Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జనాభా లెక్కల్లో భాగంగా బీసీ కులగణన చేపట్టాలనే తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. 2021 జనాభా గణనలో బీసీల కుల గణన కూడా చేయాలని కేంద్రాన్ని కోరుతూ శాసనసభలో సీఎం కేసీఆర్, మండలిలో మంత్రి కేటీఆర్ తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..'2021జనాభా లెక్కలు చేయబోతున్నారు. ఇప్పటికే పలు అసెంబ్లీలు, పలు రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా కేంద్రానికి తీర్మానాలు పంపిస్తున్నాయి. బీసీ జనగణనపై ఏకగ్రీవ తీర్మానం చేయాలని సభలో సభ్యులు చెప్పారు. మన రాష్ట్రంలో బీసీలు అత్యధికంగా 50 శాతం వరకు ఉన్నారు. బీసీల్లో అణగారిన, పేద కులాలు అనేకం ఉన్నాయి. బీసీలకు సాంఘికంగా, విద్యాపరంగా, అనేక రంగాల్లో న్యాయం జరగాలి. రాజ్యాంగంలోని 243డి, 243 టి లో గల నిబంధనల ప్రకారం సాధారణ జనాభా లెక్కలను నిర్వహించేటప్పుడు కులంవారీగా వెనుకబడిన తరగతుల పౌరుల జనాభా లెక్కలను వెలికి తీయాలి.అందుకే కేంద్ర ప్రభుత్వం బీసీ కుల గణన చేయాలనే తీర్మానాన్ని ప్రతిపాదిస్తున్నాను' అని తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఈ బిల్లును ఇటు శాసనసభ, అటు శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదించాయి.