Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండలిలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పల్లెలు, పట్టణాల్లో సమగ్రాభివృద్ధి జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని శాసనమండలి సభ్యులు అలుగుబెల్లి నర్సిరెడ్డి సూచించారు. ఇటీవల తాను ఖమ్మం, వరంగల్, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లో విస్తృతంగా పర్యటించానని చెప్పారు. గ్రామాల్లో వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డులు, పల్లెవనాలు, చెట్లు నాటడం, నర్సిరీలతో కొంత మార్పు కనిపిస్తున్నదన్నారు. శుక్రవారం శాసనమండలిలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. గ్రామాలు, పట్ణణాల్లో వేగంగా అభివృద్ధి జరక్కపోయినా గతం కంటే మెరుగుదల కనిపిస్తున్నదని చెప్పారు. ఏడేండ్ల కాలంలో పల్లెలు బాగుపడ్డాయనీ, అయితే ప్రజలు, యువత ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి లేదని వివరించారు. గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, పరిశుభ్రత, చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లను సమకూర్చడం, చెట్ల పెంపకం తదితర చర్యలను తాను అభినందిస్తున్నట్టు చెప్పారు. అడవులు తరిగిపోతున్న తరుణంలో పల్లె వనాలు గ్రామాల్లో కనిపిస్తున్నాయని వివరించారు. ఆయా పాఠశాలలు, ప్రభుత్వ సంస్థల్లో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో 26వేల ప్రభుత్వ పాఠశాలు ఉన్నాయనీ, అందులో 4వేల పాఠశాల్లో రెగ్యులర్ స్వీపర్లు ఉన్నారనీ, 22వేల పాఠశాలల్లో అసలే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. బడులకు తాళాలు వేసే పని హెడ్మాస్టర్లు చేస్తున్నారని గుర్తు చేశారు. దసరా సెలవుల్లో పాఠశాలలపై సర్వే చేయించి, సాధ్యాసాధ్యాలు ఆలోచించాలని కోరారు. హైటెక్‌సిటీ వద్ద ట్రాఫిక్‌ను క్రమబద్థీకరించడంతో ప్రయాణికులకు కొంత సమయం తగ్గిందన్నారు. మున్సిపాల్టీలను అభివృద్ధి చేసేందుకు సూక్ష్మస్థాయిలో ప్రణాళికలు రూపొందించాలని కోరారు. పేదలు, మధ్యతరగతి వర్గాలకు మంచినీరు సరిగా అందడం లేదని చెప్పారు. పేదలు నివసిస్తున్న ప్రాంతాలపై చిన్నచూపు తగదని చెప్పారు.మంత్రి కేటీఆర్ చెబుతున్న సమ్మిళిత అభివృద్ధిని వెంటనే కార్యరూపంలోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.