Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 15 రోజుల్లో రైతులకు పట్టాలు ఇవ్వకుంటే పెద్దఎత్తున ఉద్యమం
- పోడు రైతులపై కేసులను ఎత్తేయాలి ొ రాస్తారోకోలో పాల్గొన్న రైతులు, ప్రజలకు ధన్యవాదాలు : అఖిలపక్ష నేతలు
నవతెలంగాణ- సిటీబ్యూరో
పోడు భూములపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటన కేవలం కపట నాటకంగానే భావిస్తున్నాం.. సీఎం కేసీఆర్ ఏడేండ్ల పాలనలో ఇచ్చిన హామీలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పరిశీలిస్తే.. పోడు భూముల మీద ఆయన చేసిన ప్రకటన మోసపూరితం, అబద్ధం అనిపిస్తోందని వక్తలు అన్నారు. గురువారం హైదరాబాద్ నాంపల్లిలోని జనసమితి కార్యాలయంలో పోడురైతు పోరాట కమిటీ(అఖిలపక్ష పార్టీలు) ఆధ్వర్యంలో ఆటవీ హక్కుల చట్టం, పీసా చట్టం అమలు, పోడు రైతులకు భూమిపై హక్కులు కల్పించాలనే అంశంపై సమావేశం నిర్వహించారు. సీపీఐ(ఎం), సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్‌రెడ్డి, టీజేఎస్ అధినేత కోదండరామ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్‌గౌడ్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరావు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. పోడు భూముల పట్టాల కోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈనెల 5న 75 చోట్ల, 500 కిలోమీటర్ల సడక్‌బంద్, రహ దారుల దిగ్బంధం విజయవంతంగా జరిగిందన్నారు. లక్ష మంది పాల్గొన్నారని, కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రైతులకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గిరిజనులకు పట్టాలు ఇచ్చే విషయంలో కేసీఆర్ పూటకొక మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. పోడు రైతులు గతంలో పెట్టుకున్న దరఖాస్తులు ఉండగా.. మళ్లీ ఎందుకు దరఖా స్తులు పెట్టుకోవాలని ప్రశ్నించారు. పోడు భూముల హక్కుల పై తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటన మీద నమ్మకం లేదన్నారు. గిరిజనుల మీద అటవీ, పోలీస్ అధికారుల దాడులు రోజురోజుకూ పెరుగుతున్నా యని, వాటిని ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన గిరిజనులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వారిపై పెట్టిన కేసులను ఎత్తేయాలన్నారు. కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా 51 లక్షల మొక్కలు నాటామనడం పచ్చి అబ్ధమని, హరితహారం పేరుతో కోట్ల రూపాయలను దోచుకున్నారని విమర్శించారు.
పోడు భూముల సమస్య బతుకు కోసం పోరాటం అని, కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే గిరిజనుల మీద దాడులు పెరిగాయని అన్నారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న పంటలను కూడా అధికారులు నాశనం చేస్తున్నారన్నారు. గిరిజనులకు అఖిలపక్షం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పలేదని కేసీఆర్ అసెంబ్లీలో చెప్పడం సిగ్గుచేటని, మీ 2014 మ్యానిఫెస్టో చూసుకుంటే గుర్తుకు వస్తుందేమోనని అన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పచ్చి అబద్ధాలు మాట్లాడటం దిగజారడమేనన్నారు. ఇకనైనా మోసపూరిత, ద్వంద్వ వైఖరిని వదిలి నిజాయితీగా పోడు సమస్యలపై పరిష్కారం చూపాలని, ఇందులో ప్రతిపక్షాలను కలుపుకుని పోతే ప్రజలు నమ్ముతారని అన్నారు. సాగులో ఉన్నవాళ్లకు పట్టాలు వచ్చే అవకాశం ఉందని, ఈ ప్రాసెస్ అన్నింటిలో పోడు రైతుల తరపున ప్రతిపక్షాలతో మాట్లాడాలని సూచించారు. గిరిజనులకు పట్టాలు ఇచ్చేందుకు కేసీఆర్‌కు 15 రోజులు సమయం ఇస్తున్నామని, ఆలోపు పోడు భూములకు పట్టాలు ఇవ్వకపోతే పెద్దఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డిజి.నర్సింహారావు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, టీజేఎస్ నాయకులు పీఎల్.విశ్వేశ్వరరావు, బైరీ రమేష్, సీపీఐ నాయకులు బాలమల్లేష్, అఖిలపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు.