Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధ్యాయుల కొరతతో అవస్థలు
- దుర్వాసనతో మరుగుదొడ్లు, టాయిలెట్లు
- స్వచ్ఛ కార్మికులను నియమించాలి
- ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులే తాళాలు తీస్తున్న వైనం
- గూగుల్ షీట్ సర్వేలో పలు అంశాలు వెల్లడి : అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో 64 శాతం పాఠశాలల్లో పారిశుధ్య సమస్య తీవ్రంగా ఉందనీ, మరో పక్క పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల ఏర్పాటు జరగలేదని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి చెప్పారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ గ్రామ, మున్సిపల్, కార్పొరేషన్ పారిశుధ్య కార్మికులు, పాఠశాలలనూ కూడా శుభ్రం చేస్తారని ప్రభుత్వం చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.కానీ..ఈ సమస్య ఆయా పాఠశాలల్లో తీవ్రంగా ఉందనీ గూగుల్ షీట్ సర్వే చేయించటం ద్వారా వెల్లడైందని చెప్పారు. మొత్తం 1896 పాఠశాలలను సర్వే చేస్తే..49 శాతం పాఠశాలల్లో మాత్రమే పారిశుధ్య కార్మికులు వచ్చి పనిచేస్తున్నారని వివరించారు. ఇది కూడా అన్ని పాఠశాలల్లో ఒకే రకంగా లేదన్నారు.ఇందులో 20.5శాతం బడుల్లో మాత్రమే పూర్తి పారిశుధ్యం జరుగుతుందని వివరించారు. 31.9శాతం పాఠశాలల్లో రెండు మూడు రోజులకోసారి శుభ్రం చేస్తున్నారనీ, 47శాతం స్కూళ్లల్లో కార్మికులే రావటంలేదని సర్వే రిపోర్టులో వెల్లడైందన్నారు. ప్రస్తుత కరోనా సమయంలో మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలన్నారు. దుర్వాసనతో మరుగుదొడ్లు ఉన్నాయని తెలిపారు. 64శాతం స్కూళ్లలో శుభ్రం చేయటం లేదని తెలిపారు. 14శాతం పాఠశాలల్లో హెచ్ఎంలు, ఉపాధ్యాయులు సొంత డబ్బులు కూడబెట్టి శుభ్రం చేయిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందని ప్రభుత్వమే చెబుతుందని గుర్తుచేశారు. అయితే..పెరిగిన విధ్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా ఉపాధ్యాయులను నియమించలేదని చెప్పారు. సర్వేచేసిన 1938 పాఠశాలల్లోనే సుమారు 3256 మంది ఉపాధ్యాయులు అవసరముంటుందనీ, ఈ కొరతతో విద్యార్థులకు తగిన విధంగా పాఠాలు ఎలా బోధిస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఈ విషయంపై సంబంధిత మంత్రి, ప్రభుత్వ పెద్దలతో మాట్లాడితే..ఉన్న వాళ్లనే సర్దుబాటు చేసుకోవాలని చెబుతున్నారనీ, ఉపాధ్యాయుల కొరతతో ప్రభుత్వ విద్యను బలోపేతం ఎలా చేస్తామని ప్రశ్నించారు. అవసరమైన మేరకు ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు. గతంలో ఏర్పాటు చేసిన విద్యావాలంటీర్ల మాదిరిగా అక్టోబర్ 17నాటికి ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచించారు.
పాఠశాలలకు తాళాలు వేయటం, తీయటం కూడా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులే చేస్తున్నట్టు సర్వేలో వెల్లడయిందని చెప్పారు. 34శాతం బడుల్లో ప్రధానోపాధ్యాయులు తాళాలు తీయడం, వేయడం చేస్తుంటే, 26శాతం పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఈ పనిచేస్తున్నారని తెలిపారు. మొత్తంమీద 60శాతం పాఠశాలల్లో కనీసం స్వచ్ఛ కార్మికులు లేకపోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు.ప్రతి పాఠశాలకు వారిని నియమిస్తామని గతంలో సీఏం కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు. వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు.
పాఠశాలలకు తాళం వేయటం : తీయటం..
ప్రధానోపాధ్యాయులు 34.3శాతం
ఉపాధ్యాయులు 25.8శాతం
స్వీపర్, వాచ్మెన్ 14.3శాతం
ఆఫీసు సబార్డినేటు 10.9శాతం
ఇతరులు 14.7శాతం
గూగుల్ షీట్ సర్వే చేసిన పాఠశాలల వివరాలు..
మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలు 927
ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలు 48
గిరిజన సంక్షేమ ప్రాధమిక పాఠశాలలు 26
మండల పరిషత్ ప్రాధమికోన్నత పాఠశాలలు 282
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు 526
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 49
ఆదర్శ పాఠశాలలు 38
పారిశుధ్య సమస్యపై...
- పారిశుధ్యంపై స్థానిక సంస్థలు
బాధ్యత తీసుకున్న పాఠశాలలు 49.6శాతం
ప్రతి రోజు శుభ్రం చేస్తున్న పాఠశాలలు 20.5
అప్పుడప్పుడు మాత్రమే
శుభ్రం చేస్తున్న పాఠశాలలు 31.9
శుభ్రం చేయని పాఠశాలలు 47.6
మరుగు దొడ్లు శుభ్రం చేసే పాఠశాలలు 14శాతం
అప్పుడప్పుడు శుభ్రం చేస్తున్న పాఠశాలలు 21.3శాతం
శుభ్రం చేయని పాఠశాలలు 64.7శాతం