Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రాల హక్కుల కోసం కేంద్రంతో పోరాడుతాం
- ప్రాంతీయ పార్టీ నేతగా కేంద్రం తీరును వ్యతిరేకిస్తున్నా
- తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా లేఖ రాశారు
- కేంద్రం నుంచి రాష్ట్రాలకు పన్నుల్లో వాటా రావాల్సిందే
- వక్ఫ్ ఆస్తుల అన్యాక్రాంతంపై సీబీసీఐడీతో విచారణ : పల్లె, పట్టణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రాలు తమ ఆదాయాన్ని పన్నుల రూపంలో కేంద్రానికి చెల్లిస్తుంటే, కేంద్రం మాత్రం రాష్ట్రాలను చిన్నచూపుచూస్తున్నదని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అన్నారు. అధిక తలసరి ఆదాయం అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరసలో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి అధిక ఆదాయం సమకూరుస్తున్న నాలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని పేర్కొన్నారు. రాష్ట్రాల హక్కుల కోసం అవసరమైతే కేంద్రంతో పోరాడుతామని వెల్లడించారు. ఒక ప్రాంతీయ పార్టీ నేతగా కేంద్రం తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రాలకు కేంద్రం చేస్తున్న అన్యాయంపై తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా కేంద్రానికి లేఖ రాశారని వివరించారు. శాసనసభలో గురువారం పల్లె ప్రగతి, పట్ణణ ప్రగతిపై అంశాలపై జరిగిన స్వల్పకాలిక చర్చలో సీఎం మాట్లాడారు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు పన్నుల్లో వాటా రావాల్సిందేనని వ్యాఖ్యానించారు. రాష్ట్ర జాబితాలోని అనేక అంశాలను కేంద్ర జాబితాలోకి చేర్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు రాష్ట్రాల అధికారాలను తగ్గించాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీలో చేరుస్తామంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం వ్యతిరేకించాయని గుర్తు చేశారు. పెట్రోల్, డీజిల్‌పై వచ్చే ఆదాయాన్ని కూడా రాష్ట్రాలకు రాకుండా చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరినట్టు తెలిపారు. గ్రామాల్లో రైతుల కోసం లక్ష కల్లాలు నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఒక్కో సీజన్లో రూ.300 కోట్ల విలువైన వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరించిందనీ, అయితే దాన్ని కొనేది లేదంటూ ఇప్పుడు కేంద్రం చెప్పడం సరైందికాదన్నారు. రాష్ట్రంలో 2,600కుపైగా రైతు వేదికలు నిర్మించామని చెప్పారు.
కల్తీ విత్తనాల సరఫరాదారులపై పీడీ చట్టం నమోదు చేస్తున్నామన్నారు. ఉపాధి హామీ పథకం పనులను కేంద్రమంత్రి, అధికారులు ప్రశంసించారని గుర్తు చేశారు. జాతీయ ఉపాధి హామీ చట్టం కింద చేపట్టిన పనుల గురించి తెలిసి ప్రధాని కూడా మెచ్చుకున్నారని పేర్కొన్నారు. వక్ఫ్‌బోర్డు ఆస్తుల అన్యాకాంత్రంపై సీబీసీఐడీ విచారణ జరిపిస్తామని చెప్పారు.
కరెంట్ తరహాలోనే 24 గంటలు నీళ్లు : కేసీఆర్
హైదరాబాద్‌లో పెరుగుతున్న అవసరాలకనుగుణంగా రూ 1,200 కోట్లతో నగర శివారు ప్రాంతాల అభివద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. పేదవారికి రూపాయికి నల్లా కనెక్షన్ ఇస్తున్నామనీ, రూ 5,378 కోట్లతో ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నట్టు తెలిపారు. భవిష్యత్తులో విద్యుత్ తరహాలోనే 24 గంటలపాటు నీళ్లు అందించేలా తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
పచ్చదనం కోసం 10శాతం 'గ్రీన్‌బడ్జెట్'
మున్సిపల్ చట్టంలో అనేక మార్పులు చేసి, పౌరుల భాగస్వామ్యం ఉండేలా చర్యలు తీసుకున్నట్టు సీఎం కేసీఆర్ వివరించారు. పట్టణాల్లో పచ్చదనం పెరిగేలా 10 శాతం నిధులను గ్రీన్‌బడ్జెట్ కోసం కేటాయించినట్టు తెలిపారు.
పట్టణాల్లో చెరువులను కూడా అభివద్ధి చేస్తున్నామని వివరించారు. పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు పెంచడంతోపాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలను భారీగా పెంచామన్నారు. స్థానిక సంస్థలకు ఇచ్చే నిధుల్లో కేంద్ర ప్రభుత్వం 25 శాతం కోత విధించిందని విమర్శించారు. నిధుల కోసం గ్రామ పంచాయతీల ఆస్తులను తాకట్టు పెట్టుకొమ్మంటూ కేంద్రం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో బోరు బావుల్లో పడి ఎందరో పిల్లలు చనిపోయారనీ, ఈ నేపథ్యంలో నిరుపయోగంగా ఉన్న బోరుబావులను పూడ్చేశామని చెప్పారు. గతంలో 9 వేల గ్రామాలకు 3వేల పంచాయతీ కార్యదర్శులు ఉండేవారనీ, ఇప్పుడు ప్రతి గ్రామానికి ఒక పంచాయతీ కార్యదర్శిని నియమించామని చెప్పారు. ప్రస్తుతం 9,800 మంది పంచాయతీ కార్యదర్శులు ఉన్నారనీ, ఊరికొక పంచాయతీ కార్యదర్శి ఏ రాష్ట్రంలోనూ లేరని వివరించారు.
ఇకపై పల్లెల్లోనూ దవాఖానాలు
రాష్ట్రంలో 300 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని ముందుగా నిర్ణయించినప్పటికీ ప్రస్తుతం 350 అందుబాటులోకి తీసుకొచ్చామని సీఎం తెలిపారు. రానున్న రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లోనూ పల్లె దవాఖానాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ప్రజలకు పల్లెల్లోనే వైద్యం అందేలా ఏర్పాటు చేస్తామనీ, గ్రామీణ ప్రాంతాల్లో డయాగ్నోస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని అన్నారు.
ఏడేండ్లలో 18,600 కిమీ రోడ్లు నిర్మించాం
కాంగ్రెస్ ప్రభుత్వం పదేండ్లలో రూ.3,618 కోట్లు ఖర్చు చేసి 13,800 కి.మీ.రోడ్లను నిర్మిస్తే, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఏడేండ్లలో రూ 8,536 కోట్లు వెచ్చించి, 18,600 కి.మీమేర రోడ్లను వేశామన్నారు. గ్రామీణాభివృద్ధికి కాంగ్రెస్ చేసిన ఖర్చు రూ12,170 కోట్లయితే,ఏడేండ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.58,303 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపు అనేది నిరంతరం ఒక యజ్ఞంలా కొనసాగుతున్నదనీ, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వల్ల రాష్ట్రం రూపురేఖలు మారిపోయాయని చెప్పారు.
కలలుకనడం తప్పా..?
హైదరాబాద్ నగరం ఇస్తాంబుల్‌లాగా ఎదగాలని కలలు కనడం తప్పా? అని కేసీఆర్ ప్రతిపక్షాలను ప్రశ్నించారు. కలలు కంటాం...వాటిని నెరవేర్చుకొనేందుకు ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు. కరీంనగర్‌ను డల్లాస్‌లా చేస్తానంటూ తానెప్పుడు అనలేదనీ, కరీంనగర్ పక్కనే నది, కాలువలు అందంగా ఉంటాయనీ, వాటిని తీర్చిదిద్దుకుంటే కరీంనగర్ కూడా డల్లాస్‌లాగా కనిపిస్తుందని మాత్రమే అన్నానని వివరించారు. ఎన్నో దశాబ్దాలుగా హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా ఉందని వివరించారు. నగరాల అభివృద్ధికి ఏటా రూ 10వేల కోట్లు ఇవ్వాలంటూ కేంద్రాన్ని అడిగామనీ, ఎన్నిసార్లు అడిగినా కేంద్రం నుంచి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో వరదలు, ముంపునకు కాంగ్రెస్ ప్రభుత్వం కారణం కాదా?అని ప్రశ్నించారు. దశాబ్దాలపాటు పాలించిన ఆపార్టీ డ్రైనేజీ వ్యవస్థను ఎందుకు మెరుగు పర్చలేదని నిలదీశారు. హైదరాబాద్‌లో డ్రైనేజీ వ్యవస్థ బాగుపడాలంటే రూ15 వేల కోట్లు అవసరమని చెప్పారు.