Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెరువులను తలపించిన రోడ్లు
- భారీ ట్రాఫిక్ జామ్
- అమీర్‌పేటలో 14.2 సెం.మీ వర్షపాతం
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ మహానగరంలో శుక్రవారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. గంటల వ్యవధిలోనే చాలా చోట్ల పది సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది. మహేశ్వరం పరిధిలోని అమీర్‌పేటలో అత్యధికంగా 141.3 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. రాష్ట్రం మీదుగా ఉపరితల ఆవర్తనం నెలకొనడంవల్లనే భారీ వర్షం పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె. నాగరత్న తెలిపారు. రెండు గంటలపాటు ఉరుములు, మెరుపులతో కుండపోత వర్షం కురవడంతో నగరవాసులు వణికిపోయారు. ఉద్యోగులు ఇండ్లకు చేరే సమయంలో వర్షం రావడంతో ఎక్కడికక్కడ తలదాచుకున్నారు. వర్షం తగ్గుతుందేమో అనుకుంటే వాన దంచికొట్టడంతో రోడ్లు వాగులను తలపించాయి. పంజాగుట్ట ప్రాంతంలో రోడ్డుపై భారీగా నీరు చేరడంతో వాహనదారులు పడిపోయారు. పలుప్రాంతాల్లో వాహనాలు మొరాయించడంతో తోసుకుంటూ వెళ్లారు. ఎక్కడ మ్యాన్‌హోల్ ఉంటుందో అని బిక్కుబిక్కుమంటూ వెళ్లాల్సిన పరిస్థితి. విజయవాడ జాతీయ రహదారిపై భారీగా నీరు చేరింది. సుష్మ, పనామా, చింతలకుంట జంక్షన్లలో మోకాల్లోతు నీరు చేరడంతో ఎల్బీనగర్- హయత్‌నగర్ మార్గంలో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. చంపాపేట్‌లో ఓ వ్యక్తి మ్యాన్‌హోల్‌లో పడినట్టు ప్రచారం జరుగుతుంది. బైక్‌పై వస్తున్న మరో వ్యక్తి నాలా దాటు తుండగా పడిపోవడంతో స్థానికులు కాపాడారు. భారీ వర్షం నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులను మేయర్ విజయలక్ష్మి ఆదేశించారు. ఈ సందర్భంగా మాన్సూన్ బృందాలను అప్రమత్తం చేశారు. సరూర్‌నగర్‌లోని లింగోజిగూడ వార్డు ఆఫీసు పరిధిలో 13.08 సెంటీమీటర్లు, నందిగామలో 12.80సెం.మీ, సైదాబాద్‌లో 12.08 సెంమీ, ఎల్బీనగర్లో 11.28 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో శుక్రవారం రాత్రి 50 ప్రాంతాల్లో భారీ వర్షం కురువగా..ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 45 చోట్ల కుండపోత వర్షం పడింది. రాష్ట్ర మొత్తం మీద 342 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. పదో తేదీన ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.