Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరసన ప్రదర్శనలో కార్మిక నాయకుల హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రభుత్వ రంగ ఆస్తులను పరిరక్షించాలనీ, వాటిని అమ్మితే సహించేది లేదని కార్మిక సంఘ నాయకులు అన్నారు. నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ పేరుతో ప్రజల సంపదను కార్పొరేట్లకు అమ్మివేసే విధానాలను విమరించుకోవాలని డిమాండ్ చేశారు. జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, టీఎన్టీయూసీ, ఐఎఫ్టీయూ, రక్షణ, బీమా, బ్యాంక్ సంఘాల సంయుక్తాధ్వర్యంలో నారాయణగూడ చౌరస్తా వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్ సాయిబాబు, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్, ఐఎన్టీయూసీ జాతీయ కార్యదర్శి వై నాగన్న తదితరులు మాట్లాడుతూ ప్రజల ఆస్తులను బడా కార్పొరేట్ సంస్థలకు అమ్మటం ద్వారా రూ. 6 లక్షల కోట్లను సమీకరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం సిగ్గుచేటన్నారు. రహదారులు, ఓడరేవులు, క్రీడా మైదానాలు, రైల్వేలు వంటి కీలక రంగాలను అమ్మివేసి నిధులు సమీకరించుకోవాలన్న నిర్ణయాన్ని దేశ ప్రజలంతా వ్యతిరేకిస్తున్నప్పటికీ మోడీ విధానాల్లో మార్పులేదని చెప్పారు.
ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రభుత్వ ఆస్తులను అమ్మి అదానీ, అంబానీకి మేలు చేస్తారా అని ప్రశ్నించారు. టెలికం రంగంలో వంద శాతం ప్రత్యక్ష పెట్టుబడులకు మోడీ సర్కార్ ద్వారాలు తెరవటం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 5 జీఓలను పరిశ్రమల అధిపతులు అడ్డుకుంటున్నారని చెప్పారు. అంతకుముందు చౌరస్తా వద్ద నిరసన ప్రదర్శనలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో రక్షణ రంగం నాయకులు బి చంద్రయ్య, జె వెంకటేశ్, పి ప్రేంపావని తదితరులు పాల్గొన్నారు.