Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేబర్ కోర్టుకు ఎస్పీఎం పర్మినెంట్ కార్మికుల సమస్య
- జేసీఎల్ సమక్షంలో జరిగిన చర్చలు విఫలం
నవతెలంగాణ - కాగజ్‌నగర్
కొమురంభీం-ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని సిర్పూరు పేపర్ మిల్లు కార్మికుల సమస్య లేబర్ కోర్టుకు చేరనుంది. మిల్లు పున:ప్రారంభమై మూడేండ్లు పూర్తయినా ఇప్పటి వరకు విధుల్లోకి తీసుకోకపోవటంతో పర్మినెంట్ కార్మికులు కొన్ని నెలలుగా పోరాడుతున్న విషయం తెలిసిందే. వరంగల్ జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ సునీత గురువారం యాజమాన్య ప్రతినిధులు, ఎస్పీఎం ఎంప్లాయీస్ వెల్ఫేర్ నెగోషియేషన్ కమిటీ సభ్యులతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేశారు. స్థానిక ప్రయివేట్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన ఈ చర్చలకు యాజమాన్యం నుంచి రమేష్‌రావు, రాజన్, రాజకీయ పార్టీల నుంచి డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబు, డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, జి.ఆనంద్ హాజరు కాగా, ఎస్పీఎం నెగోషియేషన్ కమిటీ సభ్యులు సూర్యప్రకాష్, అంబాల ఓదేలు, షబ్బీర్‌హుస్సేన్, ఎకె సింగ్, జాన్‌ప్రకాష్, వొల్లాల వెంకటేశ్వర్లు తదితరులతో పాటు 30 మంది కార్మికులు హాజరయ్యారు. సుమారు రెండు గంటలపాటు జరిగిన చర్చలు కొలిక్కి రాలేదు. తమను విధుల్లోకి తీసుకునేది లేదని యాజమాన్యం ఇప్పటికే స్పష్టం చేసినందున.. 2014లో మిల్లు మూతపడిన కాలం నాటి నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో వేతనాలు చెల్లించాలని, మిగిలి ఉన్న సర్వీసుకు కూడా వేతనం లెక్కించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాంతోపాటు తమను విధుల్లోకి తీసుకోకపోవడానికి ప్రభుత్వ అనుమతి లేనందున అదనంగా లాభాలు ఇవ్వాలని కమిటీ సభ్యులు ఈ చర్చల్లో డిమాండ్ చేశారు. దీనికి యాజమాన్య ప్రతినిధులు అంగీకరించలేదు. గత నెల 28న జేసీఎల్ సునీత అందించిన షీల్డ్ కవర్లో పొందుపర్చిన విధంగానే తాము లాభాలు లెక్కగట్టి ఇస్తామని, అంతకు మించి ఇచ్చేది లేదని యాజమాన్య ప్రతినిధులు స్పష్టం చేశారు. జేసీఎల్ సమన్వయం చేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో ఈ సమస్యను లేబర్ కోర్టుకు రెఫర్ చేయనున్నట్టు ప్రకటించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఆమె జారీ చేసి.. నెగోషియేషన్ కమిటీ సభ్యులు సూర్యప్రకాష్, అంబాల ఓదేలుచే సంతకాలు తీసుకున్నారు. గతంలో జరిగిన చర్చల నివేదికలతో తాను లేబర్ కోర్టుకు ఈ సమస్యను రెఫర్ చేస్తానని, కోర్టు నుంచి సమన్లు అందిన తర్వాత కార్మికులు, యాజమాన్య ప్రతినిధులు కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని జేసీఎల్ ప్రకటించడంతో చర్చలు ముగిశాయి.
యాజమాన్య మొండి వైఖరే కారణం..
చర్చలు విఫలమైన అనంతరం నెగొషియేషన్ కమిటీ సభ్యులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నెగోషియేషన్ కమిటీ సభ్యులు సూర్యప్రకాష్, ఓదేలు మాట్లాడుతూ.. ఐక్యంగా ఉన్న కార్మికులను విడగొట్టేందుకు యాజమాన్యం కుట్రలు పన్నే అవకాశముందని, ఈ కుట్రలకు కార్మికులు బలి కావద్దని సూచించారు. బీజేపీ నాయకులు హరీష్‌బాబు, టీడీపీ నాయకులు ఆనంద్ మాట్లాడుతూ.. యాజమాన్యం మొండి వైఖరి కారణంగానే నేడు ఈ పరిస్థితి తలెత్తిందని అన్నారు. కార్మికుల న్యాయ పోరాటానికి తమ పూర్తి సహకారం ఉంటుందన్నారు.