Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పల్లె, పట్టణాల్ని మస్తు అభివృద్ధి చేశాం
- అసెంబ్లీలో సీఎం కేసీఆర్
- సర్కారు లెక్కలకూ, క్షేత్రస్థాయికీ పొంతనేది?
- పెరగనున్న ఆర్ధిక భారం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా రాష్ట్రాన్ని మస్తు అభివృద్ధి చేశామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అసెంబ్లీ వేదికగా చెప్పారు. నిధుల కేటాయింపును ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ పాలనతో పోలుస్తూ లెక్కలు చెప్పారు. కేంద్రం నుంచి అదనంగా వచ్చిందేం లేదంటూ, అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే నిధులు ఇచ్చారంటూ నిష్ఠూరాలు ఆడారు. మంచిని తన ఖాతాలో, చెడును కేంద్రం, కాంగ్రెస్ ఖాతాల్లో వేస్తూ ప్రసంగాన్ని కొనసాగించారు. వేల కోట్లు పల్లె, పట్టణ ప్రగతికి ఖర్చు చేశామన్నారు. రోడ్ల లెక్కలు చెప్పారు. నాణ్యతపై మాట్లాడలేదు. చిన్న వర్షాలకే అవి కొట్టుకుపోయిన విషయాల్ని ప్రస్తావించకుండా, ఆ తప్పును ప్రకృతిపైకి నెట్టేశారు. వర్షాలు భారీగా కురిసాయనీ, తప్పు తమ ప్రభుత్వానిది కాదన్నట్టే చెప్పారు. చిన్నపాటి వర్షాలకే హైదరాబాద్ సహా గ్రామాలన్నీ నీట మునగడానికి కూడా ప్రకృతే కారణమని తేల్చారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరిగిందన్నారు. తలపై ఎంత అప్పు ఉందనే విషయాన్ని చెప్పలేదు. రాష్ట్రాల అధికారాల్ని కేంద్రప్రభుత్వం గుంజుకుంటుందంటూనే దానిపై తమ అభ్యంతరాలను మాటమాత్రంగానే చెప్పారు. దీనిపై కేంద్రానికి వ్యతిరేకంగా కొట్లాడతామన్నారే తప్ప...ఏ రూపంలోనో స్పష్టం చేయలేదు. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీలో చేర్చే విషయంలో బీజేపీ పాలిత రాష్ట్రాలే వ్యతిరేకిస్తున్నాయని చెప్పిన ఆయన తెలంగాణ రాష్ట్ర వైఖరిని వెల్లడించలేదు. ఇక కరీంనగర్‌ను తాను డల్లాస్ చేస్తానని చెప్పలేదన్నారు. హైదరాబాద్‌ను ఇస్తాంబుల్‌గా మార్చాలని కోరుకోవడంలో తప్పేముందన్నారు. అభివృద్ధి నిరంతర ప్రక్రియ అంటూ ముక్తాయింపు ఇచ్చారు. పంచాయతీలకు నిధుల కేటాయింపును ప్రస్తావిస్తూ, కేంద్రం ఇవ్వాల్సిన నిధుల్లో 25 శాతం కోత పెట్టిందన్నారు. తాము పూర్తిగా నిధులు ఇవ్వకపోవడానికి కేంద్రమే కారణమనే అర్థంవచ్చేలా చెప్పారు. ఎప్పటిలాగానే 'నాడు-నేడు' అంటూ సమైక్యపాలనను ప్రత్యేక తెలంగాణ పాలనతో పోల్చి చెప్తూ, తామే బెటర్ అన్నారు. కాంగ్రెస్ శాసనసభాపక్షనేత మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వంపై కచ్చితమైన విమర్శలు, ఆరోపణలు చేశారు. పలు సందర్భాల్లో గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను గుర్తుచేసి, ఎత్తిపొడిచారు. బీజేపీ సభ్యుడు రఘునందనరావు రాష్ట్రప్రభుత్వాన్ని పొగుడుతూనే విమర్శలూ చేశారు. కేంద్ర విధానాలపై సీఎం కేసీఆర్ విమర్శలు చేసినప్పుడు ఆయనేం స్పందించలేదు. జీరో అవర్‌లో సభ్యుల వినతుల వెల్లువ కొనసాగింది. గ్రామకార్యదర్శుల నియామకాన్ని ప్రస్తావించిన సీఎం కేసీఆర్ రద్దయిన వీఆర్వోల హౌదా ఏమిటో చెప్పలేదు. ఇవే అంశాలపై పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు కూడా సుదీర్ఘ వివరణ ఇచ్చారు. మస్తుగా చేశామనీ, చేయాల్సింది ఇంకా చాలా ఉందనీ చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి తరఫున మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి స్టాంప్ డ్యూటీ సవరణల బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. 18 రకాల నిర్వహణ చార్జీలను ఈ బిల్లు ద్వారా పెంచారు. కొత్తగా ఏడు రకాల సేవల్ని పన్ను పరిధిలో చేర్చారు. 25 పైసలు ఉన్న రెవెన్యూ స్టాంప్‌ను ఒక్క రూపాయికీ, రూ.20 ఉన్న అఫిడవిట్‌ను రూ.వందకూ ఈ బిల్లు ద్వారా పెంచారు. కొన్ని సేవల పన్నులను నాలుగు నుంచి ఆరు రెట్ల వరకు పెంచేశారు. దీనివల్ల హౌసింగ్, వెహికల్ రుణాలు, ఇన్సూరెన్స్ పాలసీలు సహా పలు సేవలపై ఆర్థికభారం పెరుగుతుంది. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయం మాత్రమే కొనసాగింది. సభ ప్రారంభమైన గంటన్నరకే వాయిదా పడింది.