం శ్రేయస్సు కోసం కేంద్ర ప్రభుత్వ ఆలోచనా ధోరణి మారాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెప్పారు. పంటలను సమతుల్యం చేసే బాధ్యతను కేంద్రం తీసుకోవాలని సూచించారు. గురువారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో సేంద్రీయ సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహానికి సంబంధించిన పలు అంశాలను ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, గంగాధర్‌గౌడ్, అలుగుబెల్లి నర్సిరెడ్డి లేవనెత్తారు. వారి ప్రశ్నలకు మంత్రి నిరంజన్‌రెడ్డి సమాధానమిస్తూ పప్పుగింజలు, నూనె గింజలు వంటి పంటలను సమతుల్యం చేయాలని చెప్పారు. వ్యవసాయంలో సేంద్రీయ సాగును ప్రోత్సహిస్తున్నామని వివరించారు. దీని కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. సేంద్రీయ సాగులో ప్రపంచంలో క్యూబా, దేశంలో సిక్కిం అదర్శంగా నిలిచాయని వివరించారు. 1967లో సస్యవిప్లవం తర్వాత దేశంలో పంటసాగులో ఎరువులు, రసాయనాల వాడకం మొదలైందని అన్నారు. గ్లైఫోసెట్ అనే గడ్డి మందును రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిందని చెప్పారు. ప్రజలే సొంతంగా మిద్దె తోటల సాగుకు మొగ్గు చూపుతున్నారని అన్నారు. ప్రజా ప్రతినిధులు ఈ దిశగా దష్టి సారించాలనీ, ఉద్యానశాఖ మిద్దె తోటలకు ప్రోత్సాహం ఇస్తుందని వివరించారు. రాష్ట్రంలో ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేశామనీ, తద్వారా రైతువేదిక నిర్మాణాలను చేపట్టామని చెప్పారు. అయితే నల్లగొండ జిల్లాలో ఐదు వేల ఎకరాలకు మించి ఎనిమిది వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఉందన్నారు. త్వరలోనే రైతువేదికల హేతుబద్ధీకరణను చేపడతామని అన్నారు. వ్యవసాయ సంబంధిత అంశాలను సాధారణ రైతులకు అర్థమయ్యేలా వివరించిన మంత్రి నిరంజన్‌రెడ్డిని శాసనమండలి ప్రొటెం చైర్మెన్ భూపాల్‌రెడ్డి అభినందించారు.
అద్దె భవనాల్లో న్యాయస్థానాలు : జీవన్‌రెడ్డి
అద్దె భవనాల్లో న్యాయస్థానాలు ఉండడం వల్ల జడ్జీలు, న్యాయవాదులు, కక్షిదారులు, అధికారులు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి జీవన్‌రెడ్డి చెప్పారు. శాశ్వత ప్రాతిపదికన వాటికి భవనాలు నిర్మించాలని కోరారు. గోదావరిఖనిలో న్యాయస్థానాల నిర్మాణాలకు నిధులు మంజూరైనా పనులు ప్రారంభం కాలేదన్నారు. రాష్ట్రంలో 72 కోర్టులు అద్దెభవనాల్లో ఉన్న మాట వాస్తవమేనని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. గోదావరిఖనిలో పనులు ప్రారంభమయ్యాయని వివరించారు. మిగతా కోర్టు భవనాల నిర్మాణాన్ని త్వరలోనే చేపడతామనీ, భూసేకరణ చేపట్టి, నిధులను మంజూరు చేస్తామని అన్నారు.
రూ.1.90 కోట్లలో రామగిరి ఆలయం అభివృద్ధి : ఇంద్రకరణ్‌రెడ్డి
నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని రామగిరి దేవాలయాన్ని రూ.1.90 కోట్లతో అభివృద్ధి చేస్తామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. ఇంజినీర్లు పరిశీలించి వచ్చాక ప్రణాళిక రూపొందించి పనులు ప్రారంభిస్తామన్నారు. ట్రస్టు బోర్డు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. రామగిరి దేవాలయానికి ఎంతో చరిత్ర, ప్రాముఖ్యత ఉందనే విషయాన్ని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న ప్రస్తావించారు. ఆ తర్వాత మండలిని శుక్రవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్టు ప్రొటెం చైర్మెన్ భూపాల్‌రెడ్డి ప్రకటించారు.