Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20 కోట్ల మందికి అనారోగ్యం
- ప్రతి నాలుగు ఆత్మహత్యల్లో ఒకటి భారత్ లోనే...
- రేపు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఏడాది అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంగా నిర్వహిస్తున్నది. మానసిక రోగుల సంఖ్య పెరిగిపోతుండటంతో వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెంటల్ హెల్త్ సంస్థ 1992 నుంచి స్వతంత్రంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలను నిర్వహించేది. ఈ సంస్థ దాదాపు 150 దేశాల్లో కార్యక్రమాలను నిర్వహిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఈ సమస్య తీవ్రతను గుర్తించి ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రతి ఏటా వివిధ రూపాల్లో ప్రజలకు దీనిపై అవగాహన పెంచుతున్నారు. ప్రపం చాన్ని కుదిపేస్తున్న కోవిడ్-19 పరిస్థితుల్లో మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకోవాల్సిన అవసరం పెరిగిందని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
దేశంలో 20 కోట్ల మంది....
భారతదేశంలో దాదాపు 20 కోట్ల మంది మానసిక రోగులున్నట్టు 2017లో నిర్వహించిన ఒక సర్వే వెల్లడించింది. ఇందులో 16 కోట్ల మందికి తాము మానసిక రోగాలతో బాధపడుతున్న సంగతే తెలియకపోవటంతో ఎలాంటి చికిత్స తీసుకోవటం లేదని తెలిసింది. అంటే ఆ రోగుల్లో 80 శాతం ఎలాంటి చికిత్స తీసుకోకుండా వ్యాధి తీవ్రతకు లోనవుతున్నారు. పైపెచ్చు ఈ విషయంలో అపోహలకు గురై విద్య, ఉపాధి అవకాశాలు పొందటంలోనూ ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టు శాస్త్రీయ అధ్యయనాలు తెలుపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న ప్రతి నాలుగు ఆత్మహత్యల్లో ఒకటి మన దేశంలోనే జరగటం మరింత బాధ కలిగిస్తున్న అంశం.
వ్యాధిగ్రస్తులను గుర్తిస్తున్నాం : రాష్ట్ర వైద్యారోగ్యశాఖ
రాష్ట్రంలో మానసిక అనారోగ్యం కలిగిన వ్యాధిగ్రస్తులను గుర్తించి, పూర్తిస్థాయిలోచికిత్స అందించి వ్యాధి నియంత్రణ కోసం ప్రయత్నిస్తున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆశావర్కర్లతో ఇంటింటి సర్వే నిర్వహించి ఇలాంటి సమస్య ఉన్న వారిని గుర్తించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో మానసిక వైద్య నిపుణుల సహకారంతో కౌన్సిలింగ్, ఔట్ పేషెంట్ సేవలందిస్తున్నామని తెలిపింది. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేస్తూ, తీవ్రమైన వ్యాధిగ్రస్తులకు జిల్లా కేంద్రం ఆస్పత్రిలో ఉన్న అసంక్రమిత వ్యాధుల (ఎన్సీడీ) కేంద్రాలకు సిఫారసు చేస్తున్నారని తెలిపారు. 2017 ఆగస్టులో ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రస్తుతం 21 జిల్లాల్లో వైద్యవిధాన పరిషత్, జాతీయ ఆరోగ్య మిషన్, మానసిక వైద్యుల ఆధ్వర్యంలో సేవలందిస్తున్నది. మిగిలిన జిల్లాల్లోనూ దశల వారీగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు ప్రకటించింది.