Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందరికీ నివాసం ఎప్పటిలోగా కల్పిస్తారు? : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో అవసరమైన వారందరికీ నివాసాలను ఎప్పటిలోగా కల్పిస్తారని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రశ్నించారు. శాసనమండలిలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఇండ్ల నిర్మాణం కోసం ఆర్థిక సహాయంపై ఆయన పలు ప్రశ్నలను సంధించారు. దారిద్య్రరేఖకు దిగువన ఉండి, స్వంత ఇంటి స్థలాలు కలిగి ఉన్నకుటుంబాలకు, ఇండ్ల నిర్మాణం నిమిత్తం ఒక్కొక్క కుటుంబానికి రూ.ఐదు లక్షల చొప్పున మంజూరుకు సంబంధించిన వివరాలివ్వాలనీ, ప్రస్తుతం అవి ఏ దశలో ఉన్నాయో తెలపాలని కోరారు. కూడు, గూడు, గుడ్డ మనిషికి ప్రాథమిక అవసరాలనీ, అందులో అందరికీ పౌష్టికాహారం లభించకపోయినా తిండి దొరుకుతున్నదనీ, టెక్స్ టైల్ విస్తరణతో వస్త్రాలు దొరుకతున్నాయనీ, అయితే నివాసానికే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో ఎన్ని కుటుంబాలు ఇండ్లు లేకుండా ఉన్నాయనీ, అలాంటి వారి కోసం చేపట్టిన ఇండ్ల నిర్మాణాలు పూర్తి కావటానికి ఎన్నేండ్లు పడుతుందని అడిగారు. ఇండ్ల నిర్మాణం అనేది నిరంతరం కొనసాగుతుందనీ, అందుకోసం మాస్టర్ ప్లాన్ అవసరమని సూచించారు. గత పాలకుల హయాంలోనూ ఇండ్లు నిర్మించారనీ, వాటి పరిస్థితి ఏంటో చెప్పాలన్నారు. స్థలాభావం కారణంగా బహుళ అంతస్థుల భవనాలు నిర్మించిన చోట వాటి నిర్వహణ కోసం చర్యలు తీసుకోవాలని కోరారు.
కేంద్రానిది తప్పుడు ప్రచారం : వేముల ప్రశాంత్ రెడ్డి
డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారనీ, అలాంటి ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా అవాస్తవాలను ప్రచారం చేయటం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.10,442 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. ఇండ్ల నిర్మాణంలో ఒక రూపాయి ఖర్చు చేస్తే అందులో కేంద్రం వాటా 15 పైసలు మాత్రమేననీ, అవి కూడా పూర్తిగా ఇవ్వలేదన్నారు. ఈ వాటా కూడా కేవలం నిర్మాణానికేననీ, అది కాకుండా ఇండ్ల స్థలాల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. మూడేండ్లుగా కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్రంలో 2.91 డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేశామనీ, వీటి కోసం రూ.18 వేల కోట్లు అంచనా వ్యయం ఉందన్నారు. ఇందులో 1.3 లక్షల ఇండ్ల నిర్మాణం పూర్తయిందనీ, మరో 70 వేల ఇండ్లు 90 శాతం పూర్తయ్యాయనీ, 55 వేల ఇండ్లు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. సొంత ఇంటి స్థలాలను కలిగున్న దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఇంటి నిర్మాణం నిమిత్తం రూ.ఐదు లక్షల చొప్పున మంజూరు చేయాలన్న ప్రతిపాదనలకు సంబంధించి ఇంటి యూనిట్ వ్యయం, మార్గదర్శకాలు ఖరారు దశలో ఉన్నాయని తెలిపారు.