Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో మంత్రి పువ్వాడ అజరు విమర్శ
- కార్గో పార్శిల్ సేవల ద్వారా రూ. 62.02 కోట్ల ఆదాయం
- రేషన్‌కార్డుల జారీకి కేంద్రం పరిమితులు: మంత్రి గంగుల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
''రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతో ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తాం.. ఆమేరకే టీఎస్ ఆర్టీసీలో కార్గో పార్శిల్ సేవలు ప్రవేశపెట్టాం. తద్వారా ఇప్పటి వరకు రూ. 62.02 కోట్లు ఆదాయం సాధించామని'' అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆర్టీసీ కార్గో పార్శిల్ సేవలపై సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్‌రావు 'మాట్లాడుతూ దుబ్బాకలో బస్టాండ్ ఎత్తేసారనే ప్రచారం జరుగుతున్నదనీ, దీనిమూలంగా స్థానిక ప్రజలు ఇబ్బంది పడతారనీ, అలాంటి ప్రయత్నాలను విరమించాలని' కోరారు. దీనికి స్పందించిన మంత్రి పువ్వాడ మాట్లాడుతూ మేము రాష్ట్రంలో ఏ బస్టాండ్‌ను ఎత్తేయాలనీ అనుకోవడం లేదు, దుబ్బాకలోనూ ఎత్తేయం.. కేంద్రం ఏమీ చేయడం లేదు..మేము రాష్ట్రంలో స్టార్టప్‌లు, రన్నప్లు చేస్తుంటే, కేంద్రం మాత్రం ప్రభుత్వ రంగ సంస్థలకు అమ్మేస్తూ ప్యాకప్ చేస్తున్నదని విమర్శించారు. మేము ఆర్టీసీని కాపాడుకునేందుకే ప్రయత్నిస్తున్నామని వివరించారు. కార్గో పార్శిల్ సర్వీసులతో కస్టమర్లు సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలో హౌం పికప్, హౌండెలివరీ పార్శిల్ సర్వీసులను ప్రవేశపెట్టాలని టీఎస్ ఆర్టీసీ యోచిస్తోంది. ప్రస్తుతం 195 కార్గో వాహనాలను ఆర్టీసీ కలిగి ఉంది. సమీప భవిష్యత్‌లో మరో 50 కార్గో వాహనాలను అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నది. ఆర్టీసీకి సంబంధించి అదనపు ఆదాయం పెంచుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆదేశాలతో కార్గో పార్శిల్ సేవలను గత ఏడాది జూన్‌లో ప్రారంభించామన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో బస్ డిపోతోపాటు బస్టాండ్‌ను ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ఆలోచన లేదని మంత్రి పువ్వాడ అజరు పేర్కొన్నారు. కేంద్రం లెక్క నష్టాలు ఉన్నాయన్న సాకుతో ప్రభుత్వ రంగ సంస్థలను మూసేయడం లేదన్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి డీజిల్ ధరలు పెంపు కూడా భారం అయ్యిందన్నారు. ఆదాయ వనరులు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఆర్టీసీని ఆదరించాలన్నారు. సభ్యులంతా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని కోరారు. ప్రగతి రథ చక్రాలను పరుగులు పెట్టిస్తామని పువ్వాడ అజరు పేర్కొన్నారు.
రేషన్ కార్డుల జారీకి కేంద్రం పరిమితులు: మంత్రి గంగుల
రాష్ట్రం ఏర్పడిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందించామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కొత్త ఆహార భద్రతా కార్డుల జారీపై ఎమ్మెల్యేలు కౌసర్ మోహియుద్దీన్, అహ్మద్ పాషా ఖాద్రి, అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అర్హులపై కేంద్రం పరిమితులు విధించినా, సీఎం కేసీఆర్ అన్నార్థులు ఉండకూడదని ప్రతీ అర్హునికి రేషన్ కార్డులు అందజేస్తున్నారని తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక కేంద్రం రూపొందించిన సాఫ్ట్వేర్ ఆధారంగానే జరుగుతున్నదనీ, మేము చేసేది ఏమీ లేదన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకూ రేషన్ కార్డుల కోసం 9,53,394 దరఖాస్తులు వచ్చాయనీ, ఇందులో 6,70,999 నూతన రేషన్ కార్డులు ఇచ్చేశాం. వీటి ద్వారా 21,30,194 మంది లబ్ది పొందుతున్నారని మంత్రి పేర్కొన్నారు.
తాగునీటి సమస్యను 95 శాతం పరిష్కరించాం : మంత్రి కేటీఆర్
ప్రశ్నోత్తరాల సందర్భంగా అర్బన్ మిషన్ భగీరథపై ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు సమాధానం ఇచ్చారు. అర్బన్ మిషన్ భగీరథ పథకం కింద ఎల్బీనగర్ నియోజకవర్గంలోని అన్ని కాలనీలకు తాగునీరు అందిస్తున్నాము. రూ. 313.26 కోట్ల వ్యయంతో 47 ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన 12 రిజర్వాయర్లను నిర్మించి, 384 కిలోమీటర్ల మేర పైపులైన్ వేయడం ద్వారా తాగునీటి సరఫరాను మెరుగుపరిచామన్నారు. 13.11 కి.మీ. నీటి సరఫరా గల పైపులైన్ నెట్‌వర్క్‌ను రూ. 5.25 కోట్లతో వ్యయంతో తాగునీరు అందని కాలనీలకు సమకూర్చాలని ప్రతిపాదన చేపట్టి, పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో తాగునీటికి సమస్య ఉండకూడదనే ఉద్దేశంతో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. 90 నుంచి 95 శాతం వరకు తాగునీటి సమస్య పూర్తయిందన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని రైతుబజార్, వైదేహీనగర్, సచివాలయనగర్, ఆటోనగర్, ప్రశాంతి నగర్, సాహెబ్ నగర్, వాసవీ నగర్‌కు సంబంధించి.. 47 ఎంఎల్డీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు నిర్మించి నీటి సమస్యను తీర్చామన్నారు.
రాష్ట్రంలో భారీ ఎత్తున చేపల పెంపకం : మంత్రి తలసాని
చేపల పెంపకానికి ప్రోత్సాహంపై ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, రేగ కాంతారావు, రవిశంకర్ అడిగిన ప్రశ్నలకు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో భారీ ఎత్తున చేపల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. చేపల ఉత్పత్తిని పెంచడానికి, మత్స్యకారుల జీవనోపాధిని పెంచడానికి 100 శాతం గ్రాంట్‌తో చేప, రొయ్య పిల్లలను పంపిణీ చేస్తున్నాము. 2021-22 ఏడాదికి 28,704 నీటి వనరులలో 93 కోట్ల చేప పిల్లలను, ఎంపిక చేసిన 200 నీటి వనరుల్లో 10 కోట్ల రొయ్య పిల్లలను నిల్వ చేయాలని ప్రతిపాదించాం. 81 రిజర్వాయర్లు, 1348 శాశ్వత చెరువులు, 27,275 వానాకాలం చెరువుల్లో చేపలను వదులుతున్నామని తెలిపారు.
మత్స్యకారులకు బీమా సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో మత్స్యకారులు నిర్లక్ష్యానికి గురయ్యారు. బడ్జెట్లో కూడా మత్స్యకారులకు నిధులు కేటాయించలేదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో వివిధ వర్గాలను ఆదుకునేందుకు ఉపాధి కల్పించడం జరిగిందన్నారు. అందులో భాగంగా మత్స్యకారులకు చేప పిల్లలను పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌కు రూ. 7,720 కోట్లు ఖర్చు : మంత్రి గంగుల కమలాకర్
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం అమలుపై ఎమ్మెల్యేలు నోముల భగత్, అమీర్ మొహమ్మద్ అడిగిన ప్రశ్నలకు మంత్రి గంగుల కమలాకర్ సమాధానం ఇచ్చారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద ఇప్పటి వరకు 9,31,316 మంది లబ్ది పొందారు. బీసీ సంక్షేమం ద్వారా 4,35,365 మంది, గిరిజన సంక్షేమం ద్వారా 1,11,876 మంది, మైనార్టీ సంక్షేమం ద్వారా 1,95,960 మంది, ఎస్సీ సంక్షేమం ద్వారా 1, 88,212 మందికి ప్రయోజనం కలిగిందన్నారు. ఈ పథకాల కోసం ఇప్పటి వరకు రూ. 7,720.8 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. మనసున్న మారాజు సీఎం కేసీఆర్.. పేదింటి ఆడబిడ్డలను దష్టిలో ఉంచుకుని ఈ పథకానికి రూపకల్పన చేశారు. బిడ్డ పెళ్లి కోసం తల్లిదండ్రులు అప్పులు చేసేవారు. ఆ బాధలు తల్లులు పడొద్దనే ఉద్దేశంతో ప్రస్తుతం రూ. లక్షా నూట పదహారు ఇస్తున్నారు. ఇంకా పెంచమని అడుగుతున్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. కరోనా కాలంలోనూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు కేసీఆర్ నిధులు మంజూరు చేశారు. ఈ పథకాల పేరిట మోసాలకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేశామని మంత్రి తెలిపారు. ప్రశ్నోత్తరాల్లో మొత్తం ఆరు ప్రశ్నలకుగాను ఇండ్లస్థలాల క్రమబద్దీకరణకు సంబంధించిన ప్రశ్నను సభ్యుల కోరిక మేరకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వాయిదా వేశారు. ఎంఐఎం, కాంగ్రెస్, ఇతర పార్టీలు ప్రతిపాదించిన మూడు వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు.