Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తక్షణం తాత్కాలిక ఉపాధ్యాయులను నియమించాలి: ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల నమోదు బాగా పెరిగిన నేపథ్యంలో టీచర్ల సర్దుబాటు చేస్తే సమస్య తీరదని, ఇందుకోసం తక్షణం తాత్కాలిక ఉపాధ్యాయుల నియామకం చేపట్టాలని ఎమ్మెట్సీ నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె. జంగయ్య అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సంఖ్యకు సరిపడే ఉపాధ్యాయుల ఏర్పాటు, పాఠశాలల పరిశుభ్రత అత్యంత ప్రాధాన్యమైందని తెలిపారు. అందుకోసం తాత్కాలిక ఉపాధ్యాయుల నియామకంతో పాటు ప్రతి పాఠశాలకు స్వచ్ఛ కార్మికులను ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలకు బాధ్యత అప్పగించడంతో సరిపెట్టుకుంటే క్షేత్రస్థాయిలో ఆశించిన విధంగా పారిశుధ్య పనులు జరగడం లేదన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసుకునేందుకు, ప్రభుత్వ విద్యను నిలబెట్టుకునేందుకు ప్రతి ఉపాధ్యాయుడు బాధ్యత తీసుకునే విధంగా సంఘ కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు. కె. జంగయ్య మాట్లాడుతూ దసరా సెలవుల అనంతరం కరోనా రక్షణ చర్యలు పాటిస్తూ సాంఘిక సంక్షేమ హాస్టళ్ళ, అన్నిరకాల గురుకుల, కెజిబివి పాఠశాలలన్నింటిని ప్రారంభించాలని కోరారు. భౌతిక దూరం, మాస్క్ ధరించడం, శానిటైజేషన్ లాంటి కరోనా రక్షణ చర్యలతో పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమై కొనసాగుతున్నాయని గుర్తుచేశారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ళు, కెజిబివి, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులుకు ఆ సౌకర్యం లేకపోవడంతో విద్యకు దూరమయ్యే ప్రమాదమున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ జోనల్ విధానం, లోకల్ కేడర్ ఆర్గనైజేషన్‌కు రాష్ట్రపతి ఆమోదం లభించనందున విద్యాశాఖ వెంటనే సర్వీసు నిబంధనలు రూపొందించి అన్ని స్థాయిల్లో పదోన్నతులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు ప్రధాన కార్యదర్శి ప్రవేశపెట్టిన రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు, ప్రాతినిధ్యాలు, తదితర కార్యకలాపాల నివేదికపై అన్ని జిల్లాల నుండి హాజరైన ప్రతినిధులు చర్చించి ఆమోదించారు.
రాష్ట్ర కమిటీ తీర్మానాలు
ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య బాధ్యతను గ్రామ పంచాయితీ/ మున్సిపాలిటిలకు అప్పగించారు. కాని 40 శాతం పాఠశాలల్లో మాత్రమే పారిశుధ్యం జరుగుతున్నది. 14 శాతం పాఠశాలల్లో మాత్రమే టాయిలెట్ల శుభ్రత కొనసాగుతున్నది. ఇది వాస్తవ పరిస్థితి. కాని ప్రభుత్వం మాత్రం సర్వీసు పర్సన్స్‌ను నియమించుట అవసరం లేదని చెప్తోంది. తక్షణం సర్వీసు పర్సన్స్ నియామకాలు చేపట్టాలి. ప్రతి నెల ఒకటవ తేదిన జీతాలు చెల్లించేలా అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలి.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన హరిత నిధి కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులనుండి కంట్రిబూషన్ తీసుకుంటున్నది. హరిత నిధి కాన్సెప్ట్‌ను బలపరుస్తూనే తద్వారా వచ్చే నిధులతో ఎక్కువ భాగం పాఠశాల పరిసరాలలో గ్రీనరీ కోసం ఉపయోగించేలా విధివిధానాలు రూపొందించాలి. మహిళలు/ బాలికలపై జరుగుతున్న దురాగతాల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి అత్యంత నిర్లక్ష్యంగా ఉంటున్నది. నిర్భయ చట్టం తెచ్చాం. అంతా అయిపోతుంది. అనే భ్రమలు కల్పించారు. కాని రోజు రోజు అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. దీనికి ప్రధాన కారణాలైన యువత నిరుద్యోగం, సారాయి. మత్తు పదార్థాల వినియోగం అనే విషయాలను ప్రభుత్వాలు గుర్తించడం లేదు. కనుక దేశంలో మహిళల పట్ల దోరణిలో మార్పు కోసం ప్రయత్నించాలి. అప్‌గ్రేడేడ్ పండిత్, పీఈటీ పదోన్నతులు కల్పించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలి. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్. రాములు, సిహెచ్ దుర్గాభవాని, కోశాధికారి టి. లక్ష్మారెడ్డి, ప్రధాన సంపాదకులు పి. మాణిక్‌రెడ్డి కార్యదర్శులు బి. నర్సింహారావు, యం.రాజశేఖర్‌రెడ్డి, ఎ. వెంకటి, జి. నాగమణి, ఈ. గాలయ్య, బి. రాజు, కె. రవికుమార్, రవిప్రసాద్‌గౌడ్, జి. శ్రీధర్, రంజిత్‌కుమార్, సిహెచ్. మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.