Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక చోదక కేంద్రాలుగా పట్టణాలు
- శాసనసభలో మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అటు గ్రామీణాభివృద్ధి..ఇటు పట్టణాభివృద్ధి, ఓ పక్క వ్యవసాయం..మరోపక్క పరిశ్రమలు, గ్రామీణ కుటీర పరిశ్రమలు..ఐటీ..ఇలా అన్ని అంశాలకు సీఎం కేసీఆర్ ఏకకాలంలో ప్రాధాన్యతనివ్వటం వల్ల సమతుల్య అభివృద్ధి దిశగా రాష్ట్రం పరుగులు పెడుతున్నదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. గురువారం శాసనసభలో పల్లెప్రగతి, పట్టణప్రగతిపై జరిగిన చర్చ సందర్భంగా పలువురు సభ్యులు లేవనెత్తిన సందేహాలకు మంత్రి కేటీఆర్ సమాధానాలిచ్చారు. రాష్ట్ర విస్తీర్ణం 1,14,000 పైచిలుకు చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉండగా..అందులో కేవలం 2700 చదరపు కిలోమీటర్లలోనే పట్టణాలు విస్తరించాయన్నారు. రాష్ట్ర భూభాగంలో కేవలం 3 శాతాన్నే పట్టణాలు ఆక్రమించాయని చెప్పారు. అయితే, రాష్ట్ర జీఎస్డీపీ 65 శాతం పట్టాల్లోనే ఉందనీ, అవి ఆర్థిక చోదక కేంద్రాలుగా మారాయని వివరించారు. రాష్ట్రంలో మున్సిపాలిటీల సంఖ్య 142కు చేరిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రతి మున్సిపాలిటీలో వార్డు కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. పట్టణాల్లో పచ్చదనం పెరగాలనే ఉద్దేశంతో దేశంలోనే తొలిసారి 10 శాతం గ్రీన్ బడ్జెట్‌తో హరిత ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు పోతున్నామని చెప్పారు. దేశంలోనే అతిపెద్ద అర్బన్ ఎకో పార్కు మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేయడమనేది తమ ప్రభుత్వం సాధించిన ఘనత అన్నారు. గతంలో మున్సిపల్ కార్మికుల వేతనాలు సరిగా అందలేదనే విషయాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం వారి వేతనాలను రూ.12వేలకు పెంచామనీ, ఈఎస్ఐ, పీఎఫ్, తదితర సౌకర్యాలను వర్తింపజేశామని వివరించారు. పట్టణాభివృద్ధి కోసం టీయూఎఫ్ఐడీసీ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశామన్నారు. 500 కోట్ల రూపాయలతో ప్రతి మున్సిపాలిటీలో రెండెకరాలకు తగ్గకుండా వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు నిర్మిస్తున్నామని చెప్పారు. 141 మున్సిపాలిటీల్లో వైకుంఠధామాలు కడుతున్నామనీ, రూ. 850 కోట్లతో నాలాలు అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. యువకుల కోసం హైదరాబాద్‌లో 74, మున్సిపాలిటీల్లో 369 ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. పేదవారికి రూపాయికే నల్లా కనెక్షన్లు ఇస్తున్నామనీ, 10 వేలకు పైగా టాయిలెట్లు కట్టామని వివరించారు. గతంలో 68 మున్సిపాలిటీల్లో కేవలం 21 నర్సరీలు మాత్రమే ఉండేవనీ, ఈ మూడేండ్లలో 141 పట్టణాల్లో 1602 నర్సరీలు ఏర్పాటు చేశామని చెప్పారు. చిరు వ్యాపారుల కోసం స్ట్రీట్ వెండింగ్ జోన్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం 67,500 కోట్ల రూపాయలను ఖర్చుపెట్టామనీ, ఎస్ఆర్డీపీ కింద రూ.6 వేల కోట్లతో, సీఆర్ఎమ్పీ కింద రూ.1829 కోట్లతో 724 కిలోమీటర్ల రోడ్లు వేయిస్తున్నామని వివరించారు. ప్రస్తుతమున్న డ్రెయినేజీ వ్యవస్థతో రెండు సెంటీమీటర్ల వాన పడితేనే రోడ్లపైకి నీళ్లు వచ్చేస్తున్నాయనీ, ఈ సమస్య పరిష్కారంపై దృష్టిపెట్టామని చెప్పారు. నాలాల అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. కోకాపేటలో కొత్తనగరం సృష్టించబోతున్నామన్నారు. హెచ్ఎండీఏ పరిధిలో రెండు లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేశామనీ, మరో 10, 12 లాజిస్టిక్ పార్కులకు కూడా అనుమతులిస్తామని ప్రకటించారు. గండిపేట చెరువు అభివృద్ధి కోసం రూ.36.5 కోట్లు కేటాయించామన్నారు. మెట్రో నష్టాలపై అధ్యయనం చేసేందుకు కమిటీ వేశామని తెలిపారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల దృష్ట్యా కేశంపేట వద్ద రిజర్వాయర్ నిర్మిస్తున్నామని వివరించారు. సుంకిశాల నుంచి హైదరాబాద్‌కు మరోపైప్లైన్ కోసం రూ.1400 కోట్లు కేటాయించామన్నారు. రాష్ట్రంలోని కొన్ని మున్సిపాల్టీలు ఓడీఎఫ్ ప్లస్, మరికొన్ని ఓడీఎఫ్ ప్లస్‌ప్లస్ అర్హత సాధించాయని తెలిపారు. నిర్మాణ రంగం నుంచి వచ్చే వ్యర్థాలను శుద్ధి చేసి తిరిగి వాటినే వాడుకునే టెక్నాలజీతో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్‌లోని తడి చెత్తతో ఎరువులు, పొడిచెత్తతో విద్యుత్‌ను తయారు చేస్తున్నామని వివరించారు.