Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేదంటే విశ్వవిద్యాలయాల ద్వారానే నియామకం
- త్వరలోనే విధాన నిర్ణయం
- టీడీఎస్ లేకుండానే కాంట్రాక్టు లెక్చరర్లకు జీతాలివ్వడాన్ని పరిశీలిస్తాం : మంత్రి సబిత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టులను భర్తీ చేసేందుకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలా? లేక ఏ వర్సిటీకి ఆ వర్సిటీయే నియామక ప్రక్రియను చేపట్టాలా?అనే అంశంపై త్వరలోనే విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. గురువారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో విశ్రాంత ఆచార్యులకు సవరించిన యూజీసీ వేతన స్కేళ్లు అమలు చేసిన విషయం వాస్తవమేనా?అనే అంశాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణీదేవి లేవనెత్తారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమాధానమిస్తూ 2016, జనవరి 1 నుంచి రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లోని బోధనా సిబ్బందికి సవరించిన యూజీసీ వేతన స్కేళ్లను అమలు చేయడం కోసం ప్రభుత్వం 2019, జూన్ 29న జీవో నెంబర్ 15ను విడుదల చేశామని చెప్పారు. 2016, జనవరి ఒకటికి ముందు రిటైరైన, మరణించిన వారిలో యూజీసీ వేతన స్కేళ్లను డ్రా చేస్తున్న వారికి ఏకీకృత పింఛన్‌ను మంజూరు చేయడం కోసం 2020, జనవరి 2న జీవో నెంబర్ 1 జారీ చేశామన్నారు. గతేడాది జూన్ నుంచి నాలుగు వాయిదాల్లో చెల్లించాలని నిర్ణయించామన్నారు.
కాంట్రాక్టు అధ్యాపకులను వదలని ఐటీ శాఖ : జీవన్‌రెడ్డి
ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ కాంట్రాక్టు అధ్యాపకులనూ వదలడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి జీవన్‌రెడ్డి చెప్పారు. వారికి ఉద్యోగ భద్రత లేదనీ, అయినా వారి జీతాల నుంచి 10 శాతం టీడీఎస్ కట్ చేయాలని నిర్ణయించిందన్నారు. వారు 192 పరిధిలోకి వస్తారనీ, కానీ 194(జే) ప్రకారం పరిగణనలోకి తీసుకుని 10 శాతం వేతనాలు మినహాయించి చెల్లించాలని నిర్ణయించడం సరైంది కాదన్నారు. 192 పరిధిలోకి తెచ్చి జీతాల్లో కోతలేకుండా చూడాలని కోరారు. రాష్ట్రంలో 11 విశ్వవిద్యాలయాల పరిధిలో 2 వేల ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. 2017లో జీవోనెంబర్ 34 ప్రకారం 1,061 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. నాలుగేండ్లయినా భర్తీ చేయలేదన్నారు. నిర్దిష్ట కాలపరిమితిలోగా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు అధ్యాపకుల బదిలీల కోసం సీఎం అనుమతి ఇచ్చారనీ, దాన్ని అమలు చేయాలని కోరారు.
వర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకులకు వేతన సవరణ చేయాలి : నర్సిరెడ్డి
విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు యూజీసీ ఏడో వేతన సవరణ చేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. వర్సిటీల్లోని అధ్యాపక ఖాళీల్లో కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారని వివరించారు. అయితే ఖాళీల భర్తీ సమయంలో కాంట్రాక్టు అధ్యాపకుల పోస్టులను మినహాయిస్తారా? లేక మొత్తం భర్తీ చేస్తారా?అని ప్రశ్నించారు. ప్రయివేటు విశ్వవిద్యాలయాల తరహాలో ప్రభుత్వ వర్సిటీలూ ప్రచారం చేయాలని సూచించారు.
దీనికి మంత్రి సబిత సమాధానమిస్తూ కోర్టు కేసుల వల్ల వర్సిటీల్లో అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియ ఆలస్యమైందని చెప్పారు. కొత్త వీసీలొచ్చారనీ, త్వరలోనే విధాన నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అయితే విద్యార్థులకు నష్టం కలగకుండా కాంట్రాక్టు అధ్యాపకులను నియమించామన్నారు. ఖాళీలన్నిం టినీ భర్తీ చేయాలా?, కాంట్రాక్టు అధ్యాపకుల పోస్టులను వదిలేయాలా?అనే అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకులకు యూజీసీ ఏడో వేతన సవరణ ప్రకారం జీతాలిచ్చే అంశం పరిశీలనలో ఉందన్నారు. జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు ఆదాయపు పన్ను లేకుండానే జీతాలిచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు.